RSS 100 Years Celebrations: ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇప్పుడు తెలంగాణలో విస్తరించడమే టార్గెట్ గా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో శాఖ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చేయబోతున్నారు? ఎలా విస్తరణకు ప్లాన్ చేశారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో మరింత బలపడేందుకు ఎందుకు ప్లాన్ చేశారన్నదే ఇప్పుడు అసలు మ్యాటర్.
1925 సెప్టెంబర్ 27న RSS ఆవిర్భావం
1925 సెప్టెంబర్ 27న నాగ్ పూర్ లో ఏర్పాటైంది. ఈ సెప్టెంబర్ 27 వస్తే వందేళ్లు. అంటే శతాబ్ది ఉత్సవాలు ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ ప్రిపేర్ చేసింది. అంతే కాదు.. విస్తరణ కూడా ఎవరూ ఊహించని వేగంతో చేయాలనుకుంటోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతోంది. ఇప్పుడు రాబోయే విజయదశమి రోజున చరిత్ర తిరగరాయాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది. తమిళనాడు మొదలుకుని కశ్మీర్ దాకా పథసంచలన్, శోభాయాత్రలు, ఘోష్ ఇవన్నీ చేయబోతున్నారు. ఈ ఏడాది దసరా నుంచి 2026 దసరా మధ్యలో శతాబ్ది వేడుకల కోసం సంఘ్ వేసుకున్న ప్లాన్ ఓ రేంజ్‌లో ఉంది.
గత నాలుగైదేళ్లుగా పెరిగిన సంఘ్ సభ్యత్వాలు
1925లో సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచీ చాలా సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో RSS రోజువారీ శాఖలు 83,129 నడిచేదాకా వెళ్లాయి. నాలుగైదేళ్లుగా శాఖలు, పాల్గొంటున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినట్లు సంఘ్ అంటోంది. గతేడాదితో పోల్చితే 10 వేలకు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాయన్నారు తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్. వీటితో పాటు 32,147 వీక్లీ శాఖలు, 12,091 నెలవారీ శాఖలు నడుస్తున్నాయని, మొత్తంగా అన్నీ కలిపి 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
2026 దసరా నాటికి 4 వేలకుపైగా కొత్త శాఖలు టార్గెట్
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణలో మరింత బలపడేలా వ్యూహం రచించింది సంఘ్. ఇప్పటికే ఇక్కడ బీజేపీ కొత్త జోష్ తో ఉంది. అలాంటి సమయంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో సంఘ్ శాఖలు నిర్వహించేలా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రతి పల్లెలో ఉనికి ఉండేలా చూసుకుంటున్నారు. 2026 దసరా నాటికి తెలంగాణలో 4 వేలకుపైగా కొత్త శాఖలను స్థాపించాలనుకుంటున్నారు. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ, నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ ప్రచారాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్ మొదలు పెట్టబోతోంది.
ప్రతి ఇంటికి వందేళ్ల RSS గురించి కరపత్రాల పంపిణీ
ఇదో కొత్త యాంగిల్. తెలంగాణలో మొత్తం 1,839 ప్లేసుల్లో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు మొదలయ్యాయి. ప్రతీవారం జరిగే సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయన్నారు కాచం రమేశ్. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైనే సంఘ్ శాఖలు రన్ అవుతున్నాయి. ఈ RSS శాఖల్లో యూత్, స్టూడెంట్సే ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి యూత్ టార్గెట్‌గా మరిన్ని కార్యక్రమాలకు సంఘ్ ప్లాన్ చేసుకుంటోంది.
గతేడాది తెలంగాణలో దసరా నాడు భారీ రూట్ మార్చ్
గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో 10 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఆ లెక్కన శాఖలకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటే స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘ్ విస్తరణ ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే హిందూ సొసైటీలో ఏ వర్గాన్ని కూడా పక్కన పెట్టకుండా అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది తెలంగాణలో విజయదశమి వేడుకల సందర్భంగా 161 ప్రదేశాలలో జరిగిన రూట్ మార్చ్‌లలో 50 వేల మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు. ఇందులో 28 వేల మందికి పైగా స్వయం సేవక్స్ సంఘ యూనిఫామ్‌లో పాల్గొన్నారని తెలంగాణ ఆర్ఎస్ఎస్ శాఖ అంటోంది.
లక్షకు పైగా ప్రదేశాల్లో RSS శాఖల నిర్వహణకు ప్లాన్
సెప్టెంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు లక్షకు పైగా ప్రదేశాలలో ఒక వారం పాటు RSS శాఖలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సో దీన్ని ఆరెస్సెస్ బలోపేతం అన్న యాంగిల్ లోనే చూడ్డానికి వీల్లేదు. రాజకీయంగానూ ఫుల్ ఎఫెక్ట్ పెంచుకునేలా ప్లానింగ్ నడుస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో కొత్త జోష్ తో కనిపిస్తోంది. ఈ టైంలోనే ఆర్ఎస్ఎస్ అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణలో విస్తరించే ప్లాన్ అంటే మ్యాటర్ వేరే లెవెల్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది.
RSS ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్న ఐదు అంశాలేంటి?
ఈ సెప్టెంబర్ వస్తే ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు అవుతుంది. మరి ఈ వందేళ్లలో సంఘ్ ఏం చేసింది? నేడు దేశంలో 1 కోటి మందికి పైగా స్వయంసేవకులు ఉన్నారని చెబుతున్న సంఘ్ పెద్దలు ఎలాంటి ఫ్యూచర్ టార్గెట్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సామాజిక సమస్యలపై సంఘ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? తమ అనుబంధ సంస్థలకు పొలిటికల్ ప్లాట్ ఫామ్ గా ఆరెస్సెస్ శాఖలు ఉపయోగపడుతున్నాయా? RSS ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్న ఐదు అంశాలేంటి?
హిందుత్వ భావజాల విస్తరణే లక్ష్యం
రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సంఘ్ స్పెషాలిటీ. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్ తాజా ఆలోచన. కేవలం సంఘ్ భావజాల వ్యాప్తే కాదు.. ఇంకొన్ని లక్ష్యాలు కూడా ఇప్పటికే వారు పెట్టుకున్నారు. సామాజిక అంశాలైన ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ఫోకస్ పెంచుతున్నారు.
మహిళలను గౌరవించడం, రక్షణగా నిలబడడం
అంతే కాదు.. గ్రామ వికాస కార్యక్రమాల పేరుతో మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి ఆపద వస్తే రక్షణగా నిలబడడం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోసంపద వృద్ధి, కుటుంబాల్లో మనస్పర్ధలు తగ్గించేలా, వృద్ధులను ఆదరించేలా, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించేలా చేయడం, సోషల్ మీడియా అనర్ధాలపైనా కార్యక్రమాల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా ఉంది.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 5 అంశాలపై ట్రైనింగ్
తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 5 అంశాలపై యూత్ కు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. అందులో సామాజిక సామరస్యం, కుటుంబం, పూర్వీకులు కుల దేవత గురించి స్మరించుకోవడం, పర్యావరణ పరిరక్షణ, మాతృభాషలో మాట్లాడటం, భారతీయ సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం, సంస్కృతిని కాపాడడం, ప్రజల బాధ్యతల గురించి తెలిపేలా శిక్షణ ఉండబోతోంది. సంఘ్ వందేళ్ల ఆవిర్భావ వేడుకల్లో భాగంగా RSS ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్-డిసెంబర్-జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమం జరగబోతోంది.
సంఘ్ లో 14-25 ఏళ్ల మధ్య వయసున్న వారి చేరిక
ఇందులో హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నారు సంఘ్ పెద్దలు. గతేడాది సర్ సంఘచాలక్ మోహన్ భగవత్.. సంఘ్ కార్యకలాపాల విస్తరణ, ఏకీకరణ కోసం 2 ఏళ్లు కేటాయించే కార్యకర్తలను ఆహ్వానించారు. ఈ పిలుపుతో 2,453 మంది స్వయంసేవకులు తమ ఇళ్లు వదిలి పూర్తిస్థాయి సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అటు సంఘ్ కార్యకలాపాల్లో చేరే యువకుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఏడాది, లక్షలాది మంది యూత్, ముఖ్యంగా 14-25 ఏళ్ల మధ్య వయసున్న వారే సంఘ్ లో చేరుతున్నారంటున్నారు.
విపత్తు సహాయాల్లో కీలకంగా ఆర్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ అంటే సామాజిక సేవలో ముందుంటుందన్న అభిప్రాయం ఉంది. వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, కొండ చరియలు విరిగిపడ్డా.. సమస్య ఏదైనా విపత్తుల్లో సహాయాలు చేస్తూ స్వయం సేవకులు కనిపిస్తుంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాల పట్ల యువతలో ఆసక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సమాజానికి సేవ అన్నది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రధాన అంశం. ఇటీవల కుంభమేళలోనూ వచ్చిన వారికి కంటి పరీక్షలు చేయించడం, పర్యవరణ పరిరక్షణ కోసం ఏక్ థైలా – ఏక్ థాలి ప్రచారం చేసింది సంఘ్. ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథిన్ బ్యాగుల వాడకం తగ్గించడానికి ప్రయత్నించింది.
సౌత్ నార్త్ రాజకీయ ప్రేరేపితం అన్న సంఘ్
ఇవే కాదు.. సౌత్ నార్త్ విషయాలపైనా సంఘ్ రియాక్ట్ అయింది. ఇది రాజకీయంగా ప్రేరేపితమైన విషయమన్నది. అలాగే మాతృభాష విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. మాతృ భాషను విద్యలోనే కాకుండా మన దైనందిన జీవితంలోని అన్ని అంశాలలో ఉపయోగించాలన్నది ఆర్‌ఎస్‌ఎస్ మాట. మాతృ భాషపై ఆర్‌ఎస్‌ఎస్ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. బహుళ భాషలు నేర్చుకుంటే ఉపయోగమని, కెరీర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని నేర్చుకుంటే తప్పులేదన్నది. సో సంఘ్ మ్యాటర్ ఖుల్లం ఖుల్లాగా ఉంది.
తెలంగాణలో సంఘ్ విస్తరణకు అనుకూలంగా ఉందా?
దేశంలో కొన్ని ప్రాంతాలే ఆరెస్సెస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. అందులో ప్రధానమైంది, ముఖ్యమైంది తెలంగాణే. అందుకే ఇక్కడ శాఖల విస్తరణకు బహుముఖ ప్రణాళికలు రచించారు ఆరెస్సెస్ పెద్దలు. భారీ టార్గెట్లు నిర్దేశించారు. అందుకే ఇటీవలే హైదరాబాద్ వేదికగా కీలక కార్యక్రమాలను సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2019లో హైదరాబాద్ లో RSS నిర్వహించిన పథసంచలన్ ఒక వైబ్ క్రియేట్ చేసింది. పెద్ద ఎత్తున స్వయం సేవకులు ప్రధాన రోడ్లలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం చూసి ఇక్కడ మరింత విస్తరణకు ప్లాన్ చేశారు. అయితే ఇది రాజకీయ పరంగానూ బీజేపీకి ప్లస్ అయ్యేలా ప్రణాళికలు నడుస్తున్నాయంటున్నారు.