తెలంగాణకు మరో రెండు వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైళ్లతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రైలు కనెక్టివిటీ మరింత పెరగనుంది. కొత్త వందేభారత్ రైళ్లలో ఒకటి హైదరాబాద్- పూణే మధ్య నడవనుండగా, మరొకటి సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వందేభారత్ సర్వీసులు ప్రయాణ సమయాన్ని రెండు నుంచి మూడు గంటలు తగ్గిస్తాయని భావిస్తున్నారు. నాగ్ పూర్ సర్వీస్ తర్వాత హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఇది మూడవ వందే భారత్ కనెక్షన్ అవుతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ రెండు మార్గాలను జోడించడం వలన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
కొత్త ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్-పుణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో భర్తీ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. శతాబ్ది ప్రస్తుతం దాదాపు ఎనిమిదిన్నర గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. వారానికి ఆరు రోజులు (మంగళవారాలు తప్ప) అందుబాటులో ఉంటుంది. పరిమిత స్టాప్ లతో నడుస్తుంది. రెండు AC ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, తొమ్మిది AC చైర్ కార్లు, రెండు EOG కార్లను కలిగి ఉంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్ పూర్ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లకు ఉన్న అధిక ప్రజాదరణకు ప్రతిస్పందనగా ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇవి ఎప్పుడూ హై ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ సేవలకు ప్రతిపాదనలు రూపొందించాయి. ఇది వేగవంతమైన రైలు ఎంపికల కోసం ప్రయాణీకుల నుండి పెరుగుతున్న డిమాండ్ ను హైలైట్ చేస్తుంది. ఈ రెండు కొత్త రైళ్ల చేరికతో, దక్షిణ మధ్య రైల్వే (SCR) 7 వందే భారత్ సర్వీసులను నడుపుతుంది. ఈ స్వదేశీ సెమీ హై స్పీడ్ రైళ్లలో ఎక్కువ రైళ్లు ఉన్న జోన్లలో ఒకటిగా నిలువనుంది.
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?
అటు సికింద్రాబాద్- ముజఫర్ పూర్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఒక నెలలోపు ప్రారంభించనుంది. ఇది హైదరాబాద్ నుంచి అదనపు సుదూర రైలు ఎంపికను అందిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు అత్యాధునిక రైళ్లు అందుబాలోకి వస్తున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించబోతున్నాయి.
Read Also: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!