Sai Reddy- Mopi Devi: లండన్ ట్రిప్ నుంచి రాగానే ఎన్నికల్లో విజయంపై బోల్డు ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏకంగా 30 ఏళ్లు అధికారంలో కొనసాగుతానని తన జోస్యం తానే చెప్పేసుకుంటున్నారు. ఆ సెల్ఫ్ జాతకం చెప్పుకుంటున్న క్రమంలో ఆయన పార్టీని వీడిన కీలక నేతలు, మాజీ రాజ్యసభ సభ్యుల విశ్వసనీయత గురించి మాట్లాడారు. దానిపై అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ సహ నిందితులు, మాజీ జైల్ మేట్స్ వెంటనే రియాక్ట్ అయి కౌంటర్ ఇవ్వడంతో.. జగన్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ టూర్ తర్వాత చాలా ధీమాగా కనిపిస్తున్నారు. విదేశాల్లో ఎవరో జాతకం చూసి జోస్యం చెప్పినట్లు.. జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో, అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. పవర్ పోయి 8 నెలలు కాకుండానే ఆయనలో అధికారంపై ధీమా పెరిగిపోయింది. మళ్లీ గెలుస్తాం.. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాత పాట అందుకున్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగనన్న 2 పాలన చాలా ఢిఫరెంట్‌గా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
అక్కడిలో ఆగని మాజీ ముఖ్యమంత్రి వలసలపై మాట్లాడం తేనె తుట్టెని కదిపి నట్లైంది .. అయిదు వేళ్లు మడిచి గుప్పెట చూపిస్తూ.. ప్రజాస్వామానికి కొత్త నిర్వచనం చెప్పిన జగన్.. అయిదేళ్లు ఓర్చుకోలేక పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుల గురించి చులకనగా మాట్లాడారు. వైసీపీ నుంచి క్రెడిబిలిటీ తాకట్టు పెట్టి అటు వైపుకి పోతే తనకు నష్టమేమీ లేదని వ్యంగ్యంగా మాట్లాడారు.
వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన ఆయన ఇంకా వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అలాంటిది ఆయన అటు పోయాడని వ్యాఖ్యానించిన జగన్ అసలు అలాంటి వారి అవసరం పార్టీకి లేదని.. తన పార్టీకి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొచ్చారు.
తమరాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురని.. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటని ప్రశ్నించారు. సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ మాజీ రాజ్యసభ్యుల్లో ఇద్దరు ఆయనకు వెంటనే కౌంటర్ ఇచ్చారు.
Also Read: చెల్లిపై అన్న అస్త్రం.. శైలజానాథ్ చేరిక వెనుక
ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని జగన్‌కు సున్నితంగా చురకలు అంటించారు
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మరో సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ పోస్టు పెట్టారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయా ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు, ఎన్నెన్నో ఒడిదుడుకులు చూశానన్నారు. ఈ ప్రయాణంలో నేను సంపాదించిన నా ఆస్తి.. విలువలు, విధేయత, విశ్వసనీయత.. అంతే కాని ప్రలోభాలకి, పదవీ కాంక్షలకి, అవకాశవాదానికి, ఒత్తిళ్లకి లొంగిపోయే వ్యక్తినో కాదో మీ అంతరాత్మకే తెలుసంటూ జగన్‌కి మోపిదేవి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఇద్దరు జగన్ పుణ్యమా అని జైలు జీవితం గడిపిన వారే. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులైన ఆ ఇద్దరు మాజీ ఎంపీలు ఆయనతో పాటు 16 నెలలు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండి బయటకు వచ్చారు. తర్వాత కూడా మొన్నమొన్నటి వరకు వారు జగన్ వెన్నంటే నడిచారు. ఆ ఇద్దరు నోరు విప్పి నిజాలు మాట్లాడితే ఏం జరుగుతుందో జగన్‌కు తెలియంది కాదు. ఆ క్రమంలో జగన్ అనవసరంగా వారి విశ్వసనీయత గురించి మాట్లాడి తేనెతుట్టెను కదిపారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.