Satyavedu: సత్యవేడు తెలుగు తమ్ముళ్లు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారంట .. అక్కడ పక్క పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన వ్యక్తి లైంగిక అరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ అయి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు .. దాంతో సెగ్మెంట్లో ఓ చెన్నై తెలుగు దేశం పార్టీ నాయకుడితో పాటు ఓ కింగ్ మేకర్ పెత్తనం ఎక్కువైందంట. అది భరించలేక నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ పలుమార్లు సీఎంతో పాటు పార్టీ రాష్ట అధ్యక్షుడి చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందంట .. ఆ క్రమంలో పార్టీకి పెట్టని కోట లాంటి సత్యవేడులో అసలు పార్టీ ఉందా లేదా అన్న చర్చ నడుస్తుంది..
వైసీపీ హయంలో సత్యవేడులో ప్రకృతి వనరుల దోపిడీ
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం.. ప్రకృతి సంపద పుష్కలంగా ఉండే ప్రాంతం ..అక్కడ నుంచి వైసీపీ హయాంలో గత ఐదు సంవత్సరాలు విచ్చలవిడిగా ఎర్రమట్టి, కంకర, ఇసుక తరలిపోయింది.. ఆ టైమ్‌లో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా జరిగిన నియోజకవర్గం ఏదీ అంటే సత్యవేడే అంటారు. పుంగనూరు, పులివెందులకు చెందన నేతలు అక్కడ నుంచి తమిళనాడుకు అక్రమ తవ్వకాలతో ప్రకృతి వనరులు రవాణా చేశారు. అప్పటి ఆ దందాల కారణంగా సెగ్మెంట్లో రోడ్లన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి . ఇప్పటికి రహాదారుల మరమత్తు జరగలేదు.
పెద్దరెడ్డి దందాలను వ్యతిరేకించిన కోనేటి ఆదిమూలం
సత్యవేడులో జరిగిన అక్రమాలన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే జరిగాయంటారు. అయితే అప్పుడు అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం దాన్ని వ్యతిరేకించారంట. పెద్దిరెడ్డి వర్గీయుల నిర్వాకాలతో పార్టీపై వ్యతిరేకత పెరిగిపోతోందని ఎదురు తిరిగారంట. దాంతో పెద్దిరెడ్డి కత్తిగట్టి ఆదిమూలానికి వైసీసీ టికెట్ దక్కకుండా చేయడంలో చక్రం తిప్పారు. అదే సమయంలో సత్యవేడు టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న నాయకుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఆ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లో టీడీపీ చివరి నిముషంలో కోనేటి ఆదిమూలంకు టికెట్ కేటాయించింది.
ఆదిమూలాన్ని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పెద్దరెడ్డి వర్గం
పోటా పోటీగా జరిగిన ఎన్నికలలో ఆదిమూలం గట్టెక్కగలిగారు. పెద్దిరెడ్డి మంత్రాంగంతో టిడిపిలోని ఓ వర్గం స్వంతంత్ర అభ్యర్థి రమేష్‌బాబుకు మద్దతు ఇచ్చింది. సత్యవేడు సెగ్మెంట్లో సహజవనరుల దోపిడీకి అలవాటు పడిన పెద్దిరెడ్డి వర్గం కోనేటి ఆదిమూలాన్ని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేని పెద్దిరెడ్డి వర్గీయులతో పాటు, టీడీపీలోని పెద్దిరెడ్డి అనుకూలురు టార్గెట్ చేశారంట. వారు వ్యూహాత్మకంగా పావులు కదిపి ఎమ్మెల్యే ఆదిమూలం బలహీనతను క్యాష్ చేసుకుని ఆయనపై లైంగిక వేధింపుల అభియోగాలు మోపారు
ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ పెద్దలు
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆదిమూలం వైసీపీ నుంచి తనతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అయన వ్యవహార శైలితో టీడీపీ క్యాడర్ దూరంగా ఉండి పోయింది. అదే సమయంలో ఓ మహిళ నాయకురాలితో రాసలీలల వీడియో బయటపడ్డంతో టిటిడి పెద్దలు అయనన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో హైకోర్టులో ఆయనపై కేసు వీగిపోయే విధంగా కొంతమంది పార్టీ నాయకులు చక్రం తిప్పి నియోజకవర్గాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు.
చెనై నుంచి దిగుమతి అయిన నాయకుడి ఆధిపత్యం
ఇప్పటికే సూళ్ళురు పేట, వెంకటగిరి పై పట్టుసాదించిన ఒక నాయకుడు ఇప్పుడు సత్యవేడును సైతం తన కంట్రోల్లో ఉంచుకుని అధికారుల బదిలీల నుంచి అన్ని వ్యవహారాలలో తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడంట. గతంలో ఆ నేత కేవలం సూళ్ళురు పేటకే పరిమితం అయ్యాడు. గత ఎన్నికలలో అర్థిక వ్యవహరాలు చూసాడని అతనికి పార్టీ పెద్దలు పెత్తనం అప్పగించారన్న ప్రచారం ఉంది. ఆయనతో పాటు మరో నేత చెన్నై నుంచి దిగుమతి అయి స్థానిక నేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారంట..
Also Read: దివాలా తీసిన అమెరికా.! బెడిసికొట్టిన ట్రంప్ ప్లాన్..
గ్రావెల్ అక్రమ తరలింపుపై అధిష్టానానికి ఫిర్యాదులు
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాకు వచ్చిన ప్రతి సారి సత్యవేడు టిడిపి నేతలు ఆయన్ని కలిసి తమ నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్‌చార్జీ ని నియమించమని కోరడం.. అయన మీ పనులు ఎవైనా ఉంటే తాను చేయిస్తానని చెప్పడం అనవాయితీగా మారిందంట .. ఈ నేపధ్యంలో టీడీపీ కింగ్ మేకర్‌తో పాటు చెన్నై నాయకుడు కలసి పెద్ద ఎత్తున తమిళనాడుకు గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక టిడిపి నేతలు అదిష్టానానికి ఫిర్యాదు చేశారంట.. దాంతో పాటు అధికారులు కూడా తమ మాట వినడం లేదని రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు..
నూతన ఇన్చార్జిని నియమించాలని కోరుతున్న తమ్ముళ్లు
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ అధికార యంత్రాంగం అయన వరకు పనులు చేసి పెడుతూ వైసీపీ నేతలకే స్వామిభక్తి ప్రదర్శిస్తోందంట.. ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన సత్యవేడు తెలుగు తమ్ముళ్లు తాజాగా మరో సారి రాష్ట పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలిసి తమకు వెంటనే నూతన ఇన్చార్జిని నియమించమని కోరారంట. దాంతో పాటు కింగ్ మేకర్, చెన్నై నాయకుడి పెత్తనాన్ని కంట్రోల్ చేయమని కోరారంట.. పార్టీ అవిర్బావం నుంచి పనిచేస్తున్న తమపై ఇతర ప్రాంతాలకు చెందిన నాయకుల పెత్తనం ఏంటని సత్యవేడు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ..
లోకల్ వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని వినతి
వైసీపీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల పాటు తమను వేధించిన కోనేటి ఆదిమూలాన్ని అభ్యర్థిగా ప్రకటిస్తే పనిచేసి గెలిపించామని.. ఎన్నికల ముందు నియోజకవర్గానికి దిగుమతి అయిన నేతలు తర్వాత దోపిడి చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అధారాలతో సహా రాష్ట అధ్యక్షుడికి ఫిర్యాదు చేసి.. లోకల్ వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు ఇమ్మని కోరారంట.. మొత్తం మీద అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే సత్యవేడు తెలుగు తమ్ముళ్లు త్వరలో వీధిన పడి తమ మీద పెత్తనం చేస్తున్న వారిపై తిరుగబడే రోజలు దగ్గరలో ఉన్నాయంటున్నారు .. మరి చూడాలి సత్యవేడు టీడీపీ రాజకీయం ఏ మలుపులు తీరుగుతుందో?