Yanamala Ramakrishnudu: TDPలో ఆయనో సీనియర్ నేత. ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్‌టూ అని కూడా అనిపించుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, చివరికి ప్రతిపక్షంలో ఉన్నా.. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడితే.. ప్రత్యర్థులకు కౌంటర్ వేయడానికి కూడా మాటల దొరకేవి కాదంటూ అతిశయోక్తి కాదు. అలాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నా.. ఎలాంటి ప్రాధాన్యత లేని సామాన్య నాయకుడిగా కనిపిస్తున్నాడు. టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందా.. చినబాబు వచ్చాక ఆ నాయకుడిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారా అనే ఊహానాగాలు చక్కెర్లు కొడుతున్నాయి.
తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన యనమల
తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన యనమల రామకృష్ణుడు..1983 నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. తుని నుంచి రెండుసార్లు.. ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఆయన క్యాబినెట్ హోదాలో ఉండేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో పార్టీలో ఆయన నెంబర్- 2గా ఎదిగి.. ఓ రకంగా ఆనాడు చక్రం తిప్పారని సొంత పార్టీలోనే వార్తలు వినిపించాయి.
కుమార్తె గెలిస్తే.. పెత్తనం మాత్రం తండ్రే చేస్తున్నారని టాక్
నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రం తర్వాత యనమల రామకృష్ణుడు ప్రాధాన్యత తగ్గిందనే వాదన ఉంది. యనమల, లోకేష్ మధ్య కొన్ని సందర్భాల్లో వివాదాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. 2024 ఎన్నికలకు ముందు తునిలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తన సోదరుడుని.. పక్కనపెట్టి తన కుమార్తెకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన సోదరుడు యనమలపై అలిగి.. వైసీపీలో చేరారు. 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య గెలిచారు. పెత్తనం మాత్రం యనమలే చేస్తున్నారని టాక్ ఉంది. ఆయనకు ఈసారి అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో చంద్రబాబుకు లెటర్ రాశారు.
చంద్రబాబు లెటర్ రాసిన యనమల రామకృష్ణుడు
ఓ సామాజికవర్గంపై.. అక్కసు వెళ్లగక్కుతూ లేఖ రాశారని పార్టీలోనే ప్రచారం జరిగింది. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ అయ్యిందట. తర్వాత కాలంలో ఆయన అమరావతి వెళ్లడం కూడా తగ్గించేశారు. స్థానికంగా ఉంటున్నా.. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనటం లేదనే టాక్ నడుస్తోంది. ఎవరైనా నాయకులు వచ్చి కలిస్తే మాత్రం.. మాట్లాడుతున్నారు లేదా విజయవాడలో వ్యక్తిగత పనులపై మాత్రమే వెళ్తున్నారట. మొత్తానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న యనమల కథ.. ఇక ముగిసినట్లేనని టాక్.. పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
తుని నుంచి యనమల ఓడిపోగా ఎమ్మెల్సీగా అవకాశం
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. తూర్పుగోదావరి జిల్లా అంటే.. ఠక్కున యనమల రామకృష్ణుడు పేరే వినిపించేది. నాడు రామకృష్ణుడి మాటే చెల్లుబాటు అయ్యేదని టాక్ ఉంది. తుని నియోజకవర్గం నుంచి దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా యనమల ప్రాతినిథ్యం వహించారు. ఎన్టీఆర్ హయాంలోనూ ఆయన స్పీకర్‌గా పనిచేశారు. టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్‌గా ఉన్న రామకృష్ణడు.. చంద్రబాబు వైపు నిలిచారు. ఆ కృతజ్ఞతతోనే.. యనమలకు. పార్టీ అధినేత అంత గౌరవం ఇచ్చేవారట. అందుకే తుని నుంచి యనమల ఓడిపోయినా.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. ఆయన్ను క్యాబినెట్‌లో తీసుకున్నారట. అంతేకాదు.. కీలకశాఖలు ఇచ్చి యనమల సేవలను ఉపయోగించుకున్నారనే వాదన ఉంది. అయితే.. లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం.. యనమల రామకృష్ణుడిని పక్కనే పెట్టాశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్ వ్యవహారాల్లో తనదైన పాత్ర
పార్టీలో అధినేత చంద్రబాబు తర్వాత అంత మేధాశక్తి కలిగిన వ్యక్తిగా యనమల వ్యవహరించారు. వైసీపీ అధినేత జగన్‌పైనా ఘాటు విమర్శలు చేస్తూ.. పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్ వ్యవహరాల్లో తనకున్న అనుభవంతో పనిచేశారనే పేరు కూడా రామకృష్ణుడికి ఉంది. అందుకే నాడు.. చంద్రబాబు కూడా యనమలకు అంత వాల్యూ ఇచ్చారనే టాక్ ఉంది.
Also Read: జగన్‌కు బిగ్ ఝలక్.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..!
మరోవైపు.. మార్చి నెలలో ముగియనున్న యనమల ఎమ్మెల్సీ పదవిని కొనసాగించి.. ఆయన్ను క్యాబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా తీసుకుంటారా లేదా అనేది చర్చగా మారింది. యనమల మంత్రిగా ఉంటే.. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన అనేక సంక్షేమ పథకాల అమలుకు ఉపయుక్తంగా ఉంటుందనే భావనలో కొందరు ఉన్నట్లు సమాచారం. కొందరు సీనియర్లు కూడా ఈ అంశాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఎమ్మెల్సీగా మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ
ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో కాకుండా.. చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి క్రమంలో ఈసారి యనమల రామకృష్ణుడిని పక్కనే పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది. దీనిపై అధినేత చంద్రబాబు మదిలో ఏమి ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ..యనమలకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెడితే.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ యనమల మౌనంగా ఎందుకు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో అంటీముట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారనే అంశంపై.. క్యాబినెట్ విస్తరణ తర్వాత సమాధానం దొరికే అవకాశం ఉందని.. రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని పట్టించుకోరా అనే వాదన
మరోవైపు.. పార్టీలో తనకు ప్రయార్టీ తగ్గటంపై యనమల లోలోపల మథనపడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకున్న తనకు.. ఆశించిన గౌరవం దక్కడం లేదని.. సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో వస్తే.. క్యాబినెట్‌లో ఫస్ట్ బెర్త్ యనమలకే అనే పరిస్థితి నుంచి.. అసలు తనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారనే పరిస్థితి వచ్చిందనే ఆవేదనలో ఆయన ఉన్నారటని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు.. ఆవిర్బావం నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని పట్టించుకోరా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారట.
మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ
తనతో పాటు.. తన కుమార్తె దివ్య విషయంలోనూ అధిష్టానం తీరుపై యనమల గుర్రుగా ఉన్నారట. దీంతో ఆగ్రహానికి గురై.. ఆయన ఘాటుగా లేఖ రాశారనే టాక్ నడుస్తోంది.సో… యనమల అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.