BRS Party: మాజీ మంత్రుల వ్యవహార శైలి గులాబీ పార్టీలో విమర్శలకు దారి తీస్తుందట. ఒకనాడు అన్ని తామై పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటుండడం.. ఎప్పుడో ఒకసారి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం.. అదీ వారికి కలిసివచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే నిర్వహిస్తుండడం చర్చనీయంశంగా మారిందట. అసలు గత పదేళ్లు ఆ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు.. ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల సమయంలో పార్టీ సీనియర్లు, అప్పట్లో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులుగా బాగానే చెలాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వారికి ఉన్న సాన్నిహిత్యం, ఇతరాత్రా లెక్కలతో ఆయా జిల్లాల్లో అమాత్యులు చేప్పిందే వేదంగా నడిచేది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇద్దరుముగరు మినహా మాజీ మంత్రులంతా మౌనం పాటిస్తున్నారు. పార్టీ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా మాజీ మంత్రులు అంతా అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో నడుస్తోందట.
జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం కాదు కదా.. కనీసం వారి ముఖం చూడటమే తమకు గగనమవుతోందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంట. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ, పార్టీనే అధికారంలో లేనప్పుడు, ప్రజా సమస్యలు పట్టించుకునేది ఏంటన్నట్లు వ్యవహరిస్తున్నారంట. నాడు అన్ని తామై వ్యవహరించిన నేతలు, ఇలా ఉండడం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు, తర్వాత తెలంగాణ భవన్‌కు సైతం చుట్టపు చూపుగా వచ్చిపోతూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికారంలో లేకపోవడంతో తెలంగాణ భవన్ వైపు చూడటంలేదా? లేక ఇంకేమైనా సొంత లెక్కలతో పార్టీ వ్యవహారాలకు దూరమవుతున్నారా? అని గులాబీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం తెలంగాణ భవన్‌లో హడావుడి చేసిన నేతలు, ఇప్పుడు అటువైపు చూడటమే మానేయడం క్యాడర్ సందేహాలకు ఊతమిస్తోందంటున్నారు.
Also Read: Iran–Israel War Impact: యుద్ధం అక్కడ.. మంట ఇక్కడ! గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లు.. హోటళ్లు క్లోజ్!
గ్రేటర్ లోని మాజీ మంత్రులు సైతం పార్టీ కార్యాలయానికి ఎప్పుడో ఒకసారి వచ్చి పోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు సైతం.. నామ్‌కే వాస్తేగా ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తుండటంపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే తెలంగాణ భవన్‌లో తరచూ కనిపిస్తూ, యాక్టివ్‌గా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్‌గా పాల్గొంటున్నారని జిల్లాలో పార్టీ నాయకులు చెబుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని.. సొంత నియోజకవర్గ ఖమ్మంలోనూ పర్యటించడం లేదని ప్రచారం జరుగుతోంది. పార్టీ ముఖ్యనేత పర్యటనలకు వచ్చిన సందర్భంలోనే కనిపిస్తున్నారు తప్పా… యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ.
మరోవైపు ఉమ్మడి వరంగల్ కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , ఉన్నారో లేరో ? అన్నట్లు వ్యవహరిస్తున్నారని క్యాడర్ వాపోతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నిర్దేశించి కార్యక్రమాలను మాత్రం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారంట. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానై వ్యవహరించారు. కానీ ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ నిర్వహించడం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం ఆ జిల్లాలో పర్యటనలు చేయడం లేదని, పార్టీ క్యాడర్‌కు సైతం అందుబాటులో ఉండడం లేదని ప్రచారం జరుగుతుందట.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలను బెరీజు వేసుకుని మాజీ మంత్రుల పనితీరును అంచనా వేస్తోందంట బీఆర్ఎస్ నాయకత్వం. మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లోను ఫలితాలు తారుమారు కావడంతో క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చక్కబెట్టిన అమాత్యులు….ఓటమి తర్వాత నేతలను,క్యాడర్‌ను దిశానిర్దేశం చేయడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే స్ధానిక సంస్ధ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్ధాయిలో రాలేదనేది క్యాడర్ వాపోతోంది. మంత్రులుగా ఉన్న సమయంలో విస్తృత పర్యటనలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో సైతం యాక్టివ్‌గా కనిపించిన వాళ్లు…పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడంపై గులాబీ పార్టీ పెద్దలు కూడా అసహనంతో ఉన్నారంట.
పురపాలక ఎన్నికల్లో 30కి పైగా మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్‌కు రిపోర్టులు ఇచ్చిన మాజీ మంత్రులు, ఇప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డారంట. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వెనుకబాటుపై గులాబీ దళపతి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఎక్కడ లోపం జరిగింది? గెలుస్తామనుకున్న చోట ఓటమికి గల కారణాలేంటి? అనే అంశాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారంట. ముఖ్యంగా మాజీ మంత్రుల సొంత నియోజకవర్గాల్లోనే పార్టీ ఆశించిన స్థాయిలో మున్సిపాల్టీలు గెలవకపోవటంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
మున్సిపోల్స్ వైఫల్యానికి మాజీ మంత్రులదే బాధ్యత అనే ప్రచారం పార్టీలో మొదలవ్వడంతో సదరు మాజీ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారంట. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలత ఉండటం సహజమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమై, కేవలం తమనే తప్పు పట్టడం ఏంటని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రుల తీరుపై మాత్రం గులాబి కేడర్లో విస్తృత చర్చ జరుగుతుందట. పార్టీ అధికారంలో లేకపోతే ఇలాగే వ్యవహరిస్తారా? ప్రజా సమస్యలపై స్పందించరా?.. కేవలం పవర్‌లో ఉన్పప్పుడే మెహర్బానీనా? అని గులాబీ శ్రేణులు నాయకులపై మండిపడుతున్నాయంట.
Story by: Apparao, Big Tv