Iran–Israel War Impact: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరుగా మిగిలిపోలేదు. ఈ రెండు దేశాల మధ్య రాజుకున్న సెగలు.. ఇప్పుడు భారతీయ వంటిళ్ల దాకా చేరాయి. యుద్ధం అక్కడ జరుగుతుంటే, దాని ప్రభావంతో.. మన దేశంలో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రపంచ చమురు అవసరాల్లో అత్యధిక శాతం తీర్చే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మొదలైతే.. ఆ ప్రభావం మొత్తం భూగోళంపై పడుతుంది. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడం, ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై మిసైళ్లతో విరుచుకుపడటంతో.. చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయ్. బ్యారెల్ ధర ఒక్కసారి వంద డాలర్ల మార్క్ దాటిపోయింది. ఇది భారత్ సహా ఆసియా దేశాలకు పెను భారంగా మారనుంది.
ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాలపై దాడుల కారణంగా.. క్రూడ్ ఆయిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. నెల క్రితం వరకు 70 డాలర్ల కంటే తక్కువగా ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ వంద డాలర్లు దాటింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే.. చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 75 డాలర్లుగా ఉన్న చమురు ధర 130 డాలర్లకు చేరింది. తర్వాత 85 డాలర్లకు దిగొచ్చింది. ఈ పరిస్థితుల్లో 1973 తరహా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్. హర్మూజ్ జలసంధిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రోజుకు 10 కోట్ల చమురు బ్యారెళ్ల డిమాండ్‌ని తీర్చడం కష్టమంటున్నారు. ఈ పరిణామాలు.. చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభానికి దారితీయొచ్చనే ఆందోళనలున్నాయ్. హర్మూజ్ మూసివేత ఇంకొన్నాళ్ల పాటు కొనసాగితే దీర్ఘకాలంలో చమురు ధరలు మరింత భగ్గుమనే పరిస్థితులు ఉంటాయ్. అప్పుడు బ్యారెల్ ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని ఖతార్ మంత్రి కూడా అన్నారు. అదే జరిగితే.. చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారి, పరిస్థితులు సద్దుమణిగి, ఆయిల్ సప్లై యధాతథంగా జరిగితే.. రేట్లు దిగివస్తాయ్. కానీ.. ఇదంతా యుద్ధం ఎంతవవరకు కొనసాగుతుందనే దానిమీదే ఆధారపడి ఉంటుంది.
యుద్ధం ఇఫెక్ట్ ఇండియాలో కనిపిస్తోంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో.. ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయ్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముంబైలోని సగం హోటళ్లు మూతపడే అవకాశాలున్నాయ్. ముంబై మాత్రమే కాదు.. ఢిల్లీ, బెంగళూరులోనూ కొన్ని హోటళ్లని తాత్కాలికంగా మూసేశారు. ఇదే అదనుగా.. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో సిలిండర్ల అమ్మకాలు ఊపందుకున్నాయ్. ఒక్కో కమర్షియల్ సిలిండర్‌ని.. డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయ్. కేంద్రం కూడా పరిస్థితులకు తగ్గట్లుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చమురు శుద్ధి సంస్థలపై.. నిత్యవసర సరుకుల చట్టాన్ని ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, పంపిణీ సమానంగా జరిగేలా పెట్రోలియం శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. దేశీయ సరఫరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ఇండియాలో.. ప్రతి సంవత్సరం 31 మిలియన్ టన్నులకు పైగా వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇందులో.. 62 శాతం దిగుమతుల నుంచి వచ్చేదే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి మూసివేతతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో.. హోటల్స్ బంద్ అవుతున్నాయ్. దాంతో.. వ్యాపారులతో పాటు కార్మికులు కూడా నష్టపోతున్నారు. పైగా.. ఇది రంజాన్ సీజన్. ఇలాంటి సమయంలో.. ఈ రకమైన పరిస్థితులు తలెత్తడంతో.. ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. దేశంలో పెట్రోల్ ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని, చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయ్. మరో 8 వారాలకు సరిపడినంతగా ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్లు దాటినా ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందులేమీ లేవు. గతంలో 140 డాలర్ల వరకు వెళ్లినప్పుడే.. భారత్‌లో పెట్రోల్ ధరలు పెంచారు. ప్రస్తుతం.. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 120 డాలర్ల లోపే ఉంది. అయితే.. యుద్ధం ఇలాగే కొనసాగితే.. బ్యారెల్ 200 డాలర్ల దాకా వెళ్తుందేమోనని ప్రపంచ దేశాలన్నీ టెన్షన్ పడుతున్నాయ్. అదే జరిగితే.. దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంధన ధరలు నియంత్రించే క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కొన్ని రకాల చమురు ఆంక్షలను తొలగించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రకటనతో.. అంతర్జాతీయ మార్కెట్లకు ఊరట దక్కింది. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు.. తమ నౌకాదళాలు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. చమురు సప్లైని అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే.. భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.
యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా.. ప్రపంచం గుండెల్లో రైళ్లు పరిగెత్తేది కేవలం ఆయుధాలు, యుద్ధం తాలూకూ నష్టాల వల్ల మాత్రమే కాదు.. క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయో అన్న భయం కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే.. 1973 నాటి చమురు సంక్షోభం మళ్లీ తలెత్తితే.. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్ ఎదుర్కోబోయే సవాళ్లపై ఇప్పుడు డిబేట్ మొదలైంది. క్రూడ్ ఆయిల్ కేవలం ఇంధనం మాత్రమే కాదు. గ్లోబల్ ఎకానమీకి అదొక వెన్నెముక. యుద్ధం ముదిరి చమురు సప్లై సిస్టమ్ దెబ్బతింటే.. పరిస్థితులు దారుణంగా మారిపోతాయ్. ప్రపంచ చమురు అవసరాల్లో.. 20 శాతానికి పైగా పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతోంది. ఇది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే సముద్ర మార్గం. దీనిని ఇరాన్ మూసివేయడంతో.. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరాపై ఎఫెక్ట్ పడింది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో.. ఆయిల్ రేట్లు అమాంతం పెరిగిపోతాయేమోనన్న భయాలు నెలకొన్నాయ్.
1973లో అరబ్ దేశాలు చమురు సరఫరాపై ఆంక్షలు విధించినప్పుడు, క్రూడ్ ఆయిల్ రేట్లు రాత్రికి రాత్రే నాలుగు రెట్లు పెరిగాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 1973నే అతిపెద్ద సంక్షోభంగా వ్యవహరిస్తారు. అరబ్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా వ్యవహరించిన అమెరికా, నెదర్లాండ్స్, పోర్చుగల్, సౌతాఫ్రికా లాంటి దేశాలపై.. ఒపెక్ దేశాలు ఆయిల్ కొనకుండా ఆంక్షలు విధించాయ్. ఆయిల్ ఉత్పత్తిని తగ్గించాయ్. దాంతో.. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయ్. దాంతో.. ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. అప్పట్లో.. ఒక్కో బ్యారెల్ రేటు 3 డాలర్ల ఉండగా.. ఆంక్షల ఎఫెక్ట్‌తో 12 డాలర్లకు చేరింది. 1978-79లో.. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం సమయంలోనూ.. చమురు ధరలు భగ్గుమన్నాయ్. అప్పట్లో.. 14 డాలర్లు ఉన్న బ్యారెల్ ధర 39 డాలర్లకు చేరింది. 1980-81లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలోనూ చమురు ధర 25 శాతం పెరిగింది. 1990-1991 మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలోనూ.. చమురు ధరలు 140 శాతం మేర పెరిగి.. బ్యారెల్ ధర 41 డాలర్లకు చేరింది. 2011లో లిబియా అంతర్యుద్ధం సమయంలో చమురు ధర 30 శాతం పెరిగింది. 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో.. 75 డాలర్లుగా ఉన్న చమురు ధర 130 డాలర్లకు చేరింది. తర్వాత.. తగ్గుముఖం పట్టి 85 డాలర్లకు దిగొచ్చింది. ఇప్పుడు కూడా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే.. బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరే అవకాశాలున్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్.
చమురు ధరలు పెరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు పెరిగి రవాణా ఖర్చులు పెరుగుతాయ్. ఫలితంగా.. కూరగాయల నుంచి నిత్యవసర వస్తువుల దాకా అన్నింటి ధరల్లో మార్పు వస్తుంది. ఆయిల్ కొనేందుకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే.. రూపాయి విలువ మరింత పడిపోతుంది. ఇంధన ఖర్చులు భరించలేక.. ఫ్యాక్టరీలు కూడా ఉత్పత్తిని తగ్గించే అవకాశముంది. భారత్ తన చమురు అవసరాల్లో.. దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఆసియా దేశాల్లో చమురు సంక్షోభం ప్రభావం భారత్‌పైనే ఎక్కువగా ఉంటుంది. హర్మూజ్ జలసంధి ద్వారా వచ్చే ముడి చమురులో దాదాపు సగం భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియాకు వెళ్తుంది. ఇది.. ఎక్కువ కాలం నిలిచిపోతే.. ముందుగా పతనమయ్యేది ఆసియా ఆర్థిక వ్యవస్థే. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాక్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల్లో 70 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. రోజుకు 43 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ఇప్పుడది 13 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది.
భారత్ దగ్గర ప్రస్తుతం రాబోయే 8 వారాలకు సరిపడా చమురు, పెట్రో నిల్వలు ఉ్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే.. ఇండియాలోనూ కొరత ఏర్పడుతుంది. ఇరాన్‌తో యుద్ధం ముగింపునకు చేరుకుందని ట్రంప్ చెబుతున్నారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే దాకా యుద్ధం కొనసాగుతుందంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై.. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ రియాక్ట్ అయింది. యుద్ధం ఎప్పుడు ముగించాలనేది.. ఇరాన్ నిర్ణయిస్తుందని ప్రకటించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే.. ఈ ప్రాంతం నుంచి ఒక్క లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇవన్నీ చూస్తుంటే.. చమురు సప్లైపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయ్. యుద్ధం ఎప్పుడూ విధ్వంసాన్నే మిగులుస్తుంది. ప్రపంచీకరణ యుగంలో.. దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయ్. సప్లై చైన్‌లో చిన్న అంతరాయం వచ్చినా.. అది సామాన్యుడి జేబుకే చిల్లు పెడుతుంది.
Also Read: తంబళ్లపల్లె టీడీపీలో ‘త్రిశూల వ్యూహం’.. పెద్దిరెడ్డి కోటను బద్దలు కొట్టే ఆ ‘మగాడు’ ఎవరు?
Story by: Anup, Big Tv