Siliguri Corridor: భారతదేశ భౌగోళిక సార్వభౌమత్వానికి, అంతర్గత రక్షణకు కీలకమైన, అత్యంత సున్నితమైన ప్రాంతం సిలిగురి కారిడార్. దీనినే చికెన్ నెక్ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. దేశ రక్షణకు సంబంధించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సిలిగురి కారిడార్ ప్రాంతంలో భద్రత, పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ బెంగాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ వ్యూహాలను మార్చేయబోతున్న చికెన్ నెక్ ప్రాధాన్యత ఏంటి? దీనివల్ల భారత్‌కు చేకూరే ప్రయోజనమేంటి?
ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలతో.. బెంగాల్‌లో రాజకీయ మార్పిడే కాదు.. అక్కడి కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. భౌగోళికంగా దేశ సరిహద్దుల్లోనూ భద్రతాపరమైన మార్పులకు కారణం కాబోతోంది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌లోని.. కీలక హైవేలను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలన్న బెంగాల్ సర్కార్ నిర్ణయంతో చైనా, బంగ్లాదేశ్ సహా నాలుగు దేశాలకు సమీపంలోని మన చికెన్ నెక్ భద్రం కాబోతోంది. చికెన్ నెక్‌లోని 120 ఎకరాల భూమిని.. కేంద్రానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఈ దేశాన్ని.. ఈశాన్య భారతంతో కలిపి ఏకైక భూమార్గం.. ఈ సిలిగురి కారిడార్. సంఘర్షణ, సంక్షోభ సమయాల్లో.. ఇది భారతదేశానికి కాకుండా బంగ్లాదేశ్‌కు పట్టు బిగించేందుకు అవకాశమున్న ఏకైక వ్యూహాత్మక ప్రాంతం. ఈ క్రమంలో.. బెంగాల్ ప్రభుత్వం.. ఏడు జాతీయ రహదారులను.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో.. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు దీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది.
సిలిగురీ కారిడార్ నార్త్ బెంగాల్‌లో ఉంటుంది. దీని పొడవు 60 కిలోమీటర్లు. వెడల్పు చాలా తక్కువ. కొన్నిచోట్ల అయితే.. 20 నుంచి 22 కిలోమీటర్లకు మించదు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, మణిపుర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కింని.. ఈ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక భూభాగం ఇదే. ఈ కారిడార్‌కు ఆనుకొని నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి. అక్కడికి కొంత దూరంలోనే భూటాన్ ఉంది. చైనాలోని చుంబీ లోయకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. భారత్‌లో రక్షణపరంగా అత్యంత ముప్పున్న ప్రాంతాల్లో ఇదొకటి. శత్రుదేశం ఈ సన్నటి భూభాగంపై పట్టు సాధిస్తే.. 8 రాష్ట్రాలతో భారత ప్రధాన భూభాగానికి రైలు, రోడ్డు రవాణా తెగిపోతుంది. బలగాలు, ఆయుధ వ్యవస్థల తరలింపు నిలిచిపోతుంది. ఆ రాష్ట్రాల రక్షణ ప్రమాదంలో పడుతుంది. అక్కడ 5 కోట్ల మంది భారతీయులు ఉంటున్నారు. చికెన్ నెక్ దగ్గర ఇలాంటి సవాళ్లు ఎన్నో ఉన్నాయ్.
2017లో డోక్లామ్ దగ్గర చైనాతో సైనిక ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి చికెన్ నెక్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చికెన్ నెక్ ప్రాంతంలో అనేక కీలకమైన రోడ్లు ఉన్నాయి. ఇప్పటివరకూ ఇవి పశ్చిమ బెంగాల్ ప్రజాపనుల శాఖ కింద ఉన్నాయి. వీటిలో కీలకమైన ఏడు సెక్షన్లను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని రాష్ట్రంలో సువేందు అధికారి ప్రభుత్వం కొలువుదీరగానే నిర్ణయం తీసుకుంది. దాంతో.. అవి NHAI, జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి రానున్నాయి. NH-31, NH-33, NH-312తో సహా కీలక రహదారుల బాధ్యత ఇకపై NHAI పరిధిలోకి వెళ్తాయి.
సేవక్–కరోనేషన్ బ్రిడ్జ్ మార్గం, హసిమారా–జైగావ్ మార్గం, చాంగ్రాబంధా కారిడార్ లాంటి ప్రాజెక్టులను NHIDCL మానిటర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టులు కొన్ని నెలలుగా బెంగాల్ ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూశాయ్. ఇప్పుడు అనుమతి లభించడంతో కేంద్ర సంస్థలు రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నాయి. ఇది.. నార్త్ బెంగాల్‌తో అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని, బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దులతో సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. డార్జిలింగ్, డూయార్స్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ప్రభుత్వం తెలిపింది.
ఇన్నాళ్లూ.. బెంగాల్‌లోని స్థానిక రాజకీయాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాల కారణంగా సిలిగురి కారిడార్ పరిధిలో భూసేకరణ, రక్షణ మౌలిక వసతుల కల్పన, అంతర్గత భద్రతా పర్యవేక్షణలో తీవ్ర జాప్యం జరిగేది. బెంగాల్‌లో ప్రభుత్వం మారిన వెంటనే.. జాతీయ భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ.. కొత్త ప్రభుత్వం వ్యూహాత్మక అడుగు వేసింది. సిలిగురి కారిడార్ పరిధిలోని శాంతిభద్రతలు, రక్షణ అవసరాల కోసం భూముల కేటాయింపు, సరిహద్దు నిఘా సమన్వయం లాంటి కీలక బాధ్యతలను.. కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖల ఆధీనంలోకి తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బెంగాల్‌లోని సిలిగురి కారిడార్ సమీపంలో.. కేంద్ర ప్రభుత్వానికి భూమిని అప్పగించడమంటే.. దేశంలోని అత్యంత సున్నితమైన భౌగోళిక చోక్ పాయింట్‌లో భారీ భద్రత, రక్షణ లాజిస్టిక్స్, రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడమే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ రైల్వే విస్తరణ ప్రణాళికకు వీలు కల్పించడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతమున్న డబుల్-ట్రాక్ రైల్వేను.. 6 లేన్ల ట్రాక్ వ్యవస్థగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. 2, 3 చోట్ల.. రైలు మార్గాలను భూగర్భంలో నిర్మించడం వల్ల.. శత్రువుల దాడుల ముప్పు నుంచి భారత సైనిక, సరఫరా లాజిస్టిక్స్‌కు రక్షణ లభిస్తుంది. పొరుగున్న బంగ్లాదేశ్ నుంచి ఏదైనా ముప్పు ఏర్పడితే వెంటనే స్పందించి.. చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.
బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం వల్ల చికెన్ నెక్ ప్రాంతంలో హైవే ప్రాజెక్టులకు సంబంధించిన ఆలస్యానికి చెక్ పడనుంది. వేగంగా విస్తరణ, మరమ్మతులు, నిర్వహణ పనులు మొదలవడం వల్ల.. రక్షణ సంబంధ రాకపోకలు మెరుగుపడతాయ్. అక్కడ బలమైన రహదారి మౌలిక వసతులుంటే.. భారత్-చైనా సరిహద్దుకు చేరువలోని నాథులాతో లింక్ అయ్యే NH-717తో ముడిపడ్డ మార్గాల్లో భద్రత బలోపేతం అవుతుంది. శత్రువుల దాడుల నుంచి కీలక సైనిక సామాగ్రికి రక్షణ కల్పించడం కోసం.. కేంద్రం అండర్‌గ్రౌండ్ రైల్వే కారిడార్‌ని నిర్మించబోతోంది.
చికెన్ నెక్ ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలోనే చైనాకు చెందిన చుంబీ వ్యాలీ ఉంది. చైనా సైన్యం భూటాన్ భూభాగమైన డోక్లాంలో రోడ్డు వేయడానికి ప్రయత్నించినప్పుడు భారత్ తీవ్రంగా అడ్డుకుంది. ఎందుకంటే డోక్లాం గనుక చైనా చేతికి చిక్కితే, అక్కడ నుంచి నేరుగా సిలిగురి కారిడార్‌ని.. చైనా ఫిరంగులు సులువుగా టార్గెట్ చేయగలవు. యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే, చైనా మొదట దాడి చేయాలనుకునేది ఈ చికెన్ నెక్ పైనే. అందుకే ఈ ప్రాంతాన్ని మరింత పటిష్టం చేయడం భారత్‌కు కంకణం కట్టుకుంది.
సిలిగురి కారిడార్‌పై ఎప్పటి నుంచో చైనా కన్ను ఉంది. అందువల్ల.. ఆ ప్రాంత రక్షణకు భారత సైనిక దళాలు భారీగా చర్యలు చేపట్టాయి. పశ్చిమ బెంగాల్‌లోని సుక్నా కేంద్రంగా భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కోర్ మోహరించింది. దాదాపు 60వేల మంది సైనికులతో కూడిన ఈ దళం సిలిగురి కారిడార్‌కు ప్రధాన కవచం. గగనతల రక్షణ కోసం శక్తిమంతమైన ఎస్-400 లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ కూడా అక్కడే ఉంది. అత్యంత కచ్చితత్వంతో వేగంగా దాడులు చేయడానికి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థలు కూడా సిద్ధంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్‌లోని హసీమరా ఎయిర్‌బేస్‌లో రఫేల్ యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయ్. వీటికి తోడు ఆకాశ్, ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్లను ఛేదించగలిగే మిడ్ రేంజ్ మిసైళ్లు కూడా సిలిగురికి దగ్గర్లోనే సన్నద్ధంగా ఉన్నాయ్.
ఇన్నాళ్లూ బెంగాల్‌లో రాజకీయపరమైన విభేదాలుండేవి. కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడింది. కేంద్రం నేరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. మౌలిక వసతుల పనులు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తాయి. ఇప్పటికే సిలిగురి కారిడార్‌ను కాపాడటానికి ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడంతో, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి కూడా ఈజీ అవుతుంది. చొరబాట్లను వంద శాతం అడ్డుకోవచ్చు.
అంతేకాదు.. బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల మీదుగా చొరబాట్లు జరిగి, సిలిగురి ప్రాంతంలో జనాభా సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం పర్యవేక్షణ పెరగడం వల్ల అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట పడుతుంది. భారతదేశ రక్షణ మ్యాప్‌లో చికెన్ నెక్ బలహీనమైన లింక్ కాకూడదనేది ప్రభుత్వ ఆలోచన. బెంగాల్‌లో రాజకీయ మార్పులతో తీసుకున్న ఈ నిర్ణయం.. దేశ భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన ఆదర్శవంతమైన సమన్వయానికి నిదర్శనం. చికెన్ నెక్ ఇక ఎంత మాత్రం బలహీనమైన ప్రాంతం కాదు.. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఉక్కు నెక్‌గా మారబోతోందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి.. గ్రౌండ్ లెవెల్‌లో పూర్తి స్థాయిలో వ్యూహాత్మక చర్యలు చేపడితే దేశ రక్షణ రంగానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కేవలం ఒకే రోడ్డుపై ఆధారపడితే ప్రమాదం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. చైనా నేరుగా యుద్ధం చేయకుండా, స్థానిక ప్రజల్లో అశాంతి రేపడం, ఉగ్రవాద గ్రూపులకు ఫండింగ్ ఇవ్వడం, చొరబాట్లను ప్రోత్సహించడం లాంటి గ్రే జోన్ వార్‌ఫేర్‌కు పాల్పడుతుంటుంది. కేంద్ర నిఘా సంస్థలు, సరిహద్దు భద్రతా దళాలు, బెంగాల్ స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తే, ఈ అంతర్గత కోవర్టు నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయవచ్చు.
దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదనే సూత్రానికి చికెన్ నెక్ రక్షణే నిదర్శనం. డోక్లాం వివాదం ద్వారా చికెన్ నెక్‌కు దగ్గరగా రావాలని చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో, బెంగాల్ సర్కార్ సహకారం, కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక పట్టుదల రక్షణ రంగానికి కొండంత అండగా మారబోతున్నాయి. సరిహద్దుల్లో పొంచి ఉన్న ఎలాంటి శత్రువైనా.. భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయరు.
Also Read:ప్రొఫెసర్ నాగేశ్వర్ ‘యూటర్న్’.. జనసేనతో వివాదానికి ఎండ్ కార్డ్ పడింది ఇలా!