Special Story on Tirumala Laddu Making Controversy : సాధారణంగా అగ్నికి అజ్యం పోస్తారు. కానీ ఆ అజ్యానికి అగ్గిపుడితే.. అవి కాస్త కొండంత ప్రకంపనలు సృష్టిస్తే. ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో అదే జరిగింది. నెయ్యి విషయంలో జరిగిన అజాగ్రత్తత.. తిరుమల కొండను అపవిత్రమైందని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఒక్క అంశంతో 3 వందల ఏళ్ల చరిత్రకు మరకలు పడ్డాయని వాదన వినిపిస్తోంది. అసలు తిరుమల లడ్డూ చరిత్రేంటీ..? సంప్రదాయం పద్ధతిలో తయారు చేసే ప్రసాదాల్లో తప్పేలా జరిగింది..?
తిరుమల లడ్డూ.. ఎవరు తిరుపతికి వెళ్లినా..ప్రసాదం ఎక్కడ అని ఆతృతగా వెతికేది ఈ లడ్డూ కోసమే.. ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి.. నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే.. అమెరికాలో ఉన్నా ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే.. దేశదేశాల నుంచి తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు అలిపిరి మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే… విశ్వరూపధారి అయిన కలియుగ వేంకటేశ్వరుడు. మన ఇంటికి వచ్చేది ఈ లడ్డూ రూపంలోనే. ఇదీ కొండ లడ్డూకున్న ప్రత్యేకత. దీని రుచి, సువాసన ప్రపంచంలో మరే లడ్డూకు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే తిరుమల లడ్డూకు పేటెంట్ దక్కింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజు నైవేద్యాల్లో సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే.. నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడ జరగవు. అంతెందుకు అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే.. తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ.. కలియుగ దైవాన్ని ఆటపట్టించేవాడంట. తిరుమల వైభవం గురించి చెప్పాలంటే.. ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే.. ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 310 ఏళ్ల చరిత్ర ఉంది.
మనం ఎంతో ఇష్టపడే ఈ మహాప్రసాదం 1715లో ఆగస్టు 2న తొలిసారిగా తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారు. అయితే మొదట్లో దీని రూపం లడ్డూగా లేదు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాసు సర్కార్ ఫస్ట్ టైం ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారం ఉంది. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర చెబుతుండగా, అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలుగా నైవేద్య వేళలు ఖరారు అయ్యాయి. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం ఆ తర్వాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాక పోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచింది. అయితే అప్పటి వరకూ బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటుండగా… 1940 నాటికి అది లడ్డూగా మారింది. 1940 ప్రాంతంలో కల్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది. సరిగ్గా అప్పటి నుంచే బూందీ లడ్డూగా మారి భక్తుల చేతికి లడ్డూ అందింది. కాలక్రమంలో వడ స్థానంలో లడ్డూ పూర్తి స్థాయి ప్రసాదమైంది. ఇక లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో తొలిసారిగా 1950లో నిర్మించి, దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు టీటీడీ ధర్మకర్తల మండలి. దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది. చివరిసారిగా 2001లో దిట్టాన్ని సవరించారు. మొదట్లో 5,100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. ఆ తర్వాత అది లక్షల సంఖ్యకు పెరిగింది. అయితే భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు 48 వరకు ఖర్చు చేస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డు ధరను 50 చేసింది.
Also Read: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..
ఇక పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తున్న టీటీడీ ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తోంది. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. భక్తులకు అందజేసే ఉచిత లడ్డూ కాకుండా మూడు రకాల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. రోజూ దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో 600 మందిని సిబ్బంది గుమగుమలాడే లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో 100 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాగా, దాదాపు 750 మంది శ్రీవైష్ణవులు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు.
అయితే అన్ని లడ్డూల్లా కాకుండా.. తిరుమల లడ్డూను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు అందుకే దానికి అంత రుచి. తొలుత శనగ పిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసల కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు. కాగుతున్న కడాయి నుంచి బూందీని వేరు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా మరో పెద్ద గిన్నెలోకి పంపుతారు. అనంతరం జీడిపప్పు, ఎండుద్రాక్ష, కలకండ, యాలకులు, బాదంపప్పు, కుంకుమపువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు. అయితే గతంలో ఈ లడ్డూ తయారీ అంతా కట్టెల పొయ్యిమీద చేసేవారు. అయితే తయారీ సామర్ధ్యం పెరగడంతో ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. అంతేకాదు.. ఈ తయారీ చేసే వాళ్ల కూడా నిష్టగా ఉంటే తప్ప వంటశాలలోకి అనుమతించరు. వంటశాల విషయంలోనూ అనేక నియమాలు ఉంటాయి.
వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలను తయారు చేస్తారు. అలా తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు.అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు లడ్డూ, వడలు తదితర ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారు చేస్తారు. ఆ ఫలహారాలను కూడా వకుళామాతకు చూపించిన తర్వాతే ఆ స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు. ఆ తర్వాత అది భక్తులకు నైవేద్యంగా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ లడ్డులో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం మొత్తం దేశవ్యాప్తంగా చర్చగా మారింది.
ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు.. కోట్లాది భక్తుల ఎమోషన్.. ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూల్లో వినియోగించే ఆవు నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మనసు చివుక్కుమంటోందని ఆవేదన చెందుతున్నారు. దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూలో ఇదేం అపచారం అంటూ నోరెళ్లబెడుతున్నారు. గోవిందా.. గోవిందా అంటూ లెంప్పలేసుకుంటున్నారు.