Telangana Politics: అప్పుడప్పుడు రాజకీయాల్లో జరిగే కొన్ని పరిణామాలు ఆశ్చర్యపరుస్తుంటాయ్. హరీశ్, కేటీఆర్ భేటీ కూడా అలాంటిదే. బావ, బామ్మర్దులు కలుసుకోవడం వింతేమీ కాకపోయినా.. స్టేట్ పాలిటిక్స్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అసలు.. వీళ్లిద్దరి భేటీ వెనక ఏం జరిగింది? ఉన్నట్లుండి.. హరీశ్‌తో రెండుసార్లు కేటీఆర్ సమావేశం కావడం వెనుక ఎవరి వ్యూహం నడిచింది? ఈ భేటీతో.. పార్టీ క్యాడర్‌కు ఇవ్వాలనుకున్న సంకేతమేంటి? బయట జరుగుతున్న రచ్చకు.. ఫుల్ స్టాప్ పెట్టేలా వెనకుండి నడిపించిన మాస్టర్ ప్లాన్ ఏంటనే చర్చ జరుగుతుంది. అయితే.. వీళ్లిద్దరి భేటీ వెనుక కేసీఆర్ స్కెచ్ ఉందా?
బీఆర్ఎస్‌పై చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా అడుగులు
గులాబీ దళపతి కేసీఆర్.. కొత్త స్కెచ్ వేశారట. పార్టీపై, పార్టీలోని ముఖ్యనేతలపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు.. పక్కా ప్రణాళిక అమలు చేశారట. మీడియా దృష్టిని ఆకర్షించేలా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ గురించే చర్చ జరిగేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేశారట. కేసీఆర్ ప్లాన్‌ని.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమలు చేశారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. హరీష్ రావు ఇంట్లో భేటీలు నిర్వహించి.. పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారనే చర్చ అటు పార్టీలోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ సాగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్ట నివారణ కోసమే.. కేసీఆర్ పక్కా స్కెచ్ వేశారనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పార్టీలో స్తబ్దత
రాజకీయ వ్యూహాలు రచించడంలో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. ఆయన స్కెచ్ వేస్తే పక్కా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. అయితే.. పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. అదేస్థాయిలో సోషల్ మీడియా వేదికగా అనేక ప్రచారాలు ఊపందుకున్నాయ్. ఈ ప్రచారం పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించిన కేసీఆర్.. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. హరీష్ రావును పక్కన పెట్టారని, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం విస్తృతమైంది. దాంతో.. పార్టీ కేడర్‌లోనూ కొంత గందరగోళం నెలకొంది. పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధినేత కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రచించారట.
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని డైవర్ట్ చేసేలా ప్రణాళిక
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని డైవర్ట్ చేసేలా ప్రణాళిక రూపోందించారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని.. స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి మాట్లాడాలని సూచించడంతోనే.. ఆయన వెళ్లారని సమాచారం. కేటీఆర్ వరుసగా రెండు రోజుల పాటు హరీష్ ఇంటికి వెళ్లడం, తాజా రాజకీయాలు, పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు సుదీర్ఘంగా చర్చించారు. కలిసి ముందుకుపోవాలని, పార్టీని బలోపేతం చేసేలా.. ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం కావాలనే నిర్ణయానికి వచ్చారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, కలిసికట్టుగానే ఉన్నామనే సందేశం పార్టీ కేడర్‌కు ఇచ్చేలా.. వీళ్లిద్దరి మధ్య భేటీ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ హరీష్ రావును దూరం పెట్టిందనే ప్రచారం
హరీష్ రావు ఇంట్లో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం నిర్వహించడం, కేటీఆర్ హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఇలా మీటింగ్ ఎందుకు నిర్వహించారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదైనా పార్టీ కార్యాలయంలోనో, నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలోనో సమావేశం నిర్వహిస్తుంటారు. అయితే.. అందుకు భిన్నంగా భేటీ కావడం వెనుక ఆంతర్యమేంటని పార్టీలోనే చర్చ సాగుతోందట. బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలంగా అధిష్టానం హరీష్ రావును దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, ఆయన యాక్టివ్ అయితే.. పార్టీలో కీలక నేతగా కేటీఆర్ మనుగడ కష్టమని భావించే.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారనే మాట వినిపించింది.
Also Read: జగన్‌కు కొత్త తలనొప్పి!
హరీష్ కూడా కొంత నైరాశ్యానికి లోనయ్యారనే ప్రచారం
అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలతో హరీష్ రావు సైతం కొంత నైరాశ్యానికి లోనయ్యారనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. పార్టీ మారుతున్నారని వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇది.. ఇది నష్టమని భావించిన పార్టీ అధిష్టానం.. హరీష్ పార్టీ మారకుండా కేటీఆర్‌ని ఇంటికి పంపించినట్లు సమాచారం. హరీష్ రావును శాంతింపజేయడంతో పాటు పార్టీపై, కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ చెక్ పెట్టారని.. బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
విభేదాలున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళితే పార్టీకి తీవ్ర నష్టం
రాష్ట్రంలోనే త్వరలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గట్టెక్కాలంటే పార్టీలోని నేతలంతా ఐక్యంగా ఉండటంతో పాటు సమన్వయం కూడా అవసరం. లేకపోతే.. విభేదాలున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళితే.. బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని గులాబీ హైకమాండ్ భావించిందట. భవిష్యత్‌లో పార్టీకి ఊహించని నష్టం జరుగుతుందని కేసీఆర్ ముందుగానే ఊహించారని అంటున్నారు. అందుకే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు చెప్పుకుంటున్నాయ్ బీఆర్ఎస్ వర్గాలు. పార్టీపై, కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.