Bhimavaram Politics: పార్టీ ఉంది.. క్యాడర్ ఉంది.. నాయకులున్నారు. కానీ.. ఇంచార్జ్ మాత్రమే లేరు. పార్టీని పూర్తిగా పట్టించుకునే నాయకుడంటూ ఎవరూ లేరు. అయినాసరే.. అధిష్టానం లైట్ తీసుకుంటోంది. కిందిస్థాయిలో కార్యకర్తలు మాత్రం.. తమన నడిపించే లీడర్ కోసం ఎదురుచూస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వైసీపీలో.. ఇప్పుడున్న పరిస్థితి ఇది. వైసీపీ హైకమాండ్.. దేనికోసం ఇంచార్జ్‌ని నియమించట్లేదు? జగన్ మనసులో ఏముంది? ఎలాంటి ఇంచార్జ్ కోసం వెతుకుతున్నారు?
బీమవరంలో వైసీపీ ఉనికినే కోల్పోయే పరిస్థితి!
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం అంటే రాజకీయంగా ఓ సంచలనమని చెప్పొచ్చు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో.. రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ తన ఉనికినే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుందనే చర్చ జరుగుతోంది. కొన్ని నెలలుగా.. భీమవరం నియోజకవర్గానికి వైసీపీకి.. ఇంచార్జ్ లేకుండా పోయారు.
వైసీపీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రెండోసారి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పరాజయం పాలయ్యారు. సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచారని.. వారి వల్లే తాను ఓడిపోయాననే రిపోర్టులున్నా.. జగన్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో.. గ్రంథి శ్రీనివాస్ గతేడాది డిసెంబర్ 12న వైసీపీకీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని నియమించలేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
ఇంచార్జ్ రేసులో ద్వితీయ శ్రేణి నాయకులు
భీమవరం వైసీపీకి ఇంచార్జ్ రేసులో.. కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు మొదట్లో వినిపించినా.. ఇప్పుడు వారంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలేవైనా ఉంటే.. నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయ్ తప్ప.. పార్టీ ఇంచార్జ్ పోస్టుకు సరిపడే నేతలు.. భీమవరం నియోజకవర్గంలో లేరని అధిష్టానం భావిస్తోందట. పార్టీ అధినాయకత్వం.. ఈ రకంగా ఆలోచిస్తుండటం వల్లే.. ఇప్పటివరకు నియోజకవర్గ ఇంచార్జ్‌ని నియమించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
పబ్లిక్‌లో పాపులారిటీ, ఆర్థికంగా బలంగా ఉన్న నేతం కావాలట!
ఇంచార్జ్ అంటే పబ్లిక్‌లో పాపులర్ లీడర్ అనే పేరుతో పాటు ఆర్థికంగానూ బలంగా ఉండి పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సి ఉంటుంది. అందువల్ల.. ఆ స్థాయి నాయకుడు వైసీపీకి కనిపించట్లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే.. భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కోసం మొదట్లో ప్రయత్నించిన నాయకులను.. వైసీపీ అధిష్టానం ఇప్పుడెందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనే దానిపై.. సొంతపార్టీలోనే చర్చ మొదలైంది. భీమవరంలో కూటమి పార్టీల బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కూటమిని ఎదుర్కోవాలంటే వారికి ధీటైన నాయకుడిని వైసీపీ అధిష్టానం నియమించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కౌరు శ్రీనివాస్
వీరవాసరం మండలానికి చెందిన కౌరు శ్రీనివాస్ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టారు. తర్వాత.. అంచెలంచెలుగా ఎదుగుతూ జడ్పీ ఛైర్మన్, డీసీసీబీ ఛైర్మన్, తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. భీమవరానికి చెందిన మరో నేత వెంకటస్వామి డీసీఎంఎస్ ఛైర్మన్‌గా పనిచేశారు. నర్సాపురం పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన గూడూరి ఉమాబాల.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే ఉమాబాలకు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్ష పదవి దక్కింది. వీరంతా.. బీసీ సామాజికవర్గానికి చెందినవారు.
Also Read: టీటీడీలో మరో స్కామ్.. కొట్టేసిన తులభారం కానుకలు!
కాపు సామాజికవర్గం నుంచి చిన్నిమల్లి వెంకటరాయుడు
ఇక.. కాపు సామాజికవర్గం నుంచి చిన్నిమిల్లి వెంకటరాయుడు, క్షత్రియ సామాజికవర్గం నుంచి భీమవరం ఎంపీపీగా పనిచేస్తున్న పేరిచర్ల విజయ నరసింహరాజులు ఉన్నారు. ఇంతమంది నేతలున్నా.. వీరిలో ఎవరో ఒకరిని భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్‌గా.. వైసీపీ అధినేత జగన్ ఎందుకు నియమించలేకపోతున్నారనే ప్రశ్న మొదలైంది. అసలు.. జగన్ మనసులో ఏముందనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మరోవైపు.. పార్టీ కార్యక్రమాలను నడిపించేందుకు నాయకులు ముందుకొస్తున్నప్పటికీ.. ఆర్థికంగా మాత్రం కార్యకర్తల్ని పట్టించుకునేవాళ్లే లేరట. అదే.. ఇంచార్జ్ గనక ఉంటే.. ఆ బరువు, బాధ్యతలన్నింటిని ఆయనే మోస్తాడు కాబట్టి.. భీమవరం వైసీపీ ఇంచార్జ్‌గా ఎవరో ఒకరిని తొందరగా నియమించాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతంది.