BigTV English

AP Politics: నో ప్రక్షాళన? క్యాడర్ ఆగ్రహం

AP Politics: నో ప్రక్షాళన? క్యాడర్ ఆగ్రహం

AP Politics: గత ప్రభుత్వంలో రెచ్చి పోయారు. నిరసనల్లో సిఏం పోటో వాడిన వారిని సీరియస్‌గా అదుపులోకి తీసుకుని ఏకంగా 307 కేసులు పెట్టారు. ప్రస్తుతం మాత్రం సీఎంతో పాటు కూటమి నాయకుల మాస్క్‌లు తగిలించుకుని, విమర్శలు గుప్పిస్తూ నిరసనలు తెలుపుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దానికి తోడు ఆ నిరసనలను వైసీపీ వారు సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత తీరిగ్గా కేసులు పెట్టి 41 సి నోటీసులు ఇస్తున్నారు. దాంతో అసలు పోలీసుల వైఖరిపై టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉందంట. క్షేత్ర స్థాయిలో బదిలీలు లేక పోవడంతో పాటు కీలక పోస్టులలో వైసీపీ కాలం నాటి వారే ఇన్‌చార్జ్ లు కొనసాగుతుండటంతో ఇలా జరుగుతుందని అంటున్నారు. మొత్తం మీద తిరుపతిలో పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రక్షాళనపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు


క్షేత్రస్థాయిలో పోలీసుల్ని బదిలీ చేసిన వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ముందుగా వారు క్షేత్ర స్థాయిలోని పోలీసులను బదిలీలు చేసారు. దీంతో పాటు కీలక పోస్టులలో తమకు అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకున్నారు. నిఘా వ్యవస్థలు అయిన ఇంటలిజెన్స్, ఎస్‌బిలాంటి చోట్ల కూడా కీలక స్థానాలలో తమ వారిని తెచ్చుకున్నారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. చీమ చిటుక్కుమన్న తమ దృష్టికి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. సమాంతర ప్రభుత్వంలా పోలీసులతో పాటు వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు తమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అనేది సాయంత్రానికి తెలుసుకునే విధంగా యంత్రాంగం సమకూర్చుకున్నారు..


చంద్రబాబుని తిరుపతిలో స్వేచ్ఛగా తిరగనివ్వని పోలీసులు

గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబును సైతం కుప్పంతో పాటు తిరుపతిలో సైతం స్వేచ్ఛగా తిరిగనివ్వలేదు. ఏకంగా అయనను విమానాశ్రయంలో 12 గంటలపాటు కింద కూర్చో పెట్టారంటే అప్పటి యంత్రాంగం ఎంత ఏకపక్షంగా వ్యవహరించిందో అర్థం అవుతుంది. ఇక అధికార పార్టీ ర్యాలీలు , సమావేశాలు జరిపినప్పడు డీఎస్పీ స్థాయి అధికారులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసి వైసీపీ పట్ల స్వామిభక్తి చాటుకున్నారు. దాంతో పాటు చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టారనే కారణంతో ఏకంగా హత్యయత్నం కేసులు పెట్టారు.

4 నెలలు అండర్ గ్రౌండ్‌లో గడిపిన కన్నె రామ్మోహన్, శేషాద్రినాయుడు

ఎస్వీ యూనివర్సిటి రీసెర్చ్ విద్యార్థులు, తెలుగు యువత నాయకులు అయిన కన్నె రామ్మోహన్ ,శేషాద్రి నాయుడులు మాజీ సియం దిష్టిబొమ్మను కాల్చారనే కారణంతో వారిపై హత్య యత్నం కేసు పెట్టడంతో ఏకంగా నాలుగు నెలల పాటు అండర్ గ్రౌండ్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు లక్షలాది రూపాయలు వ్యయం చేసి బెయిల్ తెచ్చుకున్నారు. అదే విధంగా తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ లో నిరసన తెలిపారని మక్కి యాదవ్ , గుణ శేఖర్ లాంటి నాయకులపై కూడా హత్యయత్నం కేసులు పెట్టి 10 రోజుల పాటు జైలులో ఉంచారు. ఇలాంటి ఘటనలు తిరుపతిలో కొకొల్లలు. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ యువకుడిని చిత్ర హింసలు పెట్టి చితక్కొట్టారు.ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టిన జనసేన నాయకురాలిపై ఏకంగా హత్య యత్నం కేసు పెట్టారు.

ఆర్టీసీ బస్సులో అభినయ్ రెడ్డి హడావుడి

అది గతం.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు చాలా ఉదారంగా మారిపోయారంట. ఇప్పుడు వారికి ప్రజాసామ్యం, వాక్ స్వాతంత్రం గుర్తుకు వచ్చాయని అంటున్నారు టిడిపి నేతలు. తాజాగా తిరుపతి వైసీపీ ఇన్‌చార్జి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి అర్టీసి బస్సులోకి గుంపుగా ఎక్కి హాడావుడి చేసారు. దాంతో పాటు ఓ నాయకుడికి చంద్రబాబు మాస్క్ వేయించి ఎన్నికల హామీలపై వ్యంగస్త్రాలు సంధించారు. ప్రభుత్వ అస్తి అయిన బస్సును సూమారు గంట పాటు వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే తక్షణ చర్యలు తీసుకోని పోలీసులు తీరిగ్గా స్పందించి కేవలం 41 నోటీసులు ఇచ్చి పంపారంట.

Also Read: నటుడి పోసానికి మరో బిగ్ షాక్..

చంద్రబాబుని అడ్డుకుంటామని అభినయ్ అల్టిమేటం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనవడి బర్త్ డే సందర్భంగా తిరుమల కు వస్తుండగా తాను హామీల అమలు విషయం మీద అడ్డుకుంటానని అభినయ్‌రెడ్డి అల్టిమేటం ఇవ్వడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అయన ఇంటి వద్దకు వెళ్ళి పహారా కాసారు. తాజాగా తిరుపతిలోని వినాయక్‌సాగర్‌లోని పార్కులో తెల్లవారుజామును విద్యుత్ చార్జీలు పెంచారంటూ ఓ నాటకం ప్రదర్శించారు. అక్కడ కూడా చంద్రబాబు,పవన్,లోకేష్ మాస్క్ లు ధరించిన వారు వీధి నాటకం వేసి విమర్శించారు. గతంలో దిష్టిబొమ్మకు జగన్ మాస్క్ తొడిగినందుకు ఏకంగా హత్య యత్నం కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు కనీసం స్పందించక పోవడంపై తెలుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్బీలో ఖాళీగా ఉన్న కీలక పోస్టు

పోలీసులను క్షేత్ర స్థాయిలో మార్చక పోవడంతో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఎస్ బిలో కీలక పోస్టు ఖాళీగా ఉండటం, ఇంటెలిజెన్స్ లాంటి చోట ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో అధికారులను మార్చలేకపోవడం.. గత ఐదు సంవత్సరాలుగా పాతుకు పోయిన వారే కొనసాగుతుండటంతో వారు ఇంకా వైసీపీకే అనుకూలంగా పనిచేస్తున్నారంట. గత మూడు నెలలుగా తిరుపతి సిటీ డీఎస్పీ పోస్టు ఇన్చార్జులతో నెట్టుకొస్తున్నారు. అదే విధంగా ఎస్బీ డీఎస్పీ వ్యవహారాలను ఓ సిఐ చూస్తున్నాడు. దీంతో పాటు అటాచ్ మెంట్‌తో సిఐలు పనిచేయడంతో మనకేందుకులే అన్నట్టు అధికారులు వ్యవహారిస్తున్నారంట.

కొన్ని స్టేషన్‌లలో పోలీసులు చెప్పినట్లు చేస్తున్న బాసులు

కొన్ని స్టేషన్ లలో పోలీసులు ఏకంగా తమ బాస్‌లను నడిపిస్తున్నారంట. కిందస్థాయి సిబ్బందికి ఉన్న పొలిటికల్ అండతో బాసులు కూడా వారు చెప్పిన దానికే తలఊపుతున్నారంట. దాంతో తిరుపతి నగరంలోని మూడు కీలక పోలీసు స్టేషన్‌లతో పాటు తిరుచానూరు, ఎంఅర్ పల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో వైసీపీ వారి పెత్తనం నడుస్తుందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారం మార్పిడి జరిగి 10 నెలలు అయినా క్షేత్ర స్థాయిలో బదిలీలు చేయక పోవడంతో తిరుపతిలో ఇంకా భూమన రాజ్యమే నడుస్తోందంట. మరి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తిరుపతి డిపార్ట్‌మెంట్‌ని సెట్ చేస్తారో ? లేదో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×