Telangana BJP: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్‌లతోనే సరిపెట్టేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజల వాయిస్ వినిపించకపోగా అసెంబ్లీలో గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం విమర్శల పాలవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను పక్కన పెట్టి, సొంత అజెండాలతో ముందుకు వెళ్తుడటం కాషాయశ్రేణులను గందరగోళానికి గురిచేస్తోందంట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరతామంటున్న బీజేపీకి ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే పార్టీ లక్ష్యానికి ప్రతిబంధకంగా మారారా? తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలోనే గందరగోళానికి గురవుతోందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యేల తీరు మారడం, పార్టీ లైన్ కంటే వ్యక్తిగత అజెండాలకే ప్రాధాన్యం పెరగడం, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఒకే దారిలో నడవాల్సిన సమయంలో ఎవరి రాజకీయాలు వారివిగా కనిపిస్తున్నాయి.
పార్టీ అజెండా కంటే వ్యక్తిగత ప్రోగ్రామ్స్‌కి, ఇండివిడ్యుయల్ ఫోకస్‌కే ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పలు ప్రశ్నలకు, విమర్శలకు దారితీస్తోంది. అసలు బీజేపీకి అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన తీర్మానాల్లో బీజేఎల్పీ పాత్ర ఉంటుందా? రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను సభలో సవాల్ చేయడానికి రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు సహకారం అందిస్తుందా..? ఏ ఎమ్మెల్యే ఏ అంశం మీద మాట్లాడాలో దానికి సంబంధించిన సబ్జెక్ట్ అందిస్తుందా?.. అన్న ప్రశ్నలు ఇప్పుడు బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సెషన్ జరుగుతున్న రోజునే అటు బీజేపీకి, ఇటు బీజేఎల్పీకీ సమాచారం ఇవ్వకుండా.. కనీసం సహచర ఎమ్మెల్యేలకు కూడా తెలియనియ్యకుండా, ఆపార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల సమస్యల పేరుతో స్వతంత్రంగా ర్యాలీ నిర్వహించడం, ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఫ్లోర్ లీడర్ లేకుండా కేవలం పాయల్ శంకర్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సెషన్ లో కొంతమంది ఎమ్మెల్యేలు.. తమ రూటే సపరేటు అన్నట్టు కొనసాగడం ఆ పార్టీలో రచ్చ రేపుతుందట.
పాయల్ శంకర్ నిర్వహించిన రైతు నిరసనపై కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం గుర్రుగా ఉందట.. ఇది పార్టీ స్ట్రాటజీలో భాగమా? లేక వ్యక్తిగత ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కోసమా..? లేక ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ కు సంకేతాలా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఉన్న 7గురు ఎమ్మెల్యేలు 7 దారులు అన్నట్టుగా ఉంటే రాష్ట్ర నాయకత్వం ఏ దారి ఎంచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటుందట. మరోవైపు పార్టీ సరే కనీసం బీజేఎల్పీ నిర్ణయాలనైనా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం, బీజేఎల్పీలో కోల్డ్ వార్ కు సంకేతాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీ కార్డు ప్రయోగించిన బీజేపీ, రాబోయే ప్రభుత్వం తమదే అని ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే కనీసం డబుల్ డిజిట్ సీట్లు కూడా దక్కించుకోలేక 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. గెలిచిన ఆ ఎనిమిది మందిలో గోషామమల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పుడే ఆ పార్టీ ఇమేజ్ అంతో ఇంతో దెబ్బతింది. ఇప్పుడు ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలపై కూడా పారీకి కంట్రోల్ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది.
సబ్జెక్ట్ లేకుండా, కంటెంట్ లేకుండా, పార్టీ తీర్మానం లేకుండా, బీజేఎల్పీ నిర్ణయం లేకుండా ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ కోసం, సొంత ఎజెండాలతో పాకులాడుతుండటంతో .. అసలు వారి అజెండా ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైందంట. ఈ సెషనే కాదు గత అసెంబ్లీ సెషన్‌లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా సభలో నిద్ర పోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి అంశాలు బీజేపీని నవ్వులపాలు చేశాయి. ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించడానికి నాయకత్వ వైఫల్యమే కారణమంటున్నారు. బీజేఎల్పీ, రాష్ట్ర నాయకత్వాలు ఎమ్మెల్యేలకు స్పష్టమైన అజెండా ఇవ్వడంలో విఫలమవుతున్నాయని… వారి ఆదేశాలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు రాష్ట్ర నాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఎమ్మెల్యేలు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అజెండాతో ముందుకు రావడం దేనికి సంకేతం? అన్న వాటిపై బీజేపీ సీనియర్లలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. పోటీ బీజేపీ ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీ సెషన్స్‌లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎమ్మెలంతా తలో దాని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో బలం తక్కువ ఉన్నప్పటికీ, ఉన్న వారన్నా సమష్టిగా గళం వినిపిస్తే పార్టీకి అంతో ఇంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే తమ ఎమ్మెల్యేల అజెండాలేంటో ? అర్థం అవ్వడం లేదని కాషాయ శ్రేణులే జుట్లు పీక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపధ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న కమలనాథులకు .. అవి సాకారమవ్వడం అసాధ్యమే అన్న టాక్ వినిపిస్తోంది.
Stoty by Apparao, Big tv
Also Read: KTR : కొత్త రాగం ఎంచుకున్న కేటీఆర్?