Telangana Cabinet Expansion: సామాజిక న్యాయం అనుసరించి మంత్రివర్గ విస్తరణ సజావుగా అమలైనట్టేనా? ఈ విస్తరణ ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? కులాల వారీగా, ప్రాంతాల వారీగా భర్తీ జరిగినట్టే భావించాలా? అసంతృప్తుల మాటేమిటి? మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటి? మొత్తం మంత్రి వర్గంలో కవరైన కులాలేంటి? ప్రాతినిథ్యం లభించని కులాల మాటేమిటి?
కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం- రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త మంత్రులకు త్వరలో శాఖల కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయి.
కొత్త మంత్రులకు సీఎం రేవంత్ అభినందనలు
ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు.. వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకి అభినందనలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రనాయక్‌కు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రనాయక్
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్రనాయక్ తెలిపారు. డోర్నకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర ఎమ్మెల్యేలకు రామచంద్రనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని రామచంద్రనాయక్ పేర్కొన్నారు.
సీఎం హామీ మేరకు మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి
మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. సిఎం రేవంత్ హామీ .. ప్రకారం ఈ కేబినేట్ బెర్త్ దక్కినట్టు తెలుస్తోంది. ఇక వివేక్ వెంకట స్వామి, మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ బాబు ఎస్సీ- మాల సామాజిక వర్గానికి చెందిన వారు. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గం .. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో లాయల్ గా ఉన్నారు. ఇప్పటికే మాదిగ ఉపకులానికి చెందిన దామోదరరాజనర్శింహ మంత్రి వర్గంలో ఉన్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
బోధన్ ఎమ్మెల్ల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. నాలుగు సార్లు గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పై ఆయన అలకబూనారు.. రాజీనామా చేస్తానని కూడా అన్నారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్- మినాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్- మహేష్ గౌడ్ , సింఎం సలహాదారు- వేం నరేందర్ రెడ్డి.. కలసి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించారు. ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించారు. ఈయన్ని కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం బుజ్జగించింది.
ఎప్పటి నుంచో పదవినాశించిన రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి ఎప్పటి నుంచో ఆశిస్తూ వచ్చిన.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందుబాటులోకి రాలేదు.. చిలుకూరు ఫార్మ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కక పోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధిష్టానం హామీ ఇచ్చినా పదవి ఎందుకు దక్కలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్ల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సైతం సేమ్ సీన్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాహుల్ గాంధీకి , ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు లేఖ రాశారు.
మొత్తం మంత్రి వర్గంలో
మొత్తం మంత్రి వర్గంలో.. ఓసి- రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి.. రేవంత్ రెడ్డి, పొంగులేటి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల, వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి, స్పీకర్ ప్రసాద్ కుమార్, వివేక్ వెంకట స్వామీ ఉన్నారు. ఇక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ మంత్రివర్గంలో ఉన్నారు. ఇక ఎస్టీ కోయ- సామాజిక వర్గం నుంచి సీతక్క, ఎస్టీ లంబాడ వర్గం నుంచి డిప్యూటి స్పీకర్ రామచంద్రు నాయక్ ప్రాతినిత్యం వహిస్తున్నారు. బీసీల నుంచి పొన్నం , కొండా సురేఖ, వాకిటి శ్రీహరి మంత్రి వర్గంలో ఉన్నారు.
పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
ఈసారి తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలు భంగపడ్డారు. వారిని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు. పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సర్దిచెబుతున్నారు.
సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు
కాంగ్రెస్‌లో మంత్రి పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్త జ్వాలల పరిణామం ఎలా ఉండనుంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్‌లో స్థానం తప్పక ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో వీరిని బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.
వీరెలాంటి నిర్ణయం తీస్కుంటారో అన్న సస్పెన్స్
తాజాగా సుదర్శన్ రెడ్డి ఇంటికి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి బుజ్జగించారు. కానీ ఆ అసంతృప్తి జ్వాల అంత తేలిగ్గా చల్లారేది కాదు. ప్రేమ్‌సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.
మల్ రెడ్డితో పాటు బీర్ల ఐలయ్య సైతం గుర్రుగానే
ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఇంకో నేత బీర్ల ఐలయ్య సైతం.. అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది.
కవ్వంపల్లా, అడ్లూరా? అన్న ఉత్కంఠకు తెర
మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని చర్చల మధ్య అడ్లూరికి స్థానం దక్కింది. ఇక, రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ మొదటి నుంచీ జరిగింది. ఒకవేళ చోటు లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంగతి సరే సరి.
ఆరింట మూడు ఖాళీలు మాత్రమే భర్తీ
నెలల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ సగం మాత్రమే పూర్తయింది. ఆరు పదవులు భర్తీ చేయాల్సి ఉండగా తర్జనభర్జనలు పడి చివరకు మూడు పదవులు భర్తీ చేశారు. వీరిలో గడ్డం వివేక్ పట్ల గతంలో వ్యతిరేకత వచ్చినా కూడా కులాల లెక్కల ప్రకారం ఆయనకు మంత్రి పదవి లభించింది. ఆర్థికంగా ఆయన బలమైన నాయకుడు కావడం, చేతిలో మీడియా ఉండటం కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెసులోకి వచ్చారు. అయినప్పటికీ కరుణించారు. మిగతా ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలు.
మూడింటికి 18 నెలలు, మిగిలిన మూడెప్పుడు?
ఇదిలా ఉంటే ఇప్పుడు చర్చంతా మిగిలిన మూడు పదవుల గురించే. ఆరింట మూడు పదవులు భర్తీ చేయడానికే పద్దెనిమిది నెలలు పట్టింది. మిగిలిన మూడు పదవులు భర్తీ ఎప్పుడు చేసినా.. పోటీ మాత్రం తీవ్రంగానే ఉండేలా తెలుస్తోంది. ఇందులో మరో స్ట్రాటజీ కూడా కనిపిస్తోంది. మూడు పదవులు మాత్రమే భర్తీ చేయడంతో ఒక సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు.. కొందరి ఆశలు ఇంకా సజీవంగానే ఉండొచ్చని అంచనా. ఇది ఆశావహులను ఊరటనిచ్చే అంశంగానూ తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి కీలక నేతలున్నారు. వీరి కలలింకా నెరవేరలేదు.
రాజగోపాల్ కి చామలను గెలిపిస్తే మంత్రి పదవన్న హామీ?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు చెబుతారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి గ్యారంటీగా రేవంత్ రెడ్డి ఆశ పెట్టారని అంటారు. దీంతో ఆయన ఎప్పటి నుంచో ఈ పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో కొన్నిసార్లు కేబినెట్ విస్తరణ అనుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది కూడా. తనకు ఎప్పటి నుంచో హోం మంత్రిగా చేయాలని ఉందని బాహటంగానే చెప్పారాయన. కాబోయే హోం మంత్రి ఆయనేనంటూ అందరూ అనుకున్నారు కూడా. కానీ ఆ కల ఇప్పటి వరకూ నెరవేరనేలేదు.
మిగిలిన మూడు పదవు భర్తీలో సామాజిక సందేశమేంటి?
ఇక ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి సైతం మంత్రిపదవులను ఆశించిన వారిలో ఉన్నారు. వీరికి కూడా చివరికి చోటు దక్కలేదు. మొత్తానికైతే.. ముగ్గిరికి మాత్రమే పదవులిచ్చి.. మిగిలిన మూడు పదవులను అలాగే ఉంచారు. ఈ తర్వాతి భర్తీలో ఎలాంటి ప్రాంతీయ సమతుల్యత పాటిస్తారు? సామాజిక సమీకరణాలను లెకిస్తారు? తేలాల్సి ఉంది. అయితే ఈ హాఫ్ భర్తీ ఫార్ములా ఎవరిదన్న చర్చ కూడా నడుస్తోంది పార్టీలో.
-Story By Adinarayana, Bigtv Live