E-Paper
Advertisement

ఆస్తుల్లో అగ్రకులాలు.. అప్పుల్లో వెనుకబడిన వర్గాలు.. సర్వేలో బట్టబయలైన సంచలనాలు..!

ఆస్తుల్లో అగ్రకులాలు.. అప్పుల్లో వెనుకబడిన వర్గాలు.. సర్వేలో బట్టబయలైన సంచలనాలు..!

Caste Census: తెలంగాణ సామాజిక ముఖచిత్రంలో చారిత్రక అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా అంచనాలకే పరిమితమైన కులగణన డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే.. సమగ్ర సర్వేకు సంబంధించిన అంశంలో.. అసలు వాస్తవాలేంటో, ఎవరి జనాభా ఎంతో కాంగ్రెస్( ప్రజా ప్రభుత్వం ప్రజల ముందుంచింది. కులగణనకి సంబంధించిన లెక్కలను అధికారికంగా ప్రకటించడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక వర్గాల్లో డిబేట్ మొదలైంది. ఎవరి వాటా ఎంత? ఏ కులం వెనుకబాటుతనం ఎంత? అనే దానిమీదే చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కులగణన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం.. కోటీ 12 లక్షల 36 వేల 849 కుటుంబాలని సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. ఇందుకోసం.. లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేయగా, సర్వేకు 3 కోట్ల 55 లక్షల మంది ప్రజలు స్పందించారు. వారిచ్చిన సమాచారాన్ని పారదర్శకంగా తీసుకొని రిపోర్ట్ రూపొందించారు. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసలు.. ఇలా కీలక సమాచారం సేకరించారు.

తెలంగాణ మొత్తం జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి కులం, వారి జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని బహిర్గతం చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం, ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో 10.88 శాతం వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా.. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇక, ఓసీల్లో జనాభా పరంగా రెడ్లు అగ్రస్థానంలో ఉన్నారు.

మరో ఆసక్తికరమైన అంశం

ఓసీల్లో.. వాళ్లే 30.47 శాతం ఉన్నారు. రెడ్ల తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08 శాతం ఉండగా, వైశ్యులు 9.07 శాతం, కమ్మ సామాజికవర్గానికి చెందినవారు 6.56 శాతం ఉంది. బ్రాహ్మణులు 5.98 శాతం, వెలమలు 2.56 శాతం ఉన్నారు. అయితే, మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కులం పేరు చెప్పని వారు ఓసీల్లో 21.49 శాతం ఉన్నారు. ఇలా.. ఏ కులానికి చెందనివాళ్లు.. 12 లక్షల మందికి పైనే ఉన్నట్లు కులగణన గణాంకాలు స్పష్టం చేశాయి. ఆధునిక సమాజం దిశగా ఇది మంచి పరిణామమని కొందరు భావిస్తుంటే, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వాదన కూడా ఉంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్ల కొనుగోలు లాంటి వాటిలో.. అగ్రకులాల వారే ముందున్నారు. వీళ్లలో.. రెడ్ల చేతిలోనే అత్యధిక భూములున్నాయి. ఆ తర్వాత.. యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరుకాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు.

Also Read: ఈ స్కీమ్ కలెక్షన్ టార్గెట్ రూ. 260 కోట్లు.. వర్కౌట్ అయ్యేనా..?

భవిష్యత్‌ ప్రణాళిక

దేశవ్యాప్తంగా కులగణన చేయాలని 30 నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం కోరితే… కేంద్రం చేయబోమని చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విధానాన్ని రోల్‌మెడల్‌గా దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్‌ చేసింది. దాంతో.. కులగణన చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. సమగ్ర కుటుంబ సర్వే, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ ప్రణాళిక తయారుచేస్తోంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది? వారికెలాంటి పథకాలు అందించాలనే దానిపై సూచనలు స్వీకరించనుంది. రిపోర్ట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలు ఇతర వర్గాల కంటే మూడు రెట్లు వెనుకబడి ఉన్నట్లు తేలింది. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలుకు.. అధికారంలో, ఆస్తుల్లో దక్కుతున్న వాటా ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అంతేకాదు, వెనుకబాటుతనం పరంగా 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు ఉన్నాయి. బీసీల్లోని కొన్ని వర్గాలు.. సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు తేలింది. వెనుకబాటుతనం సగటుతో పోల్చితే.. ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నారు. ఇక.. కులాంతర వివాహాలు చేసుకుంటున్నవారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు.

ఆందోళనలో అగ్రకులాలు

తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగా.. తమ సీట్లు, రిజర్వేషన్లు పెరుగుతాయని ఆశించే కులాలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, ప్రాబల్యం తగ్గుతుందేమోనన్న ఆందోళనలో ఇంకొన్ని అగ్రకులాలు ఉన్నాయి. రేవంత్ సర్కార్ విడుదల చేసిన ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు. రాబోయే రాజకీయ, సామాజిక మ్యాప్‌ని మార్చేసే అస్త్రాలుగా చెబుతున్నారు. ఎవరి వాటా ఎంత ఉంటే.. వారికి అంత అధికారం అనే నినాదం ఇకపై మరింత బలంగా వినిపించబోతోంది. అయితే, నిజమైన సామాజిక న్యాయానికి దారితీస్తుందా? కొత్త రాజకీయ వివాదాలకు కేంద్రబిందువు అవుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది.

32 శాతం కాగా వీరి వద్దే భూమి..?

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం ఏడు కులాల వారి యాజమాన్యంలోనే ఉందని కులగణన సర్వేలో తేలింది. రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాల వారు.. రాష్ట్ర జనాభాలో 32 శాతం కాగా వీరి వద్దే 51.4 శాతం భూమి ఉంది. మొత్తం పాతిక కులాల వారు.. తమ జనాభా నిష్పత్తి కన్నా అధికంగా భూమి యాజమాన్యం కలిగి ఉన్నారు. మిగిలిన వారికి.. జనాభా నిష్పత్తికన్నా తక్కువ భూములున్నాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8 శాతం మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి కులం. మొత్తం భూముల్లో 13.5 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక, బీసీ-బీ కేటగిరీలోని కురుమ కులంలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 62 శాతానికి పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయ్.

Also read: లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం ఎవ‌రేమంటున్నారు? క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం.. రేవంత్ అంత‌కు మించి..!

10 శాతం కంటే తక్కువ..

వీరి తర్వాత.. బీసీ-డీ ఆరేవాళ్లు, ఎస్టీ కోయ, లంబాడీ, ఎస్సీ మాదాసి కులాల్లో.. 60 శాతం కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. ఓసీ కేటగిరీలో రాజులు, ముస్లింలు, జైన్‌లు, బ్రాహ్మణులు, అయ్యంగార్ వర్గాల్లో 10 శాతం కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయ్. ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి కలిగి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకూ భూమి ఉంది. మాదిగల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాలకన్నా తక్కువ భూమి ఉంది. 20 ఎకరాలకన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాల్లో.. అత్యధికంగా ఓసీ జైన్‌లలో 8.2 శాతం, రాజుల్లో 7.5, బ్రాహ్మణుల్లో 6.8, బీసీ గంగిరెడ్లవారి దగ్గర 6 శాతం ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కులగణన..

కులగణన ప్రకారం.. అన్ని కులాల వారీకి వారి వెనుకబాటుతనం, అర్హతలకు తగ్గట్లుగా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే కోణంలో.. ప్రభుత్వం ఈ సర్వేతో.. సోషల్ ఎక్స్-రే తీసింది. ప్రస్తుతం ఉన్న సంక్షేమ ఫలాల్లో.. 30 శాతం వెనుకబాటుతనం తక్కువగా ఉన్న వర్గాలకే చేరుతోందనే సర్వేలో తేలింది. దీనిని.. సరిదిద్ది, నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ గణాంకాలే.. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు చట్టబద్ధమైన పునాదినిస్తాయ్. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి.. తెలంగాణని రోల్ మోడల్‌గా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సర్వే ప్రకారం..

ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే పథకాలన్నీ ఈ సర్వే ఆధారంగానే ఉండబోతున్నాయి. ఏ కులంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమందికి సొంతిల్లు లేదు? ఎవరికి భూమి లేదు? లాంటి వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీనివల్ల టార్గెటెడ్ వెల్ఫేర్ సాధ్యమవుతుంది. నిజంగా అవసరం ఉన్నవారికే సాయం అందుతుంది. ఈ సర్వే ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేవారు 10 శాతం కంటే తక్కువ ఉన్నారు. అలాగే, ప్రైవేట్ రంగంలో అగ్రవర్ణాల వారు 30 శాతం ఉంటే, ఎస్టీలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారు. ఈ అంతరాలను తగ్గించేలా.. భవిష్యత్తులో విద్యావేత్తలు, పాలసీ మేకర్లు కొత్త విద్యా పథకాలను రూపొందించే అవకాశం ఉంది. కేవలం ఓట్లు వేయడమే కాకుండా, నిర్ణయాధికారంలోనూ అన్ని వర్గాలకు సమాన వాటా దక్కాలనే చర్చ.. ఈ కులగణన గణాంకాలతో మొదలైంది. అసెంబ్లీలో, పార్లమెంటులో ఏ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదో ఈ అంకెలు స్పష్టం చేశాయి.

భవిష్యత్‌ కార్యాచరణ

వెనుకబాటుతనాన్ని తొలగించడానికి పార్టీలు, కుల సంఘాలిచ్చే సలహాలు, సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేను ప్రవేశపెట్టి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తంగా.. తెలంగాణ మోడల్ కులగణన దేశానికే ఒక దారి చూపబోతోంది. సర్వే గణాంకాలు వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ప్రభుత్వం వీటిని ఎంత వేగంగా చట్టబద్ధమైన హక్కులుగా మారుస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా తెలంగాణ అభివృద్ధిలో.. ఇది ఒక కొత్త శకానికి నాంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Also read: ఇక కేబుల్స్ అవసరం లేదు.. Nothing Warp యాప్‌తో నిమిషాల్లో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×