BigTV English

CM Revanth Reddy: 10 ఏండ్ల పద్మవ్యూహాన్ని ఏడాదిలో ఛేదించాడు.!

CM Revanth Reddy: 10 ఏండ్ల పద్మవ్యూహాన్ని ఏడాదిలో ఛేదించాడు.!

CM Revanth Reddy: కాంగ్రెస్ పాలనకు ఏడాది. మరి తొలి ఏడాది ఎలా గడిచింది? జనం ఎక్స్ పెక్టేషన్స్ కు రేవంత్ ప్రభుత్వం రీచ్ అయిందా? గత పదేళ్ల బీఆర్ఎస్ ఏలుబడికి, కాంగ్రెస్ తొలి ఏడాది పాలనకు క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపించిందా? అభివృద్ధి, సంక్షేమం జాయింట్ గా దూసుకెళ్లాయా? చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాది గడిచింది. సాహసోపేత నిర్ణయాలు, సంక్షోభాలను పటిష్ట వ్యూహాలతో పరిష్కరించుకోవడం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తీసుకోవడం, అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే నిర్ణయాలను అమలు చేయడం ఏడాది పాలనలో హైలెట్. ఎందుకంటే తెలంగాణ తొలి రెండు టర్మ్ లలో ఏదైతే మిస్ అయిందో.. వాటికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగింది. ప్రజా సంక్షేమం, హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయి.


రూ. 3541 కోట్లు మహిళలకు ఆదా

2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. తొలిరోజు ఆరు గ్యారెంటీలపై సంతకాలు, ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించడం, దివ్యాంగురాలికి ఉద్యోగం ఇలాంటి వాటితో మొదలైంది. ఆ తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా మహిళా సాధికారత కోసం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ స్కీం ప్రారంభమైన నాటి నుంచి నవంబర్ మూడో తేదీ వరకు 3541 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. అటు ఫిబ్రవరి 27, 2024న 500కే ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా, 46 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. మరోవైపు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 90 లక్షల కుటుంబాలకు 1672 విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకో హామీ 200 యూనిట్ల దాకా గృహజ్యోతి. ఈ స్కీం కింద 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.


ఇందిరమ్మ ఇండ్లకు రూ. 22,500 కోట్లు

పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ ఏడాది మార్చి 11న సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల వ్యయంతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామన్నారు. ఇందుకోసం తాజాగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు. అత్యంత నిరుపేదలకే తొలుత ప్రయోజనం కలగబోతోంది. గతంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ కట్ అన్నట్లు వ్యవహారం ఉండేది. సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. నాటి ప్రగతి భవన్ లోకి ఎవరికీ పర్మిషన్ ఉండేది కాదు. కానీ ప్రజా ప్రభుత్వంలో మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెలు తొలగించి, మాహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా మార్చారు.

6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ

ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 7 వరకు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సకాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. వీటి కోసం ఓ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక సంక్షేమంలో విషయంలో కీలకమైంది రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు. రైతు రుణమాఫీని చాలా ప్రాధాన్య అంశంగా తీసుకుని తొలి ఏడాదిలోనే రైతుల్ని రుణాల నుంచి విముక్తి చేయించారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రుణాలు టైంకు మాఫీ కాక వాటి వడ్డీ భారం కూడా రైతులపై పడింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని రుణమాఫీకి 21 వేల కోట్లను తొలి ఏడాదిలోనే కేటాయించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రికార్డు సృష్టించింది రేవంత్ ప్రభుత్వం.

సన్నధాన్యంపై రూ. 500 బోనస్ జమ

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల సంక్షేమం కోసం కోదండరెడ్డి చైర్మన్ గా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేశారు. రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేశారు. అటు పంటల బీమా గతంలో లేక చాలా సందర్భాల్లో రైతులు నష్టపోయారు. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం చేరింది. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుంది. ధాన్యంలో తేమ, తాలుతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. అధునాతన డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో IASను ప్రత్యేక అధికారిగా నియమించింది. సో సంక్షేమంలో ఎక్కడా లెక్క తగ్గకుండా డీల్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

150 ఎకరాల్లో రూ. 100 కోట్లు కేటాయింపు

విద్య, వైద్యం, మౌలిక వసతులు ఏ రాష్ట్ర అభివృద్ధికైనా కీలకం. సో తెలంగాణలో కూడా సీఎం రేవంత్, విద్య వైద్యం, అభివృద్ధి కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజుల్లో చాలా మంది చదువులు చదువుతున్నా అందుకు తగ్గ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అందుకోసం స్కిల్ యూనివర్శిటీ సీఎం ఆలోచనల నుంచి పుట్టింది. ఇదో మైల్ స్టోన్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. వర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించారు. అటు సర్కారీ బడుల్లో విద్యార్థులకు తొలి రోజే యూనిఫాం, పుస్తకాలు అందజేశారు. యూనిఫాంలు కుట్టే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు.

19 నియోజకవర్గాల్లో స్కూల్ క్యాంపస్ లకు శంకుస్థాపన

రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్ లకు ఖర్చు లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తోంది. అటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో 100 కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 19 సెగ్మెంట్లలో ఈ స్కూల్ క్యాంపస్ లకు శంకుస్థాపన చేశారు.

అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలను మార్చుతున్నారు. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలిచ్చింది ప్రభుత్వం. విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. హాస్టల్స్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచారు. ప్రభుత్వ స్కూల్ పిల్లల కోసం తెలంగాణ దర్శిని తీసుకొచ్చారు.

మహిళా శక్తి కింద రూ.20 వేల కోట్ల రుణాల లక్ష్యం

సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం, కాంట్రాక్టు కార్మికులకు కూడా తొలిసారిగా బోనస్ ప్రకటించడం ఈ ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. గల్ప్ కార్మికుల కోసం 5 లక్షల ఆర్థిక సాయం, గిగ్ వర్కర్స్ కోసం 5 లక్షల ప్రమాద బీమా, సెర్ప్ కింద మహిళా శక్తి కార్యక్రమం, బ్యాంకు లింకేజీ ద్వారా 20 వేల కోట్ల రుణాలు ఇప్పించే లక్ష్యం పెట్టుకుంది. ఇందిరా మహిళాశక్తి పాలసీ తీసుకొచ్చింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా జీవిత బీమా పథ, ఇందిరా రుణ బీమా పథకం ఇవన్నీ మహిళల కోసం తొలి ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలు.

114 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్న హైడ్రా

మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ కు తొలి ఏడాదిలోనే పెద్ద పీట వేశారు. హైడ్రా తీసుకురావడం, మురుగునీరు, వరదనీటి పారుదల కోసం చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అటు మెట్రో దశ కోసం 76 కిలోమీటర్ల ట్రాక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అటు హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ పునరుజ్జీవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఇవన్నీ కీలకంగా మారాయి. 30 ప్రాంతాల్లో హైడ్రా 114 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనంచేసుకుంది. 310 అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.

స్పీడ్ పాలసీ కింద 19 అభివృద్ధి ప్రాజెక్టులపై ఫోకస్

అసలు సిసలైన అభివృద్ధి అంటే ఏంటో తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలతో అందరికీ తెలిసి వచ్చింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ప్యూచర్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు సీఎం. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆగస్ట్ 2న జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ షెడ్యూల్స్ కూడా ఇచ్చేశారు. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా ఇదే.

నిరుద్యోగుల గరిష్ఠ వయోపరిమితి 46 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్థారించింది. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు కూడా పూర్తి చేసింది ఈ తొలి ఏడాదిలోనే. ఇక స్పీడ్ అంటే స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్కీం కింద 19 అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టుల పూర్తికి.. స్పీడ్‌ పేరుతో సరికొత్త కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ ను తీర్చి దిద్దుతున్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో నాలుగో స్థానంలో తెలంగాణ

ఆర్థిక వృద్ధిలో తెలంగాణ జీడీపీ 9.2% గా నమోదైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతంలో 9వ స్థానం ఉంటే ఏడాదిలోనే సీన్ మొత్తం మార్చేశారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డ్ సాధిస్తే, విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ రికార్డు సృష్టించింది. విద్యుత్ వినియోగంలో రికార్డు, ధాన్యం కొనుగోళ్లలో 10 వేల కోట్ల రూపాయల చెల్లింపులతో రికార్డు ఇలాంటివెన్నో ఈ ఏడాది కాలంలోనే జరిగాయి. సో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ దిశగా రెండో ఏడాదికి స్వాగతం పలుకుతోంది ప్రజా ప్రభుత్వం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×