మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మరో ముందడుగు పడింది. మంచిరేవుల దగ్గర.. ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ డిజైన్‌ను మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మిస్తున్నారు. మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మూసీ ప్రక్షాళన సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. ఎవరైనా అడ్డుపడితే ప్రభుత్వం శివతాండవం చేస్తుందన్నారు. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తామని తెలిపారు. గోదావరి నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్‌కు తరలిస్తామని, మూసీలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల క్రమంలో ప్రధాని మోడీ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రాధాన్య క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్లు చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశలో.. 351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఇందులో 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, 96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఎన్ని అడ్డంకులెదురైనా.. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. పేదల వైద్యానికి అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. గడిచిన 27 నెలల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీల రూపంలో.. పేదల వైద్యం కోసం 4,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. పేదలకు జీవిత బీమా అందించి వారిలో ధీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆస్పత్రుల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు సీఎం.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసు వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపుతో పాటు సమయ పాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు. ఈ వారం శాసనమండలి హాల్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులపై సీఎం రివ్యూ నిర్వహించారు. లోకల్ రైళ్లలో ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల దగ్గరకి ఆర్టీసీ మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్.. ఈ వారం శాసనమండలి హాల్‌లో సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాసన స్థాయి, సామర్థ్య లోపాలకు సంబంధించి వివిధ నివేదికలను కార్తీక్ మురళీధరన్.. సీఎం దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు మరొకరిని నియమించాలని సూచించారు. మురళీధరన్ సూచించిన అంశాలను క్యూర్ పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వం తరఫున అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వారం శాసనమండలి హాలులో సీఎస్ఆర్ నిధులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవన్నారు. తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాల్సిన అవసరం ఉందని, మన దగ్గరున్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ నిర్వహించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వారం ముఖ్యమంత్రితో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్ సూచన పోర్టల్ తరహాలో.. తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉండేలా.. ఈ పోర్టల్ రూపొందించనున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాలులో.. మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా, పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించకుండా ఉండేందుకు పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో.. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింత పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం.. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు. కేంద్రం అనుకున్నట్లుగా 50 శాతం సీట్లు పెంచితే.. భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదన్నారు. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురికావడమే కాకుండా తీరని నష్టం జరుగుతుందన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి సమగ్రమైన రోడ్ మ్యాప్ తయారు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో.. నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారెవరినీ నిరాశ్రయులను చేయబోమన్నారు. ఈ వారం శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానం ఇచ్చారు. ఎవ్వరికీ నష్టం జరగకుండా మెరుగైన వసతులతో ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను సభముందు సమగ్రంగా వివరించారు. నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుని ఆపే ఆలోచన చేయరన్నారు. కావాలనుకుంటే, మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తామన్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లక్ష్యంతో 24 వేల కోట్లతో మెట్రో రెండో దశలో.. 76 కిలోమీటర్ల మేర విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తూ, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి పది లక్షలకు పెంచామన్నారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు.. ఆ కుటుంబం వీధిన పడకుండా కుటుంబ బీమా తెచ్చామన్నారు సీఎం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. శ్రీ వాసవీ అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వారం నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారన్నారు. ఈ మహోత్సవంలో వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంతో అభినందనలు తెలియజేశారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.
ఈ వారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో.. రాష్ట్ర రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి.. రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో 775 కోట్లు విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ.. రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికసాయంతో చేతులు దులుపుకోవడం కాదు, 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలుపెట్టి, పూర్తి చేసి రైతు లోకానికి అంకితం చేసినట్లు తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు.. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి సరైన ప్రణాళికల్ని తయారు చేయాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు లాభసాటిగా ఎలా మార్చాలన్న విషయాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Also Read: మోదీతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. ఇంధన భద్రతపై తెలంగాణ ప్రణాళిక ఇదే!
Story by: Anup, Big Tv