CM Revanth Reddy: తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువకులు, ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్న సంకల్పంతో.. ప్రభుత్వం ఉందన్నారు. రైతు బీమా, రైతుభరోసా లాంటి సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా లక్షా 15 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. గడిచిన రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రైతులకు అందించే పెట్టుబడి సాయం రైతు భరోసా సాయంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికీ కాకుండా, వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తోంది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8-12శాతం సాగులో తేడా కనిపిస్తున్నట్లు తెలిసింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన- ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇందూరు జిల్లా మహిళా సమాఖ్యకు 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు సీఎం. జిల్లా అభివృద్ధికి అన్నివిధాలా ప్రయత్నిస్తానని చెప్పారు.
ఈ నెల 15న తెలంగాణ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో చేరనుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ పోర్టల్‌లో చేరాయి. గత ప్రభుత్వం సారథి, వాహన్ పోర్టళ్లలో చేరేందుకు విముఖత చూపడంతో రవాణాశాఖ ఇప్పటివరకు సొంత ఐటీ వ్యవస్థతోనే వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కుల బదిలీ వంటి సేవల్ని అందించింది. అయితే.. ఇతర రాష్ట్రాల వాహనాల్ని తెలంగాణ వాసులు కొన్నప్పుడు, ఇక్కడి వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు అవసరమైన పత్రాల కోసం ఆయా రాష్ట్రాల ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై.. మార్చి 15 నుంచి జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలు కేంద్ర సర్వర్‌లో నమోదవుతాయి. ఆ వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినా, ఇతర రాష్ట్రాల వారికి విక్రయించి, ఆయా రాష్ట్రాల్లో తిరిగినా అవసరమైన టెక్నికల్ ప్రాసెస్ సులువవుతుంది.
ఉద్యోగుల జీతాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, కార్పొరేషన్ ఉద్యోగులంతా ఐఎఫ్‌ఎంఐఎస్ పరిధిలోకి వస్తారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల అంశాన్ని వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఐఎఫ్‌ఎంఐఎస్ ద్వారా జీతాలు విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
వరంగల్-కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్ సమగ్ర ప్రణాళికలను ప్రకటించారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేసి.. వాటిని కలిపేలా రోడ్లను విస్తరించి, రెండింటి మధ్య అతి పెద్ద డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. డంప్ యార్డ్ దగ్గర.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. ఈ వారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చొప్పదండిలో 45 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌కి, 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్‌పోర్ట్ పూర్తి చేసి, కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో లింక్ చేసి, జంట నగరాలుగా వాటిని దేశానికే ఆదర్శంగా నిలబడే మున్సిపల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం.
కరీంనగర్ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు 110 కోట్ల చెక్కును అందించారు. వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాద్ బాసర పుణ్యక్షేత్రం నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను పూర్తిస్థాయి ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. అవసరమైతే నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసి వాటిని.. టూరిజం స్పాట్‌లుగా, పుణ్యక్షేత్రాలుగా, ఎకోటూరిజంని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు.
గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని, ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పుతో.. 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా నియామకమవుతున్నారని.. వాళ్లంతా రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకునే సత్తా తెలంగాణకు ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లలో ఏం చేశామో అసెంబ్లీ వేదికగా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రావి నారాయణ రెడ్డి గౌరవాన్ని పెంచేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మిర్యాలగూడలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు.. ఈ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మహిళా సమాఖ్యకు 1138 కోట్ల చెక్కు అందజేశారు. అలాగే.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా.. ముంబై, బెంగళూరు నగరాల తరహాలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్‌లకు సంబంధించి కామన్ బిల్ తేవాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన చర్యలూ ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రెడీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతులమీదుగా ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీలో వచ్చే ఫలితాల ఆధారంగా కామన్ బిల్ విధానాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకురానున్నారు. ఈనెల 15వ తేదీ వరకు విద్యుత్ వినియోగదారుల మొబైల్ నెంబర్లను, జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌తో లింక్ చేయాలని గడువు విధించారు.
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్‌లో లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ని పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మంత్రివర్గ సహచరులు అభినందనలు తెలియజేశారు. మంత్రులు ఉత్తమ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి , జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. అభినందనలు తెలియజేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అందరితో చర్చించి, వారి గౌరవాన్ని పెంచేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని సీఎం చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గారికి అందజేశారు. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి దక్కడం సముచితమని ముఖ్యమంత్రి అన్నారు.
అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత.. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి నెల పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేస్తూ ఈ వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లుల కోసం 720 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే, 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ జిపిఎఫ్ సరెండర్ లీవ్ అడ్వాన్సులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ బకాయిలు విడుదల చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..