స్వేచ్ఛ ప్రత్యేక కథనం
– సెప్టెంబరు 17పై పార్టీల తలోదారి
– 2014 నుంచి 2022 వరకు మౌనంగా బీఆర్ఎస్
– 2022 నుంచి జాతీయ సమైక్యతా దినంగా సంబురాలు
– ఆది నుంచీ విమోచన దినోత్సవంగా చెబుతున్న బీజేపీ
– విలీన దినోత్సవంగా కాంగ్రెస్ వేడుకలు
– విద్రోహం పేరుతో కమ్యూనిస్ట్ పార్టీల కార్యక్రమాలు
– ఈసారి ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం
– విద్వేషాలకు చెక్ పెట్టేందుకేనంటున్న హస్తం నేతలు
Telangana Liberation Day: సెప్టెంబర్ 17.. తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు.. నిజాం రాచరిక పాలన నుంచి విముక్తమై ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన రోజు. ఆ రోజు ఏం జరిగిందో చరిత్రలో స్పష్టంగా అందరికీ తెలిసినా, అసలు నిజాలు దాచేసి, నాటి కీలక ఘట్టానికి ఎవరికి వారు తమకు నచ్చిన భాష్యం చెప్పటానికి ప్రయత్నిస్తుండటమే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆయా పార్టీలు నాటి ఘటనలకు మతం రంగు పులమటానికి ప్రయత్నించటం మరో విషాదం.
బీఆర్ఎస్ వైఖరి..
కారణాలు ఏమైనా, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ.. నిజాం పాలన పట్ల కొంత విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించింది. తెలంగాణ అస్థిత్వానికి గుర్తుగా సెప్టెంబర్ 17 తారీఖుని గుర్తించాలని కూడా అప్పట్లో ఆ పార్టీ అధినేత డిమాండ్ చేశారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ అధినేత తన వైఖరిని మార్చుకున్నారు. ఎంఐఎం పార్టీతో వారికి ఉన్న పొత్తు, 12 శాతం ముస్లిం మైనారిటీల ఓట్లను దూరం చేసుకోరాదనే కారణాలతో బాటు, ఈ అంశం ఆధారంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే అనుమానాలతో 2019 వరకు దీనిపై వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. కానీ, కానీ, బీజేపీ పదేపదే ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టటంతో 2019 సెప్టెంబరు 15న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు అసలైన విముక్తి.. విమోచనం.. 2014 జూన్ 2న జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, సెప్టెంబర్ 17న ఎవరికి నచ్చిన రీతిలో వారు వేడుకలు జరుపుకోవచ్చని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని, కానీ అన్ని వర్గాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, గతాన్ని మళ్లీ తవ్వడమెందుకన్న ఉద్దేశంతో ఆరోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజాంపై నిందలు వేసే బీజేపీ.. అదే సర్దార్ పటేల్ స్వయంగా నిజాంకు రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చిన విషయం గురించి ఎందుకు మాట్లాడదని అప్పట్లో కేసీఆర్ నిలదీశారు. కానీ, కేంద్రంలోని బీజేపీ హవా చూసిన తర్వాత అప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ 2022, 2023లలో సెప్టెంబరు 17ను ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ గా జరపాలని నిర్ణయించి, నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగరవేయటమే గాక, అన్ని జిల్లాలలోనూ దీనిని అధికారికంగా జరిపారు. ప్రస్తుతమూ అదే ఆ పార్టీ వైఖరిగా ఉంది.
బీజేపీ.. విమోచనమే
నిరంకుశ నిజాం పాలనలో ప్రజలు తిరుగుబాటు చేసి, పాలకుడి కొమ్ములు విరిచి భారత యూనియన్‌లో లొంగిపోయేలా చేసిన సెప్టెంబరు 17.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమేనని బీజేపీ వాదన. ఆదినుంచీ ఆ పార్టీ ఈ రోజును ఇదే పేరుతో నిర్వహిస్తోంది. నిజాం పాలనలో ఆయన ప్రతినిధిగా ఉన్న ఎంఐఎం అధినేత ఖాసిం రజ్వీ దురాగతాలను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. వాటిని నేటి ఎంఐఎంకు ఆపాదించే యత్నం చేస్తోంది. హిందూ మెజారిటీ సంస్థానంలో ముస్లింపాలకుడి పెత్తనంగానూ దీనిని చిత్రీకరించే యత్నం చేస్తోంది. 2023 సెప్టెంబరు 17న కేంద్ర హోం అమిత్ షా.. సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన సభకు హాజరై.. దీనికి సెంటిమెంటును రగిలించే యత్నం చేశారు. కాగా, 2024 మార్చి 12న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెప్టెంబరు 17ను ‘హైదరాబాద్ విమోచనా దినోత్సవం’గా అధికారికంగా జరుపుతామని ప్రకటించింది. ఈ విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలను ఇరుకున పెట్టి, తన బలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ముందుకుపోతోంది. నాటి ఉమ్మడి హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయిన నేటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో అక్కడ దీనిని పార్టీలకు అతీతంగా అక్కడి ప్రభుత్వాలు.. దీనిని విమోచన దినోత్సవంగా జరుపుతుండగా, ఇక్కడ రకరకాల పేర్లతో జరపటమేంటనేది ఆ పార్టీ వాదన.
Also Read: జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!
కాంగ్రెస్.. ప్రజా పాలనా దినం
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ, పటేల్ వంటి నేతలంతా దీనిని విమోచనగానే పేర్కొన్నారు. హైదరాబాద్ మీద నేరుగా యుద్ధం చేయలేదని, ‘ఆపరేషన్ పోలో’ పేరుతో ఒక పరిమితమైన సైనిక చర్య జరిపి సంస్థానాన్ని విలీనం చేసినందున దీనికి మరోపేరు ఆపాదించటం సరికాదనేది కాంగ్రెస్ భావనగా కొనసాగింది. నాటి నుంచి 2023 వరకు కాంగ్రెస్ దీనిని విమోచనా దినోత్సవంగా నిర్వహించేది. కానీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ‘ప్రజాపాలనా దినోత్సవం’గా అధికారికంగా జరుపుతామని, ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేయాలని నిర్ణయించారు.
కారణం ఇదే..
సెప్టెంబరు 17ను బీజేపీ విమోచన దినోత్సవమని, కమ్యూనిస్టులు విద్రోహ దినమని, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినమని చెప్పటం మూలంగా ఏటా ఈ రోజున రాజకీయ ఉద్రికత్తలు తలెత్తున్నాయి. దీనిమూలంగా బహుళ సంస్కృతుల తెలంగాణలోని ప్రజల మధ్య అనవసరపు వైషమ్యాలు రాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రజాపాలనా దినోత్సవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఆకాంక్షల మధ్య ఏర్పడిన తెలంగాణ గత పదేళ్ల కాలంలో దగా పడిన నేపథ్యంలో, అభివృద్ధి అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరముందని, ఈ కీలక సమయంలో గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చరిత్రలో కొన్ని చేదు ఘటనలను అంత సులభంగా మరచి పోలేకపోయినా, వాటికి మందు పూసే ప్రయత్నం పేరుతో వాటిని తిరిగి రాచపుండులా మార్చటం కంటే.. ప్రజా పాలన పేరుతో ప్రజలను ప్రగతి పథంలో నడపాలనేదే కాంగ్రెస్ నిర్ణయం వెనక ఉన్న అసలైన కారణంగా తెలుస్తోంది.