Lalu Prasad Yadav: నవంబర్‌లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ పై సోమవారం దిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో వీరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది
లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ లు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఆరోపణలు వచ్చాయి. రౌజ్ అవెన్యూ కోర్టు మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద లాలూ కుటుంబపై అభియోగాలు నమోదు చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని దుర్వినియోగం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాంట్రాక్టులను సుజాత హోటల్‌కు అప్పగించేందుకు బదులుగా, లాలూ యాదవ్ ఒక బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో మూడు ఎకరాలు భూమిని లంచంగా పొందారని సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారంపై సీబీఐ 2017లోనే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. నిందితులపై అభియోగాలు మోపేందుకు తగిన సమాచారం ఉందని కోర్టుకు వెల్లడించగా.. లాలూ తరఫు న్యాయవాది ఆ వాదనను తోసిపుచ్చారు. కోర్టులో లాలూ, తేజస్వి తాము ఏ తప్పూ చేయలేదని పేర్కొనగా, రబ్రీ దేవీ అసలు ఈ కేసు తప్పుగా మోపబడినదని వాదించారు.
ALSO READ: IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమికి, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధస్ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారం కీలక దశలో ఉన్న ఈ సమయంలో అవినీతి కేసులో కోర్టు ఆదేశాలు లాలూ కుటుంబానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఈ పరిణామం ప్రత్యర్థి పార్టీలకు తమ ప్రచారంలో లాలూ కుటుంబంపై విమర్శలు చేసేందుకు ఒక అవకాశంగా మారింది.