E-Paper
Advertisement

Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

Municipal Elections:  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో … రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సమరానికి సిద్దమవుతున్నాయి.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుకుని ప్రచారం వరకూ కార్యాచరణను సిద్ధం చేసుకుని, అమలు కూడా మొదలుపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు సీరియ్‌సగా తీసుకున్నాయి. ఎన్నికల యుద్ధంలో గెలిచి పురపాలికలపై తమ జెండా ఎగరేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 13న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ఆ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికల గడువు తక్కువ ఉండటంతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్లు నోటిఫికేషన్‌ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. 30వ తేదీ వరకు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

పట్టణాలపై పట్టు కోసం కాంగ్రెస్‌ కసరత్తు

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టేశాయి. మెజారిటీ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గెలుపు తమదేనన్న ధీమాను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ సీట్లను దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ.. అదే హవాను మునిసిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగించి, పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు సాధించాలనే పట్టుదలతో కసరత్తు చేసింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై పట్టు దొరికితే విజన్‌ 2047ను సమర్థంగా అమలు చేసే స్వేచ్ఛ సీఎం రేవంత్‌కు, ప్రభుత్వానికి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడిస్తున్నాయి.

ఇన్చార్జ్ మంత్రులకు కాంగ్రెస్ కీలక ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక బాధ్యతలను ఇన్చార్జ్ మంత్రులకు అప్పగించింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమితులైన మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ అభ్యర్ధులను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గం పరిధిలోనే ఉండాలని తాజాగా సూచించింది. పోటీకి ఆశావహులు ఇచ్చిన దరఖాస్తులను మంత్రి చైర్మన్‌గా ఉన్న కమిటీ పరిశీలించి, బలమైన అభ్యర్ధులను ఎంపిక చేయాలని పార్టీ ఆదేశించింది. డీసీసీ అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ సీనియర్ నేతలతో మంత్రి చర్చించి అభ్యర్ధుల జాబితా రూపొందించాలి.

రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ ఉక్కుపాదం

పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ సీట్లను దక్కించుకున్నా.. రెబల్‌ అభ్యర్థుల కారణంగా అనేక పంచాయతీలను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులకు చెక్‌ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎక్కడైనా ఏకాభిప్రాయం కుదరకపోతే ఆశావహుల పేర్లను పీసీసీకి పంపితే.. రాష్ట్రస్థాయిలో అభ్యర్ధులను ఫైనల్ చేస్తారు. నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కావడంతో గురువారాని కల్లా అభ్యర్ధులను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఇన్చార్జ్ మంత్రులకు సూచించారు. రెబల్స్ నామినేషన్లు వేయకుండా మంత్రి, కమిటీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు మొదలుకుని ప్రచారం, పోలింగ్‌ దాకా ఇంచార్జి మంత్రులే సమన్వయం చేసుకోనున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల్లో సీఎం రేవంత్ సభలు

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరిగిరాగానే మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి సుడిగాలి ప్రచారం చేపట్టనున్నారు. జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం రేవంత్‌రెడ్డి సభలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ సభలనే ఆయన మునిసిపల్‌ ఎన్నికల సభలుగా మలుచుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ మునిసిపల్ వ్యూహం

ప్రభుత్వ వ్యతిరేకతే మునిసిపల్‌ ఎన్నికల్లో తమను గెలిపిస్తుందంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యలే ఎజెండాగా పనిచేస్తోంది. అలాగే.. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, గెలిపించే బాధ్యతను పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలేస్తున్నట్లు ఇటీవల చిట్‌చాట్‌లో కేటీఆర్‌ వెల్లడించారు. ఇందులో రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ గానీ, తాను గానీ ప్రచారం చేయాల్సిన అవసరమూ లేదన్నారు. ప్రతి మునిసిపాలిటీకీ ఒక ఇంచార్జిని, ప్రతి జిల్లాకు ఒక సమన్వయ కర్తను నియమించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం.. ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీని గెలిపించే బాధ్యతను వారికే అప్పగించింది.

గ్రేటర్ ఎమ్మెల్యేలకూ జిల్లా టాస్క్‌లు

గ్రేటర్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గులాబీ పార్టీ జిల్లాల బాధ్యతలు కట్టబెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎక్కువ మున్సిపాల్టీలు గెలిచేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. స్థానిక రిజర్వేషన్లకు తగ్గట్లు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గులాబీ కండువాలు, పార్టీ జెండాలు, కరపత్రాలు తదితర ప్రచార సామగ్రని ఇప్పటికే జల్లా పార్టీ కార్యాలయాలకు చేరవేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్‌రావు ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండటం.. ప్రచార గడువు తక్కవగా ఉండటంతో .. భారీ బహిరంగసభలు నిర్వహించకుండా, మున్సిపాల్టీల వారీగా ఎంపిక చేసిన చోట్ల వారు ప్రచారంలో పాల్గొంటారంట. క్షేత్రస్థాయిలో ప్రచారం, ఎన్నికల సరళి పర్యవేక్షణ, సలహాలు, సూచనలిస్తూ అందరితో సమన్వయం చేయడానికి తెలంగాణ భవన్లో 8 మందితో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అయితే పోటీ చేసే అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చుపై పార్టీ పరంగా ఇంతవరకు ఎలాంటి హామీ లభించకపోవడం గమనార్హం.

పట్టణ ఓటింగ్‌పైనే బీజేపీ ఆశలు..

ఇక, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే తమకు ఎక్కువగా బలముందని, తమకు సైలెంట్‌ ఓటింగ్‌ జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు పట్టణ ప్రాంత ఓటింగ్‌పై బలంగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇప్పటికే ఇంచార్జిలను నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారితో మూడు సార్లు సమీక్ష సమావేశాలూ నిర్వహించారు. స్మార్ట్‌ సిటీలు మొదలు.. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలూ ఓటర్లకు చెబుతున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

సేవ్ తెలంగాణ.. ఓట్ తెలంగాణ

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రతి డివిజన్, వార్డుల్లో పోటీ చేయాలని కమలదళం నిర్ణయించింది. 5 కార్పొరేషన్లు, సగం మున్సిపాల్టీలు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. సేవ్ తెలంగాణ.. ఓట్ తెలంగాణ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని, పట్టణాలు, నగరాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రామచంద్రరావు శంషాబాద్‌లో జరిగిన సమావేశంలో నేతలందరికీ సూచించారు. ఈ ఎన్నికల సమయంలోనే పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో ఎంపీలంతా రాష్ట్రంలోనే ప్రచారంలో పాల్గొనేలా ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకుంటాని రామచంద్రరావు తెలిపారు. ఒంటరిగానే బరిలోకి దిగనున్న బీజేపీ పట్టణాల్లో కాంగ్రెస్‌కు ధీటుగా స్థానాలు కైవసం చేసుకోవాలన్ని పట్టుదలతో ఉంది.

మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం-సీపీఐ వ్యూహాలు భిన్నం

ఇక మున్సిపోల్స్‌లో సీపీఎం, సీపీఐ భిన్నవ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. సీపీఐ కాంగ్రెస్‌తో వీలైనన్ని చోట్ల పొత్తులకు ప్రయత్నిస్తోంది. సీపీఎం మాత్రం బలమున్న చోట ఒంటరిగా పోటీ చేయడంతో పాటు, మిగతా చోట్ల స్థానిక పరిస్థితుల్పి బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో పొత్తులకు చర్చలు జరుపుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో ఒకసారి చర్చలు జరిపారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. వచ్చే నెల 13న వెలువడనున్న ఫలితాలతో పార్టీల తలరాతలు తేలిపోనున్నాయి.

Story by: Apparao, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×