TG Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనం తీర్పు ఒకలా ఉంటే.. పదవుల పంపకం మరోలా ఉంది. అసలైన రాజకీయ చదరంగం ఏమిటో చూపించాయ్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక కోసం జరిగిన హైడ్రామా చూశాక.. రాజకీయాల్లో నైతికత కంటే వ్యూహాలకే విలువెక్కువ అని మరోసారి ప్రూవ్ అయింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ మున్సిపాలిటీల్లో.. రాజకీయం పరాకాష్టకు చేరింది. మొత్తం ఫలితాన్నే మార్చేసింది. రాజకీయం అంటే ఏమిటో చూపించింది. ఇందుకు.. ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయ్. మెట్‌పల్లి మున్సిపాలిటీలో.. కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయ్.
మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీజేపీని వరించింది. నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ సేమ్ సీన్. కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. చేసేదేమీ లేక బీజేపీతో చేతులు కలిపింది. పదవులను పంచుకుంది. కాంగ్రెస్‌కు ఛైర్మన్, బీజేపీకి వైస్ ఛైర్మన్ పోస్టు దక్కింది. నారాయణపేటలో.. బీఆర్ఎస్ హాజరవకపోవడంతో.. బీజేపీ ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో.. మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. ఇస్నాపూర్‌లో బీజేపీ.. బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపింది. ఎంపీ రఘునందన్ ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఓటు వేయడంతో.. బీఆర్ఎస్‌కు ఛైర్మన్ పీఠం దక్కింది.
ఇక.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మరీ విచిత్రం. ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతుతో.. మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం అయింది. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కింది. భైంసాలో ఎంఐఎంకి కాంగ్రెస్ షాకిచ్చింది. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఛైర్మన్ అయ్యారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ మద్దతుతో.. కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల్‌లో బీజేపీ కౌన్సిలర్లు హాజరవకపోవడంతో.. కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక.. ఆమన్‌గల్, నర్సాపూర్, అలియాబాద్, మెట్‌పల్లిలో.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చి బీజేపీ వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుంది. జిన్నారం, ఎల్లంపేట, రాయికల్‌లో.. బీఆర్ఎస్‌కు మద్దతిచ్చి.. వైస్ ఛైర్మన్ పోస్టులు దక్కించుకుంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కుస్తీకి దిగే పార్టీలన్నీ.. కిందిస్థాయి మున్సిపాలిటీల్లో ఈ రకమైన దోస్తీని చూసి.. జనం అవాక్కవుతున్నారు.
తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ, సుమారు 38 మున్సిపాలిటీల్లో.. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దాంతో.. అసలైన రాజకీయం మొదలైంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ల కంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉండే ఎక్స్-అఫీషియో ఓట్లే కీలకంగా మారాయి. తక్కువ వార్డులు గెలిచిన పార్టీ కూడా ఈ ఓట్ల అండతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పోస్టులు దక్కించుకున్నాయ్. అనేక వార్డుల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా కింగ్ మేకర్స్‌గా మారారు. పరిస్థితులు కలిసొచ్చి.. కొన్ని చోట్ల వాళ్లే ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెతకు.. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనం. వార్డుల్లో.. నువ్వా-నేనా అంటూ పోటాపోటీగా తలపడిన నేతలంతా.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాల కోసం చేతులు కలపడం చూసి జనం షాక్ అవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఇలా పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కన పెట్టి, అధికారం కోసం బహిరంగంగా మద్దతిచ్చుకోవడం చూశాక.. రాజకీయం ఎప్పుడైనా రంగు మారొచ్చు, ఏమైనా జరగొచ్చనే విషయాలను.. జనం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.
జనం తీర్పుని.. పార్టీలు అపహాస్యం చేస్తున్నాయా? అనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది. ప్రజలు ఒక పార్టీకి పట్టం కడితే.. నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం మరొకరికి మద్దతివ్వడం ఎంతవరకు ధర్మం అన్నదే సామాన్యుడి ప్రశ్న. ఎన్నికైన గంటల వ్యవధిలోనే కండువాలు మార్చే దృశ్యాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పరిపాటిగా మారాయ్. అధికారం, రాజకీయం ముందు.. ప్రజాస్వామ్య విలువలు పతనమైపోతున్నాయ్. ఇలాంటి సీన్లు చూశాక.. అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే.. జనం వేసిన ఓటుకు ఇక విలువేముంది? అని! ఏదేమైనా.. చివరికి రాజకీయమే గెలిచింది. రాజకీయం తెగిస్తే.. ఎంతటి చిత్ర విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తాయో.. తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోరు మనందరి కళ్లకు కట్టింది. ప్రజాస్వామ్యంలో ఓటర్లు కేవలం.. ఐదేళ్లకోసారి బటన్ నొక్కే రోబోలేననే డౌట్ కూడా వస్తోంది.
రాజకీయాల్లో.. నైతికత కంటే అవకాశవాదం, ప్రజాసేవ కంటే, అధికార దాహమే ఎక్కువగా కనిపిస్తున్న రోజులివి. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే కార్యకర్తలు, ఆశయాలను నమ్మి ఓటేసే జనం.. చివరికి కేవలం పావులుగానే మిగిలిపోతున్న పరిస్థితి ఇది. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల పర్వం, తర్వాత జరిగిన మేయర్లు, ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ చూశాక.. సామాన్యుడికి కలిగిన భావన ఒక్కటే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం.. రాజకీయ స్వార్థం మాత్రమే శాశ్వతం. పార్టీల సిద్ధాంతాలు, రాజకీయ విలువలు, నాయకుల భావజాలం లాంటివన్నీ.. కేవలం కరపత్రాలకే పరిమితమయ్యాయ్. గోడల మీద రాసే స్లోగన్లుగానే మిగిలిపోయాయి.
ఎన్నికల సమయంలో.. పార్టీ జెండా మోసి, ప్రత్యర్థులతో గొడవలకు దిగి, తమ వ్యక్తిగత జీవితాలను, కడుపు మాడ్చుకొని పార్టీ గెలుపు కోసం కష్టపడే కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పార్టీల హైకమాండ్‌లు.. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం శత్రు పార్టీలతో జతకట్టినప్పుడు, క్యాంప్ రాజకీయాలకు తెరలేపినప్పుడు, ఈ కార్యకర్తల పోరాటం గాల్లో కలిసిపోతోంది. నిన్నటిదాకా తాము విమర్శించిన నాయకుడికే.. ఇప్పుడు జై కొట్టాల్సిన పరిస్థితులు రావడం.. ఓ రాజకీయ విషాదం. మెజారిటీ ఉన్నా, లేకపోయినా.. ఎక్స్-అఫీషియో ఓట్లతోనో, ఫిరాయింపులతోనో, తెరవెనుక ఒప్పందాలతోనో.. పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా.. పార్టీలు పనిచేస్తున్నాయ్. ఇక్కడ ప్రజాతీర్పు కంటే.. మేనేజ్‌మెంట్ పాలిటిక్స్‌కే ప్రాధాన్యత పెరిగింది. ప్రజలు ఓ పార్టీని నమ్మి ఓటేస్తే, గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీ పంచన చేరడం.. ఓటర్లను అవమానించడమే.
ప్రతి ఎన్నికల్లో.. పార్టీల గుర్తులను చూసి ఓటేయడం వల్ల.. ఆ పార్టీలకు బలం పెరుగుతుందే తప్ప, స్థానికంగా మనకు మేలు జరుగుతుందా? అన్నది.. ప్రశ్నార్థకంగా మారింది. అందుకే.. ఓటర్ల ఆలోచనా విధానంలో ఇప్పుడు మార్పు రావాలి. పార్టీలు ఎప్పుడూ మారవు. వాటి రాజకీయమే సమయానికి తగ్గట్లుగా, రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటుంది. ఈ జమానాకు మారాల్సింది మనమే.. జనమే. అందుకే.. ఎన్నుకునేటప్పుడు చూడాల్సింది పార్టీని కాదు.. నాయకుడిని. పనిచేస్తాడా? లేదా? అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదే చూడాలి తప్ప.. పార్టీని చూసి ఓటేస్తే.. మిగిలేది ఇదే.. కనిపించే సీన్లు ఇవే! అందుకే.. అభ్యర్థి చరిత్రని, వ్యక్తిత్వాన్ని, స్థానికంగా అందుబాటులో ఉండే గుణాన్ని చూసి ఎన్నుకోవాలి. పార్టీల పట్ల గుడ్డి భక్తిని వీడాలి. మనం ఓటేసిన నాయకుడు దారి తప్పితే.. నిలదీసే ధైర్యం ఉండాలి. రాజకీయాలు.. కుళ్లిపోయాయని మనలో మనమే గొణుక్కుంటే.. రాజకీయం మారదు. నాయకుల్లో మార్పు రాదు. ఓటు వేసేటప్పుడు మనం చూపే విజ్ఞతే.. రేపటి రాజకీయాలకు దిక్సూచిగా మారుతుంది. పార్టీలు తమ అవసరం కోసం ఎలాగైనా మారతాయ్. కానీ.. ఓటర్లు తమ నైతికతని మార్చుకోవద్దు. ఓటర్లు మేల్కొన్నారు.. ఇకపై తమ ఆటలు సాగవనే భయం నాయకుల్లో కలిగినప్పుడే.. ప్రజాస్వామ్యం నిలబడుతుంది.
రాజకీయం ఓ నది అయితే.. లీడర్లు అందులో నీళ్ల లాంటి వారు. ఎటు వీలైతే.. అటు ప్రవహిస్తారు. కానీ.. ఓటర్లు సముద్రం లాంటోళ్లు. నిలకడగా, నిబద్ధతతో ఉండాలి. పార్టీల మాయలో పడి.. గొంతు చించుకొని అరిచినా, కడుపు కాల్చుకొని తిరిగినా.. చివరకు వాళ్లూ.. వాళ్లూ.. ఒక్కటై.. అధికారాన్ని పంచుకుంటారు. దానిని.. మనమీదే చెలాయిస్తారు. అందువల్ల.. జనం ఎన్నుకోవాల్సింది.. నాయకుడిని కాదు.. ప్రజా సేవకుడిని. అదొక్కటే మన చేతుల్లో ఉంది.
Story by: Anup, Big Tv