తెలంగాణ రైజింగ్ 2047.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణని ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నానికి రూపమే.. ఈ విజన్ డాక్యుమెంట్. స్టేట్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసే రోడ్ మ్యాప్‌ని.. సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిత కోసం.. ప్రజల భవిష్యత్ కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో రూపొందించిన సమగ్ర ప్రణాళిక ఇది. మరి.. విజన్ డాక్యుమెంట్ భవిష్యత్‌కు ఎలాంటి భరోసానివ్వబోతోంది? రాష్ట్రంలో రాబోయే గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులేంటి?
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా రూపుదిద్దుకున్నదే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2047 నాటికి తెలంగాణని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడమే.. ప్రధాన లక్ష్యం. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుంది. రాష్ట్రంలోని 65 శాతం మంది యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అధునాతన టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు, సమర్థమవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన.. ఈ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తాయ్. సమగ్ర తెలంగాణ అభివృద్ధికి.. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల మోడల్‌ని.. ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం ఇందులో ఉంది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే టార్గెట్‌ని నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా.. తెలంగాణని ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటమే.. తెలంగాణ సర్కార్ ముఖ్య లక్ష్యం. అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో.. ప్రభుత్వం పనిచేయబోతోంది.
నేరుగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ.. తెలంగాణని గ్లోబల్ హబ్‌గా తయారుచేయడమే లక్ష్యంగా.. విజన్ డాక్యుమెంట్‌ని ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణలోని.. ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? ఏ ఏరియాలో ఏమేం పరిశ్రమలను ప్రోత్సహించాలి? ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలనే దానిపై.. రోడ్ మ్యాప్‌ని ఆవిష్కరించారు. గత అనుభవాలు.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారుచేశారు. ఇందులోనే 12 గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. భవిష్యత్‌ని నిర్మించాలంటే.. మౌలిక సదుపాయాలే కీలకం. భారతదేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు.. అత్యుత్తమమైన, ప్రపంచ స్థాయి నగరాలుగా కనిపిస్తాయ్. ఇదంతా.. ఓ నిర్దిష్టమైన ప్రాంతానికే పరిమితం. కానీ.. దాని పక్క వీధిలో మాత్రం.. వింతైన లోపాలుంటాయ్. నగరాల్లో సంపూర్ణమైన అభివృద్ధి జరగకపోవడం, సమస్యలను మూలాల నుంచి పరిష్కరించే సమర్థత లేకపోవడం వల్ల.. దేశంలోని మెట్రో నగరాలు ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతూ వచ్చాయ్. అందువల్ల.. మల్టీ నేషనల్ కంపెనీలకు, దిగ్గజ సంస్థలకు, పెట్టుబడులకు.. నగరాలు బెస్ట్ ఛాయిస్‌గా మారట్లేదు. అందువల్ల.. హైదరాబాద్ పొరుగు రాష్ట్రాలతోనో, దేశంలో ఉన్న మిగతా నగరాలోతోనో కాదు.. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలతో పోటీ పడాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు.. హైదరాబాద్, తెలంగాణలో అనేక గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులను చేపట్టనుంది ప్రభుత్వం.
రేవంత్ సర్కార్ చేపట్టబోయే గేమ్ ఛేంజర్ ప్రాజెక్టుల్లో.. మొట్టమొదటిది భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక్కడ అనేక దిగ్గజ కంపెనీలు, సంస్థలు రానున్నాయ్. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని వెలిగిపోయేలా చేసే తొలి ప్రాజెక్ట్ ఇది. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్ట్ కూడా నగరానికి ఎంతో మేలు చేసేదిగా ఉండబోతోంది. దశాబ్దాల మూసీ నిర్లక్ష్యానికి చరమగీతం పాడి.. మూసీ రూపురేఖలతో పాటు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఉండబోతోంది. ఇక.. ఫ్యూచర్ సిటీకి దగ్గర్లోనే.. డ్రై పోర్ట్ కూడా నిర్మించనున్నారు. డ్రైపోర్టుని కనెక్ట్ చేసేలా.. ఏపీలోని కృష్ణపట్నం సీ పోర్టు వరకు.. 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌ని.. బెంగళూరు, వయా ఏపీ రాజధాని అమరావతి మీదుగా.. చెన్నైతో కలిపేలా.. బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటును ప్రపోజ్ చేశారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య.. మ్యానుఫాక్చరింగ్ జోన్స్ రాబోతున్నాయి. కనెక్టివిటీని పెంచేలా.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్‌ని లింక్ చేస్తూ.. రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్‌ని కూడా విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించారు. వ్యవసాయ క్షేత్రాలకు.. గ్రీన్ పవర్ ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా.. ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్, భారీగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం లాంటివన్నీ.. గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. వీటితో పాటు యువతలో నైపుణ్యాభివృద్ధి, విస్తృత ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, పర్యావరణ సుస్థిరత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, నెట్ జీరో రోడ్ మ్యాప్, రేడియల్ రోడ్లతో మౌలిక వసతులను భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ చేయనున్నారు.
తెలంగాణని.. డైనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మార్చడమే రేవంత్ సర్కార్ ముందున్న లక్ష్యం. చైనా ప్లస్ వన్ స్ట్రాటజీతో.. తయారీ రంగంలో భారీ అవకాశాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బయోటెక్ కోసం స్పెషల్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికోసమే.. ప్రభుత్వం 12 గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులను విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించింది. వాటితో.. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి కాబోతోంది. సర్కార్ విజన్.. నిజంగానే గేమ్ ఛేంజర్‌గా ఉండబోతోందా?
2047 నాటికి భారతదేశ ప్రగతిలో తెలంగాణని గేమ్ ఛేంజర్ స్టేట్‌గా నిలపాలనే సంకల్పంతో.. విజన్ డాక్యుమెంట్‌ని రూపొందించింది రేవంత్ సర్కార్. ఇందులో.. చైనా ప్లస్ వన్ వ్యూహంతో పాటు తయారీ రంగంలో అనేక అవకాశాలను సృష్టించడం, మౌలిక వసతులు, పాలనలో పారదర్శకత, సామాజిక న్యాయం లాంటి అంశాలపై దృష్టిసారించారు. విజన్ డాక్యుమెంట్‌లో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేందుకు.. ప్రధానంగా మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ఆర్థిక వృద్ధి కోసం.. ఆవిష్కరణలు, మానుఫాక్చరింగ్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే టార్గెట్ పెట్టుకున్నారు. యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా.. సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూసేందుకు.. సమ్మిళిత అభివృద్ధి సూత్రాన్ని డాక్యుమెంట్‌లో పెట్టారు. అన్ని రంగాల్లో సుస్థితరతను తీసుకురావడంతో పాటు 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
చైనా ప్లస్ వన్ అనేది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలనేది ఓ వ్యూహం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం.. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ రీజియన్లుగా విభజించింది ప్రభుత్వం. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ మధ్య భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేయనుంది. కోర్ అర్బన్‌లో.. సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా.. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేయనున్నారు. నెట్-జీరో సిటీగానూ అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది. ఇక పరిశ్రమలు, మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా.. పెరి అర్బన్ రీజియన్‌ను ఉండబోతోంది. రూరల్ రీజియన్‌లో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు. ప్రస్తుతమున్న హైదరాబాద్ జీడీపీ 90 బిలియన్ డాలర్ల నుంచి 600 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. ట్రాఫిక్, నీటి కొరత, వరదలు, పర్యావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తామంటోంది. ప్రపంచస్థాయి పెట్టుబడుల్లో ప్రధాన వాటా సాధించే ప్రణాళికలను సిద్ధం చేసింది. విజన్ డాక్యుమెంట్‌లో గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులుగా ప్రతిపాదించినవి.. తెలంగాణ రూపురేఖలనే మార్చేయగలవు. ఇందులో.. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ట్రిపుల్ ఆర్, ఔటర్ రింగ్ రైల్, బుల్లెట్ రైల్ లాంటివి ఉన్నాయి.
భారత్ ఫ్యూచర్ సిటీ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ప్రపంచానికి గేట్‌వేగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలు కల్పిస్తుంది. ఇక.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు అర్బన్ ఫ్లడింగ్ సమస్యని పరిష్కరించనుంది. 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవునా.. ఈస్ట్-వెస్ట్ రివర్ ఫ్రంట్‌ని విహార, వినోద, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక.. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు, దానికి అనుబంధంగా రింగ్ రైలు ఏర్పాటుతో.. హైదరాబాద్ చుట్టూ భారీ పారిశ్రామిక, వాణిజ్య కారిడార్లు అభివృద్ధి చెందనున్నాయి. ఇది.. రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా నిలవనుంది. ఇక.. డ్రైపోర్ట్ నిర్మాణం, బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి బుల్లెట్ రైలు కారిడార్ లాంటి ప్రాజెక్టులు.. రాష్ట్రంలో రవాణా, లాజిస్టిక్స్ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయ్. కొత్తగా 4 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో.. ప్రాంతీయ కనెక్టివిటీ, కమర్షియల్ కార్యకలాపాలు పెరుగుతాయ్. కాలుష్య రహిత రహదారులు, హుస్సేన్ సాగర్ 2.0, మెరుగైన వరద నీటి నిర్వహణ, నగర జీవన ప్రమాణాలను ప్రపంచస్థాయికి పెంచడం లాంటి ప్రతిపాదనలు విజన్ డాక్యుమెంట్‌లో ఉన్నాయ్.
గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులతో.. తెలంగాణ ఇండియాలోనే గేమ్ ఛేంజర్ రాష్ట్రంగా ఎదగబోతోంది. కేవలం.. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి, ప్రాంతాలవారీగా సమగ్ర వృద్ధి లక్ష్యాలను నిర్దేశించడం కొత్త ఆలోచన. 2034, 2047 నాటికి నిర్దేశించిన ట్రిలియన్ డాలర్ల టార్గెట్లు.. ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు.. స్పష్టమైన రోడ్ మ్యాప్‌ని అందిస్తాయ్. ట్రిపుల్‌ఆర్, ఔటర్ రింగ్ రైలు, కొత్త ఎయిర్‌పోర్టులు, పునరుజ్జీవం ప్రాజెక్టుల లాంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణని సిద్ధం చేస్తాయి. ఈ విజన్ గేమ్ ఛేంజర్ కావాలంటే.. కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వేల కోట్ల నిధులను సమీకరించాలి. అనుకున్న సమయంలో, పారదర్శకంగా అమలు చేయాలి. ఈ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు.. రాజకీయ స్థిరత్వం, అధికారంలో ఎవరున్నా ఈ విజన్ కొనసాగే విధాన నిర్ణయాలు అవసరం. చైనా ప్లస్ వన్ వ్యూహం ఫలించాలంటే.. ప్రపంచ స్థాయి కంపెనీలకు.. ఆకర్షణీయమైన పాలసీలు, ప్రోత్సాహకాలు నిరంతరం కొనసాగించాలి. తెలంగాణ రైజింగ్ 2047 అనేది.. కేవలం ఓ డాక్యుమెంట్ కాదు. ఇది.. రాష్ట్రాన్ని డైనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మార్చి.. ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే సంకల్పం. దీనిలోని గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు.. తెలంగాణ భవిష్యత్తుని సరికొత్త మలుపు తిప్పనున్నాయ్.
Story by Anup, Big Tv