E-Paper
Advertisement

CM Progress Report: టార్గెట్ ఫిక్స్.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ

CM Progress Report: టార్గెట్ ఫిక్స్.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ

CM Progress Report:  పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణని.. మరింత ఉన్నత దశకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు.. డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను.. దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో.. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

నవంబర్ 22, శనివారం ( రాష్ట్రపతికి వీడ్కోలు )

హైదరాబాద్ పర్యటనని ముగించుకొని తిరుగు ప్రయాణమైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు.

నవంబర్ 21, శుక్రవారం ( సీఎం అభినందన )

4వ జాతీయ ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ సాధించిన తెలంగాణ విద్యార్థులను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కేలాలో జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025‌లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, షూటింగ్, చెస్‌ సహా ఇతర ఈవెంట్లలో.. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ విద్యార్థులు రికార్డు స్థాయిలో 230 పతకాలు గెలిచి.. ఓవరాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు. వీటిలో 88 గోల్డ్ మెడల్స్, 66 సిల్వర్ మెడల్స్, 76 కాంస్య పతకాలు ఉన్నాయి. 714 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. వీటిల్లో టీమ్ ఈవెంట్స్‌, వ్యక్తిగత ఈవెంట్లలోనూ తెలంగాణ విద్యార్థులు సత్తా చాటి అన్ని రాష్ట్రాలకన్నా అగ్రభాగాన నిలిచారు. ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 23 పాఠశాలల నుంచి 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసిస్తూ.. భవిష్యత్తులోనూ ఇదే క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

నవంబర్ 20, గురువారం ( తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ )

తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు.. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని.. ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో.. ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, టెక్నికల్ నాలెడ్జ్, స్పోర్ట్స్, ఇన్నోవేషన్ లాంటి అంశాల్లో.. నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం-సమృద్ధికి సోపానం పేరుతో.. హైదరాబాద్‌లో ఉత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్న సీఎం

ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధాన కేంద్రంలో.. అవసరమైన హాస్టల్ సౌకర్యం, ఆహారం, కళలు, చేతి వృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలుగా ఈ భవనాలు పని చేస్తాయన్నారు సీఎం. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ.. తెలంగాణ గవర్నర్‌గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనా రెడ్డి త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తున్న క్రమంలో.. బలమైన సంబంధాలను కలిగి ఉన్నామన్నారు. తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి.. ప్రజల మధ్య సంస్కృతుల పరస్పర మార్పిడికి ఈ ఉత్సవాలు నాంది మాత్రమేనన్నారు. తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ఫెస్టివల్ ఈశాన్య రాష్ట్రాలకు, తెలంగాణకు మధ్య ఉన్న ఏకత్వ స్ఫూర్తిని చాటుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిదని.. హైదరాబాద్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్, స్పోర్ట్స్ లాంటి అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

నవంబర్ 20, గురువారం ( తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ )

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణని.. మరింత ఉన్నత దశకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా.. చైనా +1 దేశాల కోసం అన్వేషణలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, జీసీసీ, డేటా సెంటర్స్, హెల్త్‌కేర్ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో ఉంది. మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రణాళికల్లో భాగంగా.. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను.. దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు.

నవంబర్ 20, గురువారం ( దేశమంతటా పంపిణీ చేయాలి )

దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం.. పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని మఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో విజయవంతమైన ఈ పథకాన్ని దేశమంతటా విస్తరించే విషయాన్ని పరిశీలించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన సహకారం అందించాలంటూ.. కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు తినే బియ్యాన్నే పంపిణీ చేస్తుండటంతో.. సన్న బియ్యం పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందన్నారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి.. అదనంగా 10 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కోటా పెంచాలని కోరారు సీఎం. పీడీఎస్‌ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించిన.. 1,468 కోట్ల రాయితీని, పెండింగ్‌లో ఉన్న మరో 343 కోట్ల రాయితీని విడుదల చేయాలన్నారు. 2024-25 ఖరీఫ్‌ సీఎంఆర్‌ వ్యవధిని పొడిగించాలని కోరారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్‌ రైస్‌ ర్యాక్‌లను కేటాయించాలన్నారు సీఎం. రాష్ట్రంలో 15 లక్షల టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు సాయం అందించాలని.. కేంద్రమంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

నవంబర్ 20, గురువారం ( ఫిజికల్ ఇంటలిజెన్స్‌పై ఫోకస్ )

దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు.. తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ వారం.. అనలాగ్‌ ఏఐ సీఈఓ అలెక్స్‌ కిప్‌మన్‌ సీఎంతో భేటీ అయ్యారు. ట్రాఫిక్, అర్బన్‌ ఫ్లడింగ్, సరస్సుల పరిరక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా రియల్‌ టైమ్‌ సెన్సార్‌ నెట్‌వర్క్, స్మార్ట్‌ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌‌ను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. 8 వారాలపాటు ఇది అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీ టీవీల వ్యవస్థను రియల్‌ టైమ్‌ సిటీ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాంగా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారంగా సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఈ పైలట్‌ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి హైదరాబాద్‌.. దేశంలోనే తొలి ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. భారత్‌ ఫ్యూచర్‌ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

నవంబర్ 19, బుధవారం ( కోటి చీరల పంపిణీ )

తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో.. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను.. కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని.. కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కొందరు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించారు. డిసెంబర్ 9 వరకు తొలి విడతగా.. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు. తర్వాత.. మార్చి 1 నుంచి 8 వరకు.. మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేస్తారని సీఎం తెలిపారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్పగించడం, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాదు.. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశామన్నారు.

కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద.. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయమన్న సీఎం.. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలనే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టామన్నారు.

తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ఆలోచన

తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే తమ ఆలోచన విధానం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అవసరమని చెప్పారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తి కలిగిన దేశంగా భారత్ ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో.. తెలంగాణ భాగస్వామ్యం కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం, మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు.

నవంబర్ 18, మంగళవారం ( విద్యకు పెద్దపీట )

తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా మార్చాలనే లక్ష్యానికి.. ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఓ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ.. ఓ అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలుగుతుంది.

నవంబర్ 18, మంగళవారం ( కేంద్రం సహకరించాలి )

2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహకారం కావాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ని కోరారు. ఈ వారం హైదరాబాద్‌లో.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో పాటు దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే తమ ఆలోచన విధానమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రం వేగంగా అనుమతులు ఇచ్చిసహకరించాలని కోరారు. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్‌ని ప్రజెంట్ చేయబోతున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలన్నారు సీఎం.

రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్పులు

రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ సిటీకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా.. తెలంగాణని తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ సిటీతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమ పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ పోటీ కేవలం సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనే ఉంటుందన్నారు సీఎం. అందుకు.. కేంద్ర ప్రభుత్వ నుంచి సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌ సిటీ వివిధ రంగాలకు హబ్‌గా మారిందన్నారు. దేశంలో ప్రతి సీఎంకు ప్రధాని పెద్దన్న లాంటివారని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

నవంబర్ 18, మంగళవారం ( కోటి చీరల పంపిణీ )

తెలంగాణలో అర్హులైన ప్రతి మహిళకు.. ఇందిరమ్మ చీరలను అందించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని చెప్పారు. కోటిమంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న క్రమంలో.. ఉత్పత్తికి అనుగుణంగా చీరల పంపిణీని రెండు దశల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండో దశలో.. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు.

నవంబర్ 18, మంగళవారం ( పనుల పరిశీలన )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ఈ వారం పరిశీలించారు. చరిత్రాత్మక అసెంబ్లీ ప్రధాన భవనంలోని పాత శాసనమండలిని పునరుద్ధరించాలని గతంలోనే నిర్ణయించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి.. సీఎం రేవంత్ రెడ్డి మరమ్మతు పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.

నవంబర్ 17, సోమవారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )

ఈ వారం తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా.. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా.. స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో.. గతంలోనే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపడం, అది గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టుని ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలపై.. మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ఇదే సమయంలో.. ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుండటంపై చర్చించారు.

తెలంగాణ రాష్ర్ట గీతం.. పాఠ్య పుస్తకాల్లో మెుదటి పేజీ

కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని.. వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో శతవిధాలా ప్రయత్నించిన విషయాలను గుర్తుచేస్తూ.. ఈ అంశంపై న్యాయ పోరాటం కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రిమండలి భావించింది. అదేవిధంగా గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపం కల్పిస్తామన్నారు. ఇక.. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ.. మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఆయన అందించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని క్యాబినెట్ తీర్మానించింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావి తరాలకు తెలియజేసేలా.. వారి అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని ఓ స్మృతివనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రజల అభ్యర్థన మేరకు ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును పెట్టాలని మంత్రిమండలి తీర్మానించింది.

Story by Anup , Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×