రాజకీయం చదరంగం లాంటిది. మన మూవ్ సరిగా లేదంటే… ఏ క్షణాన్నైనా చెక్ పడొచ్చు. ప్రజల మద్దతు సంగతి పక్కన పెడితే, తమ చుట్టూ ఉన్న నాయకుల మూమెంట్ గుర్తించకపోతే చెక్ మేట్ పడక తప్పదు. ఇలా రాజకీయ చదరంగంలో చిక్కుకొని… ఏం చేయాలో అర్థం కాక మధన పడుతున్నాడట ఓ మాజీ ఉప ముఖ్యమంత్రి. ఆయన పరిస్థితి ఎందుకలా మారింది..? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
తొలి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్ధకంగా మారిందంట ఇప్పుడు. బీఆర్ఎస్ పార్టీపై అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం ప్రతిపక్ష పాత్రను సైతం దీటుగా పోషించ లేకపోతుండటంతో రాబోయే రోజుల్లో ఆ పార్టీ మనుగడ అసాధ్యమన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను గులాబీ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయినట్టేనని భావిస్తున్నారట తాటికొండ రాజయ్య.
ఈ పరిస్థితులను ముందే ఊహించిన రాజయ్య ఎంపీ ఎన్నికల ముందు హస్తం పార్టీలోకి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారంట. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు తీవ్రంగా అడ్డుచెప్పడంతో హస్తం పార్టీలోకి రాజయ్య ఎంట్రీ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య పొలిటికల్ వార్ నడిచింది. ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే ఉన్నప్పటికీ టికెట్ రేసులో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. చివరకు కడియం శ్రీహరి టికెట్ దక్కించుకొని ఎన్నికల్లో గెలిచారు.
తాటికొండ రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశం లేదని, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారాలని వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ బీఆర్ఎస్ నేత సలహా ఇచ్చారట. అప్పుడే పార్టీ మారి ఉంటే కాంగ్రెస్ నుండి టికెట్ కచ్చితంగా వచ్చేదని, ఎన్నికల్లో గెలుపు సునాయసంగా దక్కేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఎంపీ ఎన్నికల ముందు తాటికొండ రాజయ్య హస్తం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, అప్పటికే కడియం శ్రీహరి గులాబీ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే లీకులు రావడం, ఘనపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు సైతం అడ్డుచెప్పడంతో రాజయ్య ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. చేసేది లేక బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు రాజయ్య.
అయితే రాజయ్యను పార్టీ నుండి వెళ్లగొట్టేందుకు వరంగల్ లోని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం, ఒకవేళ పిలిచినా తగిన గౌరవం ఇవ్వట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట రాజయ్య. ఎస్సీ వర్గీకరణ అంశంపై పోరాటానికి సిద్ధమైన రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ మాజీలను ఆహ్వానిస్తే తాము రామని తిరస్కరించారట. ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తనను పక్క పార్టీలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా రాజకీయంగా తొక్కేయాలని చూస్తుండటంతో రాజయ్య ఏం చేయాలో తెలియక మధనపడుతున్నారట.
Also Read: కేటీఆర్ ఫార్ములా, బిగిస్తున్న ఉచ్చు.. వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ
ఓ వైపు టికెట్ రేసులో ఓడిపోయి ప్రజలకు దూరమైన రాజయ్య పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. మరోవైపు పార్టీలోనుండి వెళ్లగొట్టేలా సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారట. హస్తం పార్టీ సైతం నోఎంట్రీ బోర్డు పెట్టడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకు చెక్‌మేట్ పడ్డట్లేనన్న చర్చ సాగుతోంది. చివరి ప్రయత్నంగా హస్తం పార్టీ తలుపులు తట్టాలని మరికొంతమంది సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఏది ఏమైనా తన తోటి లీడర్ల మూమెంట్ కనిపెట్టకపోవడం వల్లే.. ఈరోజు రాజయ్యకు ఈ పరిస్థితి వచ్చిందని తెగ జాలి పడుతున్నారు స్టేషన్‌పూర్ ప్రజలు.