తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో… అంటూ సెంటిమెంట్ రగిలించి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలవతో తెలంగాణ తెచ్చుకుని.. ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ … పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆయన బాత్‌రూమ్‌లో జారిపడి పడటంతో తుంటి ఎముక విరిగి ఆపరేషన్ చేయించుకుని ఫాంహౌస్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
అలా కంటిన్యూ అయిన బ్యాడ్‌టైమ్‌ని అధిగమించడానికి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కష్టపడ్డారు.. సారూ.. కారూ.. పదహరూ.. స్లోగన్‌తో వాకింగ్ స్టిక్ చేయూతతో ప్రచారం నిర్వహించారు. ఆయన అంత కష్టపడినా ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. పైగా కారు పార్టీకి 8 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఇక అప్పటి నుంచి ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు అసెంబ్లీలో కనిపించారు. ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచరం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు ఆయన యాగం నిర్వహించడంతో.. స్థానిక సంస్థల్లో బలనిరూపణకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. దసరా ముహూర్తంగా మాజీ సీఎం మళ్లీ జనంలోకి వచ్చి తన మాటల మంత్రదండం ప్రయోగిస్తారని అందరూ భావించారు. అయితే అది జరగలేదు.. ఇక శీతకాల సమావేశాలకు కూడా మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేశారు.
ఆ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం కష్టమేనని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై ధీమాతో జాతీయ రాజకీయాల రాగం ఎత్తుకుని పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేశారు గులాబీ బాస్.. అప్పటి నుంచి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు పార్టీలో కుదుపులు స్టార్ట్ అయ్యాయి. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అవ్వడంతో కారు స్టీరింగ్ పట్టుకున్న కేటీఆర్‌పై నమ్మకం లేక అందులో నుంచి ఒక్కొక్కరుగా దిగడం మొదలుపెట్టేశారు.
Also Read: ‘కారు’ కథలు.. ఫార్ములా రేస్ స్కామ్‌ను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఈ ప్రశ్నలకు బదులేది?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడంగానే గత సర్కారు అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి అక్రమాలపై విచారణలు ప్రస్తుతం తుది దశకు చేరుకుంటున్నాయి. ఆ కేసుల ఉచ్చు కేసీఆర్ మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల ముందే కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అవ్వడం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది మార్చి 15న ఆమె అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని భావించారు. అయితే తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ బాధ్యతలను కేటీఆర్, హరీష్‌లు భుజానికెత్తుకుని ఢిల్లీ చుట్టు ప్రదక్షిణలు చేశారు. చివరికి అయిదున్నర నెలల తర్వాత కవిత బెయిల్‌పై బయటకు రావడంతో కేసీఆర్‌కు ఊరట లభించింది
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. 10 రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరినీ కలుస్తానని అప్పట్లో ప్రకటించారు . అయితే ఏమైందో ఏమో గాని ఆమె జైలు నుంచి విడుదలై 3 నెలలు గడుస్తున్నా బయట కనిపించదు. ఎవరిని కలవలేదు. ఇప్పుడిప్పుడే ఆమె పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో కేసీఆర్ హమ్మయ్య అనుకునే లోపే మరో షాక్ తగిలిందిప్పుడు.
కేసీఆర్ కారు స్టీరింగ్ వదిలేసిన నాటి నుంచి కేటీఆర్ దాన్ని పట్టుకుని పార్టీని నడిపించడానికి ఆపసోపాలు పడుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో, ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, అది నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి అరెస్టులకు భయపడేది లేదని పదేపదే ప్రకటనలు చేసిన కేసీఆర్ ఏసీసీ కేసు పెట్టగానే హైకోర్టులో క్యాష్ పిటీషన్ వేసుకున్నారు. దానిపై విచారించిన న్యాయస్థానం ఆయన్ని వారం రోజుల పాటు అరెస్ట్ చేయవద్దదని ఉత్తర్వులిచ్చింది.
ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి కల్వకుంట్ల ఫ్యామిలీకి మళ్లీ షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేయడం గమనార్హం.
ఫార్ములా ఈ రేస్‌కు సంంధించి విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అధికారులు అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిలు కూడా కేటీఆర్‌తో పాటు ఈడీ కేసులో బుక్కయ్యారు. వారి వాంగ్మూలాలను సేకరించాక ఈడీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఈడీ అంత వేగంగా స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసి .. సాయంత్రానికే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది.
ఈడీ స్పీడ్ చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసినట్లే కేటీఆర్ కూడా జైలుపాలు అవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ న్యూస్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తుందంట. తన టైమ్ మరీ ఇంత వరస్ట్‌గా తయారైందేంటని.. ఫాంహౌస్‌లో తనను కలిసిన వారి వద్ద వాపోతున్నారంట. మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయన బెయిల్ కోసమైన కేసీఆర్ ఫాంహౌస్ గేటు దాటతారో? లేదో ? చూడాలి.