Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన రెండవ రోజే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. గులాబీ నేతలు తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్‌ను పూర్తిగా బహిష్కరించడం రాజకీయంగా చర్చినీయంశంగా మారింది. రాజకీయ వ్యూహాంలో భాగంగానే బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసిందా.. ప్రభుత్వం వారు మాట్లాడటానికి తగినంత సమయం ఇస్తామని చేబుతున్నా.. బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవడంపై చర్చకు దారి తీస్తోంది.
బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన కేసీఆర్
చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలోనే ఎండగడతాం.. ఇప్పటి నుంచి లెక్క మారుతుందని హెచ్చరించారు కేసీఆర్. కేసీఆర్ యాక్షన్‌తో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుందని అందరూ భావించారు. అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభమైన తొలిరోజు మాజీ సీఎం సభకు వచ్చారు. నిముషాల వ్యవధిలోనే వెళ్లిపోయారు. ఆయన రూటులోనే సమావేశాలు మొదలైన రెండవ రోజే గులాబీ నేతలు వింటర్ సెషన్స్ ను పూర్తిగా బాయ్ కాట్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసిందనే టాక్ నడుస్తోంది
సమావేశాల్లో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ పై చర్చ
ముఖ్యంగా సమావేశాల్లో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్‌పై చర్చ సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసినా స్పీకర్ అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని.. అసలు అంశాలపై సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దాడులకు దిగారని బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతుంది. దీంతో హరీష్ రావు నేతృత్వంలో సభ్యులు వాకౌట్ చేసి, గన్ పార్క్‌లో నిరసన చేపట్టి, మొత్తం సెషన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడతామని వెనకడుగు వేయలేదని.. వ్యూహాత్మకంగా ఆనిర్ణయం తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, స్పీకర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ అసెంబ్లీ వింటర్ సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సభలో కూర్చొని ప్రభుత్వం నుంచి వచ్చే విమర్శలను భరించే బదులు.. బయటకు వచ్చి నిరసన తెలపడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని ఆ పార్టీ భావిస్తోందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్.
రాజకీయంగా చూస్తే, ఇటీవల ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ తిరిగి బలపడే ప్రయత్నంలో ఉంది. అసెంబ్లీ లోపల అధికార పార్టీ అజెండాకే పరిమితం కావాల్సి వస్తుందని.. బయట పోరాటం చేస్తే మీడియా దృష్టిని ఆకర్షించి క్యాడర్‌ను ఉత్సాహపరచవచ్చని పార్టీ అంచనాగా కనిపిస్తోందంటున్నారు. అయితే దీర్ఘకాలం అసెంబ్లీకి దూరంగా ఉండటం వల్ల ప్రజల సమస్యలను నేరుగా సభలో లేవనెత్తే అవకాశం లేకుండా పోతుంది. దాంతో పార్టీ ప్రతిపక్ష బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్న విమర్శలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
బీఆర్ఎస్ బాయ్‌కాట్ నిర్ణయంతో సెల్ఫ్‌గోల్ చేసుకుందా?
బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్‌కాట్ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతవరకు పాజిటివ్‌గా మారినట్టే అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వేదిక.. ప్రజల సమస్యలను అక్కడే చర్చించి పరిష్కరించాలని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే బీఆర్ఎస్ బాయ్‌కాట్ నిర్ణయంతో సెల్ఫ్‌గోల్ చేసుకుందంటున్నారు. ప్రతిపక్షం సభకు రాకపోవడం వల్ల ప్రభుత్వానికి తమ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా వివరించే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీలో చర్చకు వచ్చే ధైర్యం లేకనే బీఆర్ఎష్ బాయ్‌కాట్ చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సభలో కూర్చొని పోరాడకుండా బయట ఆందోళనలు చేస్తే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు రావడం.. అధికార పక్షానికి బలం చేకూర్చినట్లు అవుతోంది.
Also Read: మండలిలో కవిత కన్నీళ్లు.. నాపై కుట్రలు చేశారంటూ భావోద్వేగం
మొత్తానికి ఈ బాయ్‌కాట్ బీఆర్ఎస్‌కు తాత్కాలికంగా రాజకీయ లాభం తీసుకు వచ్చినా.. భవిష్యత్తులో ఇది పార్టీ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Story By Rami Reddy, Bigtv