RSS And BJP: బీజేపీ.. దేశంలో తిరుగులేని రాజకీయ శక్తి! అయితే.. ఆ పార్టీని ఈ స్థాయికి తెచ్చి.. ముందుకు నడిపిస్తున్న చోదకశక్తి మాత్రం ఆర్ఎస్ఎస్ అనేది అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ వెనకుండి బీజేపీని ముందుకు నడిపించిన ఆర్ఎస్ఎస్.. ఇకపై పార్టీలో సెకండ్ రోల్ పోషించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకాలే కాదు.. కేంద్రంలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటోందనే చర్చ జరుగుతోంది. అసలు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలేంటి? ఇన్నాళ్లూ లేనిది.. పార్టీపై సంఘ్ ముద్ర ఇంత స్పష్టంగా ఎందుకు కనిపిస్తోంది?
బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
భారతీయ జనతా పార్టీలో.. ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సంస్కరణలు, ఆర్ఎస్ఎస్ ప్రభావం గురించి.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీలో కొత్త నాయకత్వ నియామకాలు, సంస్థాగత మార్పులు జరుగుతున్న తరుణంగా.. ఆర్ఎస్ఎస్ రోల్.. మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాల్లోని ఒడిదొడుకులు, మారుతున్న పొలిటికల్ డైనమిక్స్.. ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయ్. రాజకీయ లక్ష్యాలు, భావజాల సమన్వయం కోసం.. రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా కొంత ఉద్రిక్తతలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులు.. భవిష్యత్తులో బీజేపీ రాజకీయ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య గందరగోళ పరిణామాలు
కేంద్రంలో.. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఈసారి ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కువగా మిత్రపక్షాలపైనే ఆధారపడి ఉంది. అయితే.. పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. బీజేపీ,ఆర్ఎస్ఎస్ మధ్య నెలకొన్న పరిణామాలు కొంత గందరగోళంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు.. పార్టీలో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ఇటీవలే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో.. పార్టీలో యువనాయకులకు అవకాశాలు కల్పించడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయడం లాంటివి ఉన్నాయి. ఈ సంస్కరణల వెనుక.. ఆర్ఎస్ఎస్ సలహాలు, డైరెక్షన్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీని పనితీరుని సమీక్షించిన ఆర్ఎస్ఎస్.. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంగా.. కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై నో క్లారిటీ
బీజేపీలో గతేడాది డిసెంబర్‌లో ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 36 స్టేట్ యూనిట్లలో.. 28 చోట్ల ఎన్నికలు ముగిశాయి. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అవసరమైన ఓటర్ల కోరం కోసం కనీసం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిసి ఉండాలి. దానిప్రకారం.. ఇప్పుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త పార్టీ చీఫ్‌ని ఎన్నుకునేందుకు అడుగు ముందుకు వేయొచ్చన్నమాట. కానీ.. ఇప్పటికీ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై క్లారిటీ లేదు. ఎవరిని ఆ పదవికి ఎన్నుకోవాలనే దానిపై.. ఏకాభిప్రాయం కూడా రాలేదు. అదేవిధంగా.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ, హర్యానా లాంటి రాష్ట్రాలకు అధ్యక్షులను ఇంకా నియమించలేదు. పంజాబ్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌ని నియమించారు.
రాష్ట్ర పార్టీ నేతల ఎంపిక నియామకంలో సంఘ్‌దే కీలకపాత్ర!
మణిపూర్‌లో ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. 2014లో.. అమిత్ షా రెండు నెలల్లోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జేపీ నడ్డా 2019 జూన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. వీళ్లిద్దరూ.. రాష్ట్ర అధ్యక్షుల్ని నియమించడంలో వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ.. ఈసారి అలా జరగట్లేదు. కీలకమైన రాష్ట్ర పార్టీ నాయకుల ఎంపిక, నియామకంలో.. సంఘ్‌దే కీలకపాత్ర ఉందనే విషయం అర్థమవుతోంది. ఇదంతా.. ఓ డిజైన్ ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని వ్యూహాత్మక పునర్నిర్మాణంగానూ పిలుస్తున్నారు. అయితే.. బీజేపీ కొంత దారి తప్పుతున్నప్పుడు.. దానిని సరైన మార్గంలో నడిపించేందుకు.. ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇస్తుందని.. పార్టీపై సంఘ్ ప్రభావం పెరుగుతుందనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు.. బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూడా అదే అనిపిస్తోంది.
సంఘ్ పరివార్‌లో సహజంగా ఎదిగిన నాయకులకే ప్రాధాన్యత
28 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల నియామకాల్లో.. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల నెట్‌వర్క్‌తో ఉన్న లింకులే.. కీలకపాత్ర పోషించాయ్. క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలని సంప్రదించి.. చాలా వరకు వారి సిఫారసులను ఆమోదించినట్లు తెలుస్తోంది. సంఘ్ పరివార్‌లో సహజంగా ఎదిగిన నాయకులకే ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల వ్యూహాన్ని మాత్రమే కాకుండా సైద్ధాంతికపరమైన భావజాలం, అట్టడుగు స్థాయి సమీకరణని అర్థం చేసుకున్నవారినే ఆర్ఎస్ఎస్ కోరుకున్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీకి పునాది లేని, ప్రయోగాలు చేయాలనుకునే రాష్ట్రాలను మాత్రమే సంఘ్ మినహాయించింది. బిజినెస్‌మేన్ నుంచి పొలిటీషియన్‌గా ఎదిగిన రాజీవ్ చంద్రశేఖర్‌ని కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమించగా.. తమిళనాడులో.. అన్నాడీఏంకే నుంచి ఫిరాయించిన నైనార్ నాగేంద్రన్‌కి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే.. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులుగా మాత్రం రాజకీయంగా అనుభవజ్ఞులు, సంఘ్ విధేయులైన.. రామచందర్ రావు, పీవీఎన్ మాధవ్‌కు మాత్రమే.. సంఘ్ ప్రాధాన్యత ఇచ్చింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే.. సైద్ధాంతిక శక్తుల తరాన్ని పెంపొందించడమే లక్ష్యం అని సంఘ్ వర్గాలు చెబుతున్నాయ్. పార్టీని మోడీ తర్వాతి యుగంలోకి నడిపించగల.. ఆకర
జరుగుతున్న పరిణామాలు, బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. పార్టీ విధానాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర బలంగా ఉందనే విషయం అర్థమవుతోంది. అనేక కీలక నిర్ణయాల్లో సంఘ్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇంకొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు, కీలక నేతల ఎంపికలో సంఘ్ ప్రభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్‌లో లోతైన మూలాలున్న నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి.. పార్టీలో సంఘ్ పాత్రపై బీజేపీలో జరుగుతున్న చర్చేంటి? ఇది.. బీజేపీ భవిష్యత్‌ని ఎలా నిర్ణయించబోతోంది?
బీజేపీకి సైద్ధాంతికపరమైన మార్గదర్శిగా ఆర్ఎస్ఎస్
బీజేపీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవడం ఇప్పుడేం కొత్త కాదు. సంఘ్ ఎప్పటి నుంచో కాషాయ పార్టీకి భావజాలం, సైద్ధాంతికపరమైన మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. అయితే.. ఈ మధ్యకాలంలో పార్టీ నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష పాత్ర ఎక్కువైందనే చర్చ జరుగుతోంది. కొత్త స్టేట్ ప్రెసిడెంట్‌ల నియామకం, కీలక స్థానాల్లో సంఘ్ సానుకూల వ్యక్తుల నియామకం లాంటివన్నీ.. సంఘ్ ఇంపాక్ట్ పెరిగిందనడానికి సూచనలుగా కనిపిస్తున్నాయ్. అయితే.. ఆర్ఎస్ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. పార్టీలోని కొందరు సీనియర్ బీజేపీ నాయకులకు అసంతృప్తిని కలిగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు అనేక కారణాలున్నాయ్. మొదటిది.. గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పార్టీ విజయం సాధించలేకపోయింది. దాంతో.. ఆర్ఎస్ఎస్ పార్టీ వ్యూహాలపై రివ్యూ చేసింది. రెండోది.. కొందరు బీజేపీ నేతలు సంఘ్ జోక్యాన్ని అతిగా భావిస్తున్నారు. ఇది.. వారి స్వతంత్ర నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య అంతర్గతంగా ఉద్రిక్తతలు పెరిగాయనే చర్చ జరుగుతోంది.
బీజేపీకి బలమైన ఎన్నికల యంత్రాంగంగా సంఘ్!
ఆర్ఎస్ఎస్.. బీజేపీకి ఓ బలమైన ఎన్నికల యంత్రాంగంగా పనిచేస్తుందని చాలా మంది నమ్ముతారు. క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించడం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి విషయాల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు.. బీజేపీకి చాలా కీలకమని చెబుతుంటారు. బీజేపీ దాని ప్రధాన సూత్రాల నుంచి తప్పుకోకుండా చూసుకునేందుకే.. ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. కొందరు నేతలు మాత్రం సంఘ్ జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ జోక్యం.. బీజేపీని కేవలం దాని సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం చేస్తుందని.. విస్తృత ప్రజానీకంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘ్ ప్రభావం పెరగడం వల్ల పార్టీ స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని.. ఇది ప్రజాస్వామ్య విలువలకు మంచిది కాదని కొందరు విమర్శిస్తున్నారు. అన్ని నిర్ణయాలు.. ఆర్ఎస్ఎస్ తీసేసుకుంటే.. పార్టీలోని నాయకుల పాత్ర, వారి అభిప్రాయాలు పరిమితం అవుతాయనే వాదన కూడా వినిపిస్తున్నాయ్.
అన్ని వర్గాల ప్రజలను ఆకర్శించే పార్టీగా చూపడంలో సవాళ్లు!
అయితే.. బీజేపీలో ఆర్ఎస్ఎస్ జోక్యం.. పార్టీలో ఏకత్వాన్ని, సిద్ధాంతబద్ధతను బలోపేతం చేయొచ్చు. ఇది పార్టీని దాని ప్రధాన భావజాలం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అయితే.. సంఘ్ ప్రభావం అతిగా పెరిగితే మాత్రం.. పార్టీ తనని తాను ఓ విశాలమైన, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే పార్టీగా చూపించుకోవడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. కేవలం సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే.. అన్ని వర్గాల ప్రజల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. ఆర్ఎస్ఎస్ ఫోకస్ ఇప్పుడు రాబోయే స్టేట్ ఎలక్షన్స్ మీదే ఉంది.
Also Read: జిల్లాలపై సర్కార్ ఫోకస్.. ఎన్నికోట్లు ఆమోదం అంటే..
అందువల్ల.. బీజేపీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని నియమించడం, కార్యకర్తల్లో జోష్ నింపడం, ప్రజల్లో పార్టీ సందేశాన్ని సమర్థవంతంగా చేరవేయడంపై ఫోకస్ చేసింది. సంఘ్ భావజాలానికి అనుగుణంగా హిందుత్వ ఎజెండాని.. మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా.. రాజకీయ లక్ష్యాలు, భావజాల సమన్వయం కోసం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఉద్రిక్తతలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నారు. ఇవి.. భవిష్యత్తులో.. బీజేపీ రాజకీయ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తిగా మారింది.
Story By Anup, Bigtv