
The History Of Rani Ki Vav : రూ.100 కొత్త నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. మహాత్మాగాంధీ సిరీస్‌లో, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఊదా రంగులో ఈ నోటు ఉండనుంది. ఈ నోటు వెనకాల గుజరాత్‌లోని ప్రసిద్ధ కట్టడం ‘రాణి కీ వావ్’ మోటీఫ్‌ను ముద్రించారు. దీంతో అప్పటి నుంచి ‘రాణి కీ వావ్’ వారసత్వ కట్టడం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు
గుజరాత్‌లోని సరస్వతి నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ కట్టడాల్లో రాణీ కీ వావ్ (Queen’s StepWell) ఒకటి. పఠాన్ పట్ణణంలోని ఈ బ్రహ్మాండమైన మెట్ల బావి 11వ శతాబ్దం నాటిది. పఠాన్ పట్టణంలోని ఈ బావి 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకెక్కింది.
భారతీయ అద్భుత కళాసంపదకు మచ్చుతునకగా నిలిచిన ఈ ఏడు అంతస్తుల బావిని సోలంకీ వంశపు రాణి.. ఉదయమతి.. తన భర్త భీమదేవుని గుర్తుగా తవ్వించింది. నిర్మాణం తర్వాత కొంతకాలానికే సరస్వతీ నదికి వచ్చిన వరదల వల్ల ఈ బావి పూడిపోయింది. అయితే.. 1980ల్లో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో ఇది బయటపడింది.

నీటి వినియోగం, కోసమే కాకుండా అద్భుత కళాసంపదకు ఈ కట్టడం నిలయం. సుమారు 500 అద్భుత శిల్పాలు, వెయ్యికిపైగా చిన్న కళాఖండాలున్న ఈ బావి ఇందులో ఉన్నాయి. ఈ శిల్పాల్లో విష్ణువు దశావతారాలతో బాటు పలు పౌరాణిక గాథలూ దర్శనమిస్తాయి.
ఈ బావి 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతు ఉంటుంది. నాలుగో అంతస్తులో నీటి ట్యాంక్ నిర్మాణం ఉంది. బావి అడుగున 30 కి.మీ పొడవైన సొరంగం ఉందనీ, అది పఠాన్‌కు సమీపంలోని సిధ్‌పూర్‌కు దారితీస్తుందని, శత్రుదాడి సమయంలో రాజకుటుంబీకులు సులభంగా బయటపడేలా దీనిని డిజైన్ చేశారని చెబుతారు.
ఈ ప్రాంతం చుట్టుపక్కల పలు ఔషధ గుణాలున్న వృక్షాలుండటంతో ఈ బావిలో దిగి స్నానం చేస్తే పలు చర్మరోగాలు నయమవుతాయని ప్రజల విశ్వాసం. అహ్మదాబాద్‌కు 125 కి.మీ దూరంలో ఉన్న ఈ కట్టడాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించొచ్చు. రోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దీని నిర్వహణ బాధ్యతలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూస్తోంది. RBI తీసుకుకొచ్చిన రూ.100 నోటు మీద కూడా దీనిని ముద్రించటం విశేషం.