
China History : చైనా అనగానే కమ్యూనిజం ఆచరణలో ఉన్నదేశమనే మాట వినిపిస్తుంటుంది. ప్రపంచంలోనే మూడవ అతి పెద్దదేశమైన చైనా.. అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధిని పూర్తిగా నిరాకరించటమూ సాధ్యంకాదు. అయితే.. ఆ దేశం బయటి ప్రపంచానికి కనిపిస్తున్నంత గొప్పదేమీ కాదనీ, బయటికి కనిపించే చైనాకు, పాలకుల ఇనుప తెరల వెనక ఉన్న చైనాకు చాలా తేడా ఉందనే వాదనలూ ఉన్నాయి. కొందరు సామాజిక శాస్త్రవేత్తలు ఆ వాదనలకు బలం చేకూర్చే కొన్ని కఠోర వాస్తవాలనూ ప్రస్తావిస్తున్నారు. అవి..
ప్రపంచపు అతిపెద్ద రెండవ బలమైన ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనాలో ప్రతి పదిమందిలోనూ ఒకరు నిరుపేదగా ఉన్నారనీ, మొత్తం జనాభాలో 8.2 కోట్లమంది దుర్భర దారిద్ర్యంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
చైనా భూసంస్కరణల గురించి మాట్లాడే చాలామందికి ఆ దేశంలో మెజారిటీ భూమి సాగుకు యోగ్యమైందనే విషయమే తెలియదు. గ్రామాల్లోని మెజారిటీ రైతాంగం పేదరికంలో మగ్గుతున్నారు. పల్లెవాసులకు సర్కారీ విద్య, వైద్య సదుపాయాల్లేవు. 1970 – 2002 కాలపు ఆర్థిక సంస్కరణలు పట్టణ, నగరాలకే పరిమితం కావటంతో పల్లెజనమంతా వలస బాట పట్టటంతో గ్రామీణ జీవనం మరింత దుర్భరంగా మారింంది.
చైనాలో ఉన్నంత వాయుకాలుష్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ నేటికీ బొగ్గుమీదే ఆధారపడటంతో దేశమంతా పొగచూరిపోతోంది. ఎంతగా అంటే.. సోలార్ పవర్ కోసం ఏర్పాటుచేసిన ప్యానల్స్ మీద సూర్య కిరణాలు పడలేనంతగా అక్కడ వాయుకాలుష్యం ఉంది.
చైనాలోని జలాశయాలు, నదులు, సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారాయి. రాజధాని షాంఘై నుంచి పారే నదీజలాలు 85 శాతం మేర కలుషితమయ్యాయని గతంలో విడుదలైన ‘న్యూ వాటర్ క్వాలిటీ రిపోర్ట్’ స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వాల వైఫల్యం కారణంగా జల కాలుష్యం పెరిగిందనీ, దేశంలో సగం మందికి కలుషిత తాగునీరే దిక్కు.
చైనాలో ఏటా కోటిన్నర మంది పిల్లలు పలు లోపాలతో పుడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన పెడ ధోరణులు, కాలుష్యం వంటి కారణాలతో ఈ సమస్య వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచం మొత్తంలో అమలయ్యే మరణ శిక్షలకు నాలుగింతల శిక్షలు చైనా ఒక్కదేశంలోనే అమలవుతున్నాయని, ఇదంతా గోప్యంగా జరుగుతోందని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ చెబుతోంది. డ్రగ్స్ వాడేవారినీ దారుణంగా శిక్షిస్తున్నారని ఆమ్నెస్టీ సంస్థ చెబుతోంది.
చైనాలోని గోబీ ఎడారి పట్టలేనంత వేగంగా విస్తరించటంతో ఏటా 2,250 మైళ్ల విస్తీర్ణం మేర భూమి ఎడారిగా మారుతోంది. అడవుల నరికివేత, నీటి కొరత, కాలుష్యం వల్ల సంభవిస్తున్న ఈ మార్పును అడ్డుకునేందుకు చైనా ‘గ్రేట్ గ్రీన్ వాల్’ పేరుతో ఓ పథకాన్ని అమలుచేసినా.. పెద్ద ఫలితం కనిపించటం లేదు.
ఇంటర్నెట్‌పై చైనా విధించే ఆంక్షలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ‘ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్’ అనే మాటకు తావులేని రీతిలో 3,000 సామాజిక అంశాలపై పనిచేసే సంస్థల సైట్లను సర్కార్ బ్లాక్ చేసింది. వాటిలో వ్యాసాలు రాసిన అనేకులు మాయమవటం, జైలుకుపోవటం జరిగాయి.
కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం వీగర్ ముస్లింల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే పలు మానవ హక్కులు సంస్థలు వాపోతున్నాయి. అయితే.. ఇటీవల ఆ దేశపు యువతలో ధార్మిక విశ్వాసాలు పెరగటం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది.
చైనాలోని రీ సైక్లింగ్ పరిశ్రమ పెడధోరణితో వస్తువుల నాణ్యతా ప్రమాణాలు బొత్తిగా పడిపోయాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధినిచ్చే ఈ పరిశ్రమకు చాలాచోట్ల అనుమతులే అవసరం లేదు. చెత్త కుండీలో పడేసిన ప్రతిదానినీ రీసైకిల్ చేయటం చైనా ప్రత్యేకత అయినా.. దీనివల్ల్ అనేక ప్రతికూల ప్రభావాలను ఆ దేశం ఎదుర్కోక తప్పటం లేదు.
ప్రపంచంలో అతిపెద్ద వస్తు ఉత్పత్తిదారుగా ఉన్న చైనాలో చాలామందికి కనీస అవసరాలే అందుబాటులో లేవు. ప్రజల కొనుగోలు శక్తి కూడా చాలా తక్కువ. అక్కడి నగరాల్లో కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్ వంటివి తప్ప ఇతర మాల్స్ కస్టమర్లు లేక వెలవెలబోతుంటాయి. తగిన ఆదాయం లేని వర్గాలన్నీ కనీసావసరాలకే డబ్బు వెచ్చిస్తుంటాయి.
జనాభా కొనుగోలు శక్తిని సరిగా అంచనా వేయకుండా.. బ్యాంకుల ద్వారా బిల్డర్‌లకు విపరీతంగా అప్పులిచ్చారు. దీంతో వారు ఎడాపెడా బహుళ అంతస్తుల భవనాలు కట్టిపారేశారు. ఆనక.. వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చైనాలోని నివాసానికి సిద్ధంగా ఉన్న కొత్త నిర్మాణాలు పాడుపడిపోతున్నాయి.
బౌద్ధభూమి అయిన టిబెట్‌ను దురాక్రమించిన చైనా.. అక్కడి బౌద్ధుల మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఎంతగా అంటే.. బౌద్ధుల తర్వాతి గురువు లామా ఎవరో కూడా చైనా పాలకులే నిర్ణయిస్తారట. తమ విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఏంటని టిబెటన్ల ఆవేదననూ బయటి ప్రపంచానికి తెలియనీయటం లేదు.
‘పైసా మే పరమాత్మ’ అనే నమ్మే చైనా ధోరణి అక్కడి కున్మింగ్ థీమ్ పార్కులను చూస్తే బయటపడుతుంది. శరీర లోపాల కారణంగా మరగుజ్జుల్లా ఉండే ప్రజలతో ఒక థీమ్ పార్క్‌ను ఏర్పాటుచేసి, విదేశీయులకు వారిచే డాన్స్‌లు చేయిస్తూ.. టూరిజం పేరుతో కాసులు పిండుకుంటోంది. ఏ దేశమూ తమ బాధిత ప్రజలతో ఇలా చేయించదనే ఆరోపణలను ఎదుర్కొంటోంది.
C/O Atakaram: C/O Aటకారం