Thopudurthi Prakash Reddy: ఆ మాజీ ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు ఎదురేలేదన్నట్లు వ్యవహరించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెక్కడున్నారో కూడా అంతుపట్టడం లేదు. అప్పట్లో ఓటమి ఎరుగని ఫ్యామిలీపై గెలిచి మీసం తిప్పిన ఆయన నెలకు కనీసం రెండు రోజులు కూడ నియోజకవర్గంలో కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవ్వడంతో వైసీపీ నేతలు పలువురు జగన్ పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆయన మాత్రం ఇంకా బయటికి రావడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరా నేత? అంతలా అదృశ్యమవ్వడానికి కారణమేంటి?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని హాట్ హాట్ నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి.. అక్కడి నుంచి పరిటాల కుటుంబం మూడు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. దాంతో రాప్తాడు నియోజకవర్గం ఎప్పటికప్పుడు యావత్తు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తుంటుంది. టీడీపీ మంచి పట్టున్న నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి.. రాప్తాడు లోని మూడు మండలాల్లో టిడిపికి పట్టు ఉండగా మరో మూడు మండలాల్లో వైసీపీకి గట్టి పట్టుంది. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్ , రాప్తాడు మండలాల్లో వైసిపికి మంచి క్యాడర్ ఉంది.
ఇక మిగతా మండలాల్లో టీడీపీ పునాదుల నుంచి బలంగా ఉంది. అంత పట్టుకున్నా సరే వైసీపీ రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత స్పీడ్‌కి ఎప్పుడూ కూడా బ్రేకులు వేయలేకపోయిందంటే పరిటాల కుటుంబానికి ప్రజల్లో ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. పరిటాల రవి హత్య తర్వాత 2005 బైపోల్స్‌లో మొదటి సారి పెనుగొండ నుంచి పరిటాల సునీత విజయం సాధించారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆమె రాప్తాడుకు షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 , 2024 ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని లీడర్ అనిపించుకున్నారు.
2019 ఎన్నికల్లో పరిటాల సునీత పోటీకి దూరంగా ఉండి తమ కుమారుడు పరిటాల శ్రీరామ్‌ని రాజకీయ అరంగేట్రం చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌పై వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ విజయంతో తోపుదుర్తి ప్రకాశ్ ఫ్యామిలీ నియోజకవర్గంలో విశ్వరూపం చూపించిందంటారు. ఎమ్మెల్యేగా అనేక వివాదాల్లో ఇరుక్కుంటూ ఐదేళ్లు కాలం గడిపాడు. రాప్తాడులో స్థాపించాల్సిన జాకీ గ్రార్మెంట్స్ ఫ్యాక్టరీ దగ్గర మామూళ్లు డిమాండ్ చేసి ఆ అంతర్జాతీయ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేసిన ఘనత తోపుదుర్తి బ్రదర్స్‌దే అంటారు. ఇక ప్రకాశ్ రెడ్డికి సోదరులు అనేక అక్రమాలకు పాల్పడి ఆయన్ని వివాదాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఆ అన్నదమ్ముల అత్యుత్సాహంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాప్తాడు నియోజకవర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలు అన్న టాక్ నడిచింది.
Also Read: ‘గడప’ దాటొద్దు.. ప్లీజ్, ఈ సారి కూడా అదే బిర్యానీ?
సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత తిరిగి పోటీలోకి దిగి ఘన విజయం సాధించారు. సుమారు 23 వేల ఓట్లకి పైగా తేడాతో విజయం సాధించారు. అంతకుముందు అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రెచ్చిపోయి పరిటాల సునీత గెలిస్తే గుండు కొట్టిందుకుంటా, మీసం తీపించుకుంటా అని అనేక సవాళ్లు విసిరారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయినా గుండు , మీసం సంగతేమో కాని.. ఆయన నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. ఎన్నికల ముగిసి దాదాపు 7 నెలలు దాటుతున్నా ప్రకాష్‌రెడ్డి కనీసం పది రోజులు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేడని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి.
కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసిందని జగన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని. ప్రజల్లోకి వెళ్లి ఆందోళనలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని.. అన్ని నియోజకవర్గాల నేతలు రోడ్డెక్కాలని.. త్వరలోనే తాను కూడా జనంలోకి వస్తానని అంటున్నారు.
వైసీపీ ఉనికి కాపాడుకోవడానికి జగన్ అంత లావున పిలుపునిచ్చినా.. రాప్తాడులో మాత్రం ప్రకాష్ రెడ్డి ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించలేదు. అసలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా సైలెంట్ గా ఉన్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్య నేతల పెళ్లిళ్లకు, చావులకు తప్ప ఇక దేనికి ఆయన రాప్తాడులో అడుగుపెట్టడం లేదంట. అధికారం ఉన్నన్ని రోజులు సెగ్మెంట్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సోదరులు సైతం ఒక రేంజ్లో పెత్తనం చెలాయించారు. ఇప్పుడు వారు కూడ కనిపించడం లేదు. అడపాదడపా ప్రకాశ్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు తప్ప సోదరులు అసలు కనిపించడం మానేశారు. పూర్తిగా హైదరాబాద్‌కు పరిమితం అయి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారంట.
ఆ నేతల అజ్ఞాతవాసానికి కారణం అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలే అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ప్రకాశ్ రెడ్డి కంటే తన సోదరుడు తోపుదుర్తి చందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. కనీసం రాయలేని భాషలో బూతు పురాణం వల్లించాడు.. ఈ వ్యాఖ్యల పై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దాంతో ఈ వ్యాఖ్యలపై స్వయంగా ప్రకాశ్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చందు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కేసులు పెట్టాయి. ఆ భయం ఆ బ్రదర్స్‌ని వెంటాడుతుందంట.
ఇక ప్రకాష్ రెడ్డి పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జాకీ పరిశ్రమ యాజమాన్యం నుంచి కమిషన్ డిమాండ్ చేసి ఆ పరిశ్రమని వెలగొట్టాడని, అలాగే వెంచర్లలో కమిషన్ వసూలు చేశారని, టమోటా మండిలో డబ్బులు వసూళ్ల దగ్గర నుంచి అక్రమ మట్టి తవ్వకాలు, అమ్మ డైరీ ఏర్పాటు వంటి పలు వివాదాలు ఆయన్ని చుట్టుముట్టయి. వాటిపై విచారణలు ప్రారంభమైతే జైలు జీవితం తప్పదన్న భయంతోనే ప్రకాశ్‌రెడ్డి సైలెంట్ అయ్యారన్న టాక్ నడుస్తోంది.
ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలతో జగన్ నిర్వహించారు. ఆ మీటింగుకి హాజరైన ప్రకాష్‌రెడ్డి పై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంట. నియోజకవర్గంలో కార్యకర్తలకి అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నావని నిలదీశారంట. నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గట్టిగానే చెప్పారంట. చూడాలి మరి తోపుదుర్తి తమ్ముడు జగనన్న మాటకి ఎంత విలువిస్తాడో.