కడపలో వైసీపీ కార్పొరేటర్లు సైకిలెక్కకుండా బుజ్జగించేందుకు నేరుగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఈ మధ్య కాలంలో వైసీపీని వీడిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు మరో 12 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత జిల్లాలోని కడప కార్పొరేషన్ చేజారిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పార్టీపై పడుతుందని జగన్ భయపడుతున్నారంట.
అందుకే వైసీపీ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగారంట. ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లకు ఉన్న సమస్యలేంటి అనే దిశగా జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే నడుస్తుంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటే.. తర్వాత జగన్ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మేయరు సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వర్గీయులే కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య సఖ్యత లోపం ఉంది.
వైసీపీ నేతల విభేదాలను టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోటీడీపీ గూటికి సుమారు 20 మంది కార్పొరేటర్లు వెళుతున్నారన్న ప్రచారం జరిగింది. వారితో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్వయంగా రెండు సార్లు సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనతో మీ వెంటే ఉంటామని చెప్పినప్పటికీ .. ఒకేసారి ఏడుగురు కార్పొరేటర్లు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. అంతకు ముందే మరో కార్పొరేటర్ సిటీ కేబుల్ సూర్యనారాయణ సైకిలెక్కారు. మరో 12 మంది టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
మేయరు సురేశ్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాల వైఖరితోనే కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డే వారిద్దరిని దెబ్బ కొట్టడానికి వాంటెడ్‌గా కార్పొరేటర్లను టీడీపీలో పంపిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సొంత జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లి మేయర్ పదవి చేజారితే అది స్టేట్ ఇష్యూ అయి వైసీపీకి మరింత డ్యామేజ్ అవుతుందని జగన్ ఆందోళన చెందుతున్నారంట. అందుకే దాన్ని చక్కబెట్టాల్సిందిగా అవినాష్ కు బాధ్యతలు అప్పజెప్పారంటారు.
అయితే పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కారణంగా మరోసారి కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాలేకపోయారట. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకల కోసం జిల్లాకు వచ్చిన జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి, మేయరు సురేశ్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలతో కలిసి 36 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లతో ఇడుపులపాయలో సమావేశమయ్యారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను నేరుగా బుజ్జగించే ప్రయత్నం చేశారంట
మీరు పార్టీ మారొద్దు.. మిమ్మల్ని బాగా చూసుకుంటాను.. నేను కూడా 16 నెలలు జైలులో ఉన్నా ను.. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి.. కేసులు పెడతారు. బెదిరింపులకు దిగుతారు… రాబోవు రోజుల్లో మరింత సీరియస్ గా ఉంటుంది… మీరు పార్టీలో ఉండండి.. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందర్నీ బాగా చూసుకుంటానని కార్పొరేటర్లతో చెప్పారంట. 2019లో అధికారంలోకి వస్తే బిర్యాని తినిపిస్తామని చెప్పారు కదా సార్… కనీసం దాని వాసన కూడా మమ్మల్ని చూడనీయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు …అంటూ కొందరు కార్పొరేటర్లు జగన్ ముందే ఆవేదన వ్యక్తం చేశారంట.
Also Read: బన్నీని బద్నాం చేస్తున్న అంబటి? ఈ టైంలో సోఫాలేంటి?
దానికి ఆ విషయం తన దృష్టికి రాలేదన్న జగన్… ఇక నుంచి మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారంట.. అదలా ఉంటే ఇంతకాలానికి జగన్‌తో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో కార్పొరేటర్లు ఫ్యామిలీలతో సహా ఇడుపులపాయ వెళ్లారంట. పార్టీ మారకుండా ఉండటానికి ఏవైనా తాయిలాలు ఇస్తారని వారు ఆశించారంట. ఒక్కో కార్పొరేటర్‌కి కనీసం పది లక్షలైనా ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారంట. అయితే జగన్ అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ.. రొటీన్‌గా బిర్యానీ కబుర్లే చెప్పారని కార్పొరేటర్లు నిరాశపడ్డారంట.. చేసేదేమీ లేక ఉసూరుమంటూ వచ్చేశారట. మరి చూడాలి మున్ముందు కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు ఎలా ఉంటాయో?