Labour Department: ఇటీవలి కాలంలో కార్మిక శాఖ లో అభివృద్ధి కార్యక్రమాల కంటే అంతర్గత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.శాఖాపరమైన నిర్ణయాలు, బదిలీలు, కీలక కేసుల విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పేషీ సిబ్బందికి, డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. పేషీలోని కొందరు అధికారుల వ్యవహారశైలి వల్ల ప్రభుత్వ ప్రతిష్టతో పాటు స్వయంగా మంత్రికి కూడా చెడ్డపేరు వస్తోందని ఆ శాఖా వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.వాస్తవానికి తొలి సారి మంత్రి కావడంతో రాష్ట్ర కార్మిక శాఖ మినిస్టర్ కు సంపూర్ణంగా పాలనాపరమైన అంశాలపై పూర్తిస్థాయి పట్టు లేకపోవడంతో పేషీలోని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మంత్రి ఆదేశించారంటూ ఆయన పేరును అడ్డుపెట్టుకుని,పేషీ ఆఫీసర్లు నేరుగా శాఖాధికారులకు ఫోన్లు చేస్తూ తమకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులను చేయలేమని, అవి సాధ్యం కావని డిపార్ట్‌మెంట్ అధికారులు స్పష్టం చేసినప్పుడు పేషీ వర్గాలు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. తమ మాట వినని అధికారులను లక్ష్యంగా చేసుకుని, వారిపై అసత్య ప్రచారాలను విస్తృతం చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగుల్లోనే డిస్కషన్ జరుగుతుంది.
గతంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసు వ్యవహారం మరోసారి కార్మిక శాఖలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది.ఈ కేసులో ఓ మహిళా అధికారిణి ఏ1 నిందితురాలిగా ఉండగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మహిళా డాక్టర్ ను కాపాడేందుకు మంత్రి పేషీ వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని శాఖా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సదరు మహిళా డాక్టర్ పై ఏకంగా ప్రాసిక్యూషన్‌ను నిలిపివేయాలంటూ పేషీ లోని ఓ అధికారి నుంచి కార్మిక శాఖ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్నందున,నిబంధనలకు విరుద్ధంగా తాము ఎలాంటి సహకారం అందించలేమని కార్మిక శాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు కచ్చితంగా కావాలంటే మంత్రి నుంచి స్పష్టమైన రాతపూర్వక ఆదేశాలు ఇప్పించాలని లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెలిక పెట్టడంతో పేషీ వర్గాలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.ఈ పరిణామంతో పేషీ సిబ్బందికి, కార్మిక అధికారులకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సెక్రటేరియట్ లో ప్రచారం జరుగుతుంది.
Also read: ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర
నిబంధనలకు తలొగ్గని అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న వాదనలకు బలం చేకూరుస్తూ ఇటీవల లేబర్ వెల్ఫేర్ బోర్డులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.బోర్డులో విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ అధికారిపై ఆరోపణల పేరుతో వేటు వేసి,ఆయనను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.అయితే,ఈ బదిలీ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనే చర్చ శాఖలో నడుస్తోంది.ఆయన స్థానంలో, మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్న ఓ కీలక ఉన్నతాధికారికి స్వయానా బావమరిది కి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిధులు,అధికారాలు ఉండే వెల్ఫేర్ బోర్డులో తమ సొంత మనుషులను కూర్చోబెట్టడం ద్వారా నేరుగా రాజకీయ, పరిపాలనాపరమైన జోక్యం చేసుకోవాలనే వ్యూహం దీని వెనుక ఉందని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
పేషీ సిబ్బంది, శాఖాధికారుల మధ్య నడుస్తున్న ఇంటర్నల్ వార్ తో కార్మిక శాఖ అస్తవ్యస్తంగా మారిపోయింది.ఏ ఫైలుపై సంతకం చేస్తే ఏ వివాదంలో చిక్కుకుంటామోనన్న భయంతో అధికారులు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు, తమపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అధికారులు అంతర్గతంగా మదనపడుతున్నారు.ఈ వివాదాలపై మంత్రి స్వయంగా దృష్టి సారించి, పేషీ సిబ్బందికి, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కుదర్చకపోతే రానున్న రోజుల్లో కార్మిక శాఖ ప్రతిష్ట మరింత దిగజారే ప్రమాదం ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.
Also read: ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర