టెర్రరిస్టుల గుండెల్లో కొత్త టెర్రర్!
ఒక్కొక్కరిగా ఖతమైతున్న భారత శత్రువులు
ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు! ఎలా వేసేస్తాడో అర్థం కాదు! వారి చావు ఎంత ఘోరంగా ఉంటుందో.. అస్సలు ఊహించలేరు. వారి నేల మీదే.. క్షణాల్లో ఖతమైపోతున్నారు. టెర్రర్ ఎటాక్స్‌ని ప్లాన్ చేస్తున్న టెర్రరిస్టులందరి గుండెల్లో ఇప్పుడు టెర్రర్ మొదలైంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకైతే.. కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎక్కడున్నా.. ఎంత రహస్య ప్రదేశంలో దాక్కున్నా.. వారి చావు వారిని వెతుక్కుంటూ వచ్చేస్తోంది. ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వరుసగా హతమవుతున్నారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. మొన్నటికి మొన్న కుల్ భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న మతపెద్ద హతమయ్యాడు. ఇప్పుడు.. 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ మేనల్లుడు.. అబూ కతల్ పాకిస్థాన్‌లోనే ఖతమయ్యాడు.
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాదులు హతం
కొన్నాళ్లుగా గుర్తుతెలియని వ్యక్తులు అనేకమంది భారత వ్యతిరేక శక్తులను ఖతం చేస్తున్నారు. లేటెస్ట్‌గా.. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ మేనల్లుడు.. అబూ కతల్ హతమయ్యాడు. తన అనుచరులతో కాన్వాయ్‌లో వెళ్తుండగా.. ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో అబూ కతల్‌తో పాటు అతని బాడీగార్డ్స్ కూడా చనిపోయారు. నిత్యం పాకిస్థాన్ ఐఎస్ఐ నీడలో సంచరించే అబు కతల్‌ని.. ఇలా లేపేయడం హాట్ టాపిక్‌గా మారింది. హఫీజ్ సయీద్, అబూ కతల్ హిట్ లిస్టులో ఉన్నారని ఐఎస్ఐకి తెలుసు. వాళ్లను.. పదేళ్లుగా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుందనే సమాచారం ఉంది. అబూ కతల్‌కి ఐదు మారుపేర్లు ఉన్నాయి. హఫీజ్ సయీద్.. లష్కరే తోయిబాకి చీఫ్ అయినా.. తన మేనల్లుడైన అబూ కతల్‌ని చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా నియమించాడు. ప్లాన్ హఫీజ్ వేస్తే.. దానిని అమలు చేసేది అబు కతల్.
ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా అబూ కతల్
లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ కతల్.. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్నాడు. 2023లో రాజోరి జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి, 2024 రియాసి జిల్లాలో జరిగిన బస్సు దాడిలో పాల్గొన్నాడు అబూ కతల్. ఇవి మాత్రమే కాదు జమ్ముకశ్మీర్‌లో అనేక దాడులకు ఇతనే బాధ్యుడు. అందువల్ల.. ఎన్ఐఏతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల హిట్ లిస్టులో ఉన్నాడు. 2024 జూన్ 9న రియాసి జిల్లాలో.. శివకోరి గుహలో ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న హిందూ యాత్రికుల బస్సుపై దాడి చేశారు.
2023 జనవరిలో పౌరులే లక్ష్యంగా అబూ కతల్ కాల్పులు
అబూ కతల్ నాయకత్వంలో జరిగిన ఈ దారుణమైన దాడిలో.. 9 మంది పౌరులు మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి తర్వాత రియాసి జిల్లాలో కొత్త భయాందోళన మొదలైంది. 2023 జనవరిలో రాజోరి జిల్లాలోని దంగ్రీ గ్రామంలో నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించి.. పౌరులని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలోనూ అబూ కతల్ పాత్ర ఉంది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
లష్కరే తోయిబాబాలోకి రిక్రూట్‌మెంట్ చేసే అబు కతల్
జమ్ముకశ్మీర్ సరిహద్దు గ్రామాల్లోని యువకులకు డబ్బు ఆశ చూపి.. లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేస్తున్నాడు అబు కతల్. అదొక్కటే కాదు.. మైనారిటీ సమాజానికి చెందిన పౌరులని, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఎటాక్స్ చేయడంలో అబూ కతల్ పాత్ర ఉంటుంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, బోర్డర్ దాటి చొరబడటం, పౌరులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ.. అబూ కతల్ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. వీటన్నింటిపై లోతైన దర్యాప్తు తర్వాత ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరిలో ముగ్గురు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్లు ఉన్నారు. అందులో.. అబూ కతల్, సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్, మహమ్మద్ ఖాసిం ఉన్నారు.
హఫీజ్ సయీద్‌కు ఇలాంటి గతే పట్టొచ్చనే వాదనలు
జమ్ముకశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు దాడులు ప్లాన్ చేయడం, పాకిస్థాన్ నుంచి వచ్చే సూచనల్ని అమలు చేయడం లాంటివి చేయడంలో ఇతనిదే కీలకపాత్ర. అలాంటి.. అబూ కతల్ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవడంతో.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటంలో.. ఓ ముఖ్యమైన పరిణామానికి నాంది పలుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అంతేకాదు.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు కూడా ఇలాంటి గతే పట్టొచ్చనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఎవరు చేస్తున్నారో తెలియదు!
ఎవరు చేస్తున్నారో తెలియదు! ఎలా ఉగ్రవాదుల జాడని కనిపెడుతున్నారో అర్థం కావట్లేదు! కానీ.. పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. వీలైతే.. పాయింట్ బ్లాంక్‌లోనే లేపేస్తున్నారు. దాంతో.. పాకిస్థాన్ టెర్రరిస్టులకు, ఖలిస్థాన్ వేర్పాటువాదులందరికీ.. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల భయం పట్టుకుంది. ఇదంతా.. కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. కొన్ని నెలలుగా నడుస్తున్న వ్యవహారమే. ఇప్పటికే.. ఈ తరహాలో చాలా మంది హతమయ్యారు. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందనే సంకేతాలిస్తున్నారు.
ఉగ్రవాదులను ఏపిపారేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు
ఊరు లేదు.. పేరు లేదు.. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల జాడ కూడా తెలియట్లేదు. ఎవరు చంపేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఇదంతా.. మూడు నాలుగేళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. ఇప్పటికే.. ఇలాంటి హత్యలు చాలానే జరిగాయ్. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్‌ని చూశాక.. ఇప్పుడిప్పుడే అందరిలోనూ అనుమానం కలుగుతోంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ.. ఒకరి తర్వాత ఒకరిని హతమారుస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు.
పగడ్బందీగా ప్లాన్ చేసి ఉగ్రవాదుల ఏరివేత
ముఖ్యంగా.. భారత్‌కు శత్రువులుగా ఉన్న వాళ్లు, ఇండియా హిట్ లిస్టులో ఉన్న వాళ్లంతా.. విదేశాల్లో హతమైపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా.. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తుండటంతో.. చాలా మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నారు. అయినా.. ఉగ్రవాదుల హత్యలు ఆగట్లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా.. పకడ్బందీగా ప్లాన్ చేసి.. టెర్రరిస్టుల ప్రాణాలు తీసేస్తున్నారు.
కుల్‌భూషన్ కిడ్నాప్‌లో ఐఎస్ఐకి సహకరించిన పాక్ మతపెద్ధ
అబూ కతల్ మాత్రమే కాదు.. ఇటీవలే ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో.. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి సహకరించిన పాక్ మతపెద్ద.. ముఫ్తీ షా మిర్ కూడా హత్యకు గురయ్యాడు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తి అతన్ని కాల్చి చంపేశాడు. గతంలోనే 2 సార్లు తప్పించుకున్న ముఫ్తీ షా.. మూడోసారి బయటపడలేకపోయాడు. అంతకుముందే ముఫ్తీ షా పార్టీకి చెందిన ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
కుల్‌భూషన్ కిడ్నాప్‌లో కీలకమైన ముల్లా ఒమర్ ఇరానీ హత్య
మతపెద్ద ముసుగులో ఆయుధాలు, మానవ అక్రమ రవాణా లాంటివి చేసే ముఫ్తీ షా మిర్‌కు.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయ్. తరచుగా.. టెర్రరిస్ట్ క్యాంపుల్ని సందర్శించేవాడు. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేసేవాడు. ఐదేళ్ల కిందటే.. కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో కీలకంగా వ్యవహరించిన జైషే అల్ అదల్ సంస్థ సభ్యుడు ముల్లా ఒమర్ ఇరానీ కూడా.. ముఫ్తీ షా మిర్ మాదిరిగానే 2020లో హత్యకు గురయ్యాడు.
పాకిస్థాన్, కెనడా, బ్రిటన్ లోనూ వరుసగా హత్యలు
పాకిస్థాన్, కెనడా, బ్రిటన్‌లోనూ.. భారత వ్యతిరేక శక్తులు వరుసగా హతమవుతున్నారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితులైన వాళ్లు కూడా.. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న ఎందరో తీవ్రవాదులు, ఖలిస్థానీ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారు. లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ సలామ్ భుట్టావి, జియార్ రెహమాన్, అబూ ఖాసిం, ముఫ్తీ ఖైజర్ ఫరూక్, సర్దార్ హుస్సేన్ లాంటివాళ్లంతా.. పాకిస్థాన్ గడ్డ మీదే హత్యకు గురయ్యారు. ఇక.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు దావూద్ మాలిక్, షాహిద్ లతీఫ్, అతని సోదరుడు హారిస్ హాషిమ్, జహూర్ మిస్త్రీ కూడా పాక్ నేల మీదే ప్రాణాలు కోల్పోయారు.
IC-814 హైజాకర్ మిస్త్రీ జహూర్ ఇబ్రహీం కరాచీలో హతం
నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. అతనే కాదు.. ఖలిస్థాన్ ఉగ్రవాదులుగా పేరున్న సుఖ్దూల్ సింగ్, రిపూదామన్ సింగ్ కూడా కెనడాలోనే హత్యకు గురయ్యారు. అవతార్ సింగ్.. లండన్‌లో మర్డర్ అయ్యాడు. పరంజిత్ సింగ్, హర్వీందర్ సింగ్ సందూ.. లాహోర్‌లో గుర్తుతెలియని వారి చేతిలో చనిపోయారు. ఇక.. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన బషీర్ అహ్మద్ పీర్, సయ్యద్ ఖలీద్ రజా, ఎజాజ్ అహ్మద్.. లాంటోళ్లంతా చనిపోయారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాకర్లలో ఒకరైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీంని కూడా కరాచీలో కాల్చి చంపారు.
2022 నుంచి హత్యకు గురవుతున్న భారత వ్యతిరేక శక్తులు
2022 నుంచి ఇప్పటివరకు ఇదే తరహాలో.. చాలా మంది ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఉగ్రవాదులంతా హత్యకు గురవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు.. అబూ కతల్ హత్య కూడా.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ని డేంజర్‌లో పడేసిందని చెబుతున్నారు. ఉగ్రవాదుల్ని ట్రాక్ చేస్తున్న వారంతా.. అతనికి దగ్గరవడాన్ని సూచిస్తోందని విదేశాంగ నిపుణులు అంటున్నారు.
పాక్ సైన్యం రక్షణ కల్పించినా.. ఏ ఉగ్రవాది సేఫ్‌గా లేడా?
అబూ కతల్‌నే హతమార్చారంటే.. హఫీజ్ సయీద్‌కి కూడా వాళ్లు దగ్గరగా చేరుకున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తుపాకీని ఎంచుకున్నవాడు.. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌కే పోతాడంటారు. అందువల్ల.. హఫీజ్ సయీద్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన మేనల్లుడి హత్య తర్వాత.. హఫీజ్ సయీద్ మరింత జాగ్రత్తగా ఉంటాడని చెబుతున్నారు. అతను తన భద్రతను పెంచుకోవడంతో పాటు పాకిస్థాన్ సైన్యం నుంచి కూడా ఇప్పటికే సాయం కోరి ఉంటాడనే లెక్కలున్నాయి.
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో బలైపోక తప్పదనే టాక్
అయితే.. ఇప్పటికే ఉన్న అనుమానాలు, ఆరోపణల మేరకు పాకిస్థాన్ సైన్యం ఎంత రక్షణ కల్పించినా.. ఏ ఉగ్రవాది కూడా సేఫ్‌గా లేడనే విషయం అర్థమవుతోంది. ఇందుకు.. వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఎపిసోడ్లే బిగ్ ఎగ్జాంపుల్. ఏదో ఒకరోజు వాళ్లంతా.. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో బలైపోక తప్పదంటున్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా.. వాళ్లంతా సురక్షితంగా లేరనే విషయం తెలుస్తోంది. ఎక్కడున్నా.. ఎలాంటి చోట దాక్కున్నా.. ఎంత సేఫ్‌గా ఉన్నామని అనుకున్నా.. ఏదో ఒక రోజు చావు వాళ్ల దాకా వెళ్తుందనే విషయం.. ఇప్పటికే అర్థమై ఉంటుందంటున్నారు.