వ్యోమగాముల జీవితం ఓ సాహసం. అంతరిక్షంలోకి వెళ్లడమే ఓ సాహసం అయితే అక్కడ వాతావరణాన్ని తట్టుకుని నిలబడటం, తిరిగి భూమిపైకి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలోకి మారే సమయంలో వారి జీవన గమనం అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటుంది. అలాంటిది పలుమార్లు అంతరిక్షయానం చేసిన సునీతా విలియమ్స్ గతంలో చాలా సార్లు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి ఆమెకి మరో పెద్ద సవాల్ ఎదురైంది. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో అక్కడి వాతావరణానికి అలవాటు పడిన ఆమె రేపటి నుంచి భూమి వాతావరణానికి అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది.
వ్యోమగాములు – సవాళ్లు..
వ్యోమగాములు శారీరకంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, మానసికంగా కూడా మరిన్ని సవాళ్లను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువ. స్పేస్ లో వారు ఉన్న ఆ కాస్త ప్లేస్ లోనే ఒంటరిగా జీవితం గడపాల్సి ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో మరో వ్యక్తి తోడు ఉన్నా కూడా ఇరుగు పొరుగుతో మాట్లాడినట్టు అక్కడ కబుర్లు, కాలక్షేపానికి చోటు ఉండదు. అందుకే నిరంతరం తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తిరిగి భూమిపైకి వెళ్లే సమయం వరకు ఆరోగ్యంగా ఉంటూ సమయం కోసం వేచి చూస్తుంటారు వ్యోమగాములు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి.. దానికి తగ్గట్టే వారి జీవన విధానం మారిపోతుంది. ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మానవ శరీరంలో కండరాలు ఇబ్బంది పడతాయి. వాస్తవంగా గురుత్వాకర్షణ శక్తి ఉంటే కండరాలకు పని ఉంటుంది. అది లేకపోవడం వల్ల కండరాలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకరకంగా ఈ స్థితి కండరాల క్షీణతకు దారి తీస్తుంది.
ఎముకల్లో మార్పు..
అంతరిక్షంలో మానవ శరీరంలోని ఎముకలు తమ ద్రవ్యరాశిని 1 నుంచి 2 శాతం కోల్పోతాయి. ఆస్టియో పోరోసిస్ లాగా ఎముకలకు నష్టం జరుగుతుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది, వాటిల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. భూమిపైకి వచ్చిన తర్వాత ఆ నష్టం నుంచి కోలుకోడానికి వారికి సరైన వ్యాయామం అవసరం. పూర్తిగా కోలుకోడానికి కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా.
అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన తర్వాత హృదయ స్పందనలు, రక్త సరఫరా వంటి వాటిల్లో కూడా సమతుల్యత లోపించే ప్రమాదం ఉంది. భూమిపైకి వచ్చిన తర్వాత వ్యోమగాములకు తరతిరగడం వంటివి సహజం. దీన్ని నివారించేందుకు వారికి రోజుల తరబడి బెడ్ రెస్ట్ అవసరమని చెబుతుంటారు వైద్యులు. తిరిగి వారు సాధారణంగా నడవడం, ఇతర పనులు చేసుకోడానికి తగిన సమయం ఇస్తారు.
అంతరిక్ష కేంద్రంలో రక్తంతోపాటు శరీరంలోని ఇతర ద్రవాల ప్రవాహం ఎక్కువగా తలవైపునకు ఉంటుంది. అందుకే వ్యోమగాములకు ముఖాల వాపు సహజ లక్షణం. వారు భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత రక్తపోటులో అసహజ మార్పులు కనిపించవచ్చు. వారు పడుకొని ఉంటే రక్తపోటు సాధారణ స్థాయిలో ఉంటుంది. నిలబడితే మాత్రం రక్తపోటు తక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
అంతరిక్ష కేంద్రంలో బ్యాక్టీరియా, వైరస్ లకు చోటు ఉండదు కాబట్టి శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా చప్పబడి ఉంటుంది. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత దాని అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే అప్పటికే బలహీన పడిన రోగనిరోధక వ్యవస్థ తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడానికి, శరీరానికి రక్షణ కవచంలా ఉండటానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావానికి ఎక్కువగా శరీరం గురవుతుంది. భూమిపైకి తిరిగొచ్చిన తర్వాత ఆ ప్రభావం పూర్తిగా ఉండదు కాబట్టి దానికి తగినట్టు శరీరం సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యోమగాములకు దృష్టి సమస్యలు కూడా సహజం. అంతరిక్షంలో ఎక్కువరోజులు గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత కంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి దీర్ఘకాలికంగా వారిని ఇబ్బంది పెట్టే అవకాశముంది. స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ వ్యోమగాముల్ని ఇబ్బంది పెడుతుంది.
శారీరక సమస్యలు ఒక ఎత్తు అయితే, మానసిక సమస్యలు మరో ఎత్తు. అంతరిక్షంలో నెలల తరబడి ఒంటరిగా జీవనం సాగించిన వ్యోమగాములు, భూమిపైకి చేరుకోగానే రోజువారీ జీవితాన్ని గడిపేందుకు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో వారికి మానసిక వైద్య నిపుణుల మద్దతు, కౌన్సెలింగ్ అవసరం. కుటుంబ సభ్యులు కూడా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సహకరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, నిరాశకు వ్యోమగాములు గురవుతారని అంచనా. ఆ ఒత్తిడిని కూడా వారు జయించాల్సి ఉంటుంది.