E-Paper
Advertisement

Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!

Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!
Advertisement

Uniform Civil Code: దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో నివురుగప్పిన నిప్పులాంటి అంశం యూనిఫాం సివిల్ కోడ్. దీనిపై సుప్రీంకోర్టు చేసిన లేటెస్ట్ కామెంట్స్‌.. మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయ్. ముఖ్యంగా.. ముస్లిం మహిళల వారసత్వ హక్కులపై విచారణ సమయంలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయ్. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితుల క్రమంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది చట్టసభల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతున్న 1937 నాటి షరియత్ నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణపై జరిపిన సీజేఐ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం మతం పేరుతో మహిళలకు ప్రాథమిక హక్కులు, సమానత్వం నిరాకరించడం సరైనది కాదని కోర్టు స్పష్టం చేసింది. వివక్షపై ఇది మంచి పిటిషన్ అని అభిప్రాయపడింది.

ముస్లిం వారసత్వ చట్టాలపై స్పష్టత

Advertisement

ముస్లింల వారసత్వాన్ని నియంత్రించే చట్టమేదీ లేనందున.. షరియత్‌ నిబంధనలను సుప్రీంకోర్టు రద్దు చేస్తే శాసన శూన్యత ఏర్పడుతుందని స్పష్టం చేసింది. సంస్కరణలు తీసుకురావాలన్న తొందరపాటులో.. ముస్లిం మహిళలు ఇప్పటికే తమకున్న రక్షణని కోల్పోవాల్సిన పరిస్థితి రావొచ్చని తెలిపింది. షరియత్‌ చట్టాన్ని ఉన్నఫళంగా రద్దు చేస్తే తర్వాత పరిస్థితేంటనే ఆలోచనతో.. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించొద్దని.. సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. చట్టసభల పరిధిలోని అంశంలో కోర్టు జోక్యం సరికాదన్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం.. ఉమ్మడి పౌరస్మృతిని తేవాల్సిన బాధ్యత చట్టసభలదేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

రసత్వ హక్కులపై వాదనలు

ట్రిపుల్ తలాక్ కేసు తీర్పుని ప్రస్తావిస్తూ.. పురుషులతో సమానంగా ముస్లిం మహిళలకూ వారసత్వ హక్కులు ఉంటాయని కోర్టు ప్రకటించొచ్చని అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి సూచించారు. షరియత్ చట్టాన్ని రద్దు చేస్తే.. భారత వారసత్వ చట్ట నిబంధనలు వర్తింపజేయొచ్చని తెలిపారు. అయితే, పర్సనల్ లా రాజ్యాంగ అధికరణం 13 పరిధిలోకి రావని, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని సవాల్ చేయలేమని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌లో సవరణలు చేసేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణని మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో యూసీసీ చర్చ

Advertisement

ఇక.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మొదటి నుంచి మూడు ప్రధాన హామీలను ఇచ్చింది. అందులో.. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పింది. చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పింది. ఇది పూర్తి చేసింది. ఇక.. మిగిలింది యూనిఫాం సివిల్ కోడ్ అమలు మాత్రమే. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం దేశంలోనే మొదటిసారి యూసీసీ అమలు చేసి ఒక మోడల్‌ని సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నేరుగా పార్లమెంటే చట్టం చేయాలని చెప్పడం.. కేంద్ర ప్రభుత్వానికి బలమైన మద్దతుగా నిలుస్తుంది. విపక్షాలు దీనిని వ్యతిరేకించినా, సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలను ప్రభుత్వం తన వాదనలు ఆయుధంగా వాడుకునేందుకు వీలు దొరికింది.

యూసీసీపై మత సంస్థలు, గిరిజనుల ఆందోళన

యూసీసీ అమలుపై భారత్‌లో భిన్న వాదనలున్నాయ్. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. వివాహం, విడాకులు, వారసత్వం లాంటి విషయాల్లో మతంతం సంబంధం లేకుండా మహిళందరికీ సమాన హక్కులు దక్కుతాయ్. మతం పేరుతో వేర్వేరు చట్టాలు ఉండటం వల్ల.. ప్రజల మధ్య అంతరం పెరుగుతోందని, ఒకే దేశం-ఒకే చట్టం ఉంటే ఐక్యత పెరుగుతుందని వాదిస్తున్నారు. వంద ఏళ్ల నాటి పర్సనల్ చట్టాల్లో మార్పులు చేయడం వల్ల సమాజం మరింత పురోగమిస్తుందంటున్నారు. యూసీసీపై కొన్ని ప్రతికూల వాదనలు కూడా ఉన్నాయ్. భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో.. మతపరమైన ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమనేది కొందరి వాదన. కేవలం ముస్లింలే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా తమ ఆచారాలను యూనిఫామ్ సివిల్ కోడ్ దెబ్బతీస్తుందని ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో లబ్ధి పొందేందుకే.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయ్.

యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏమిటి?

భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అనేది.. కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు. ఒక దేశం సామాజిక అస్తిత్వానికి సంబంధించిన కీలక అంశం. మతం, సంప్రదాయం, రాజ్యాంగం మధ్య ఉన్న సమతుల్యతని.. ఉమ్మడి పౌరస్మృతి సవాల్ చేస్తుంది. అదెలాగో అర్థం అవ్వాలంటే.. యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏమిటో సమగ్రంగా తెలియాలి. అప్పుడే.. దాని అవసరమేంటో అర్థమవుతుంది. ప్రస్తుతం.. భారతదేశంలో వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి వారసత్వం లాంటి వ్యక్తిగత విషయాల్లో.. ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు.. హిందూ కోడ్ బిల్లు కింద చట్టాలున్నాయ్. ముస్లింలకు వారి మతపరమైన షరియత్ చట్టం ఆధారంగా వ్యక్తిగత వ్యవహారాలన్నీ జరుగుతాయి. అదేవిధంగా.. క్రిస్టియన్, పార్శీలకు కూడా పర్సనల్ చట్టాలున్నాయ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం.. దేశంలోని పౌరులందరికీ.. ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్దేశిస్తోంది. అందువల్ల.. యూసీసీ అమల్లోకి వస్తే.. మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వ్యక్తిగత విషయాల్లో.. ఒకే విధమైన చట్టం వర్తిస్తుంది.

యూసీసీపై వ్యతిరేక వాదనలు

ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఎక్కడ సమస్య వస్తోందంటే.. కొన్ని మతపరమైన వ్యక్తిగత చట్టాల్లో మహిళల హక్కులు పురుషులతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమనే వాదనలు ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో వాటా గానీ, బహుభార్యత్వం లాంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయ్. సుప్రీంకోర్టు ఇప్పుడే కాదు.. గతంలోనూ యూసీసీ అవసరంపై తన అభిప్రాయం క్లియర్‌గా చెప్పేసింది. మతపరమైన చట్టాలను రద్దు చేయడం కంటే, నేటితరం సమాజానికి అనుగుణంగా.. అందరికీ వర్తించే సమగ్ర చట్టాన్ని తీసుకొస్తే మంచిదని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఒకే దేశంలో వేర్వేలు చట్టాలు ఉండటం వల్ల.. జాతీయ సమగ్రతకు ఆటంకం కలుగుతుందని, ఉమ్మడి చట్టం వల్ల దేశమంతా ఏకతాటిపైకి వస్తుందనేది కోర్టు అభిప్రాయం. మతంతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులందరికీ సమాన హక్కులు కల్పించడమే యూసీసీ ఉద్దేశం. దీనివల్ల.. లింగ వివక్ష తొలగిపోతుందని, వారసత్వం, వివాహ విషయాల్లో మహిళలకు మేలు జరుగుతుందనేది అనుకూల వర్గాల వాదన. అయితే, ఉమ్మడి పౌరస్మృతి మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, భారతదేశంలోని వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని యూసీసీ వ్యతిరేక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్.

యూసీసీపై సుప్రీంకోర్టు దృష్టి

దేశంలో యూసీసీ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో.. గోవా ఒకటి. ఇక్కడ.. దశాబ్దాలుగా గోవా సివిల్ కోడ్ అమల్లో ఉంది. ఇది.. 1867లో పోర్చుగీసు వారు ప్రవేశపెట్టిన చట్టం. 1961లో గోవా ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత కూడా ఈ చట్టాన్ని అలాగే కొనసాగించారు. ఇక్కడ.. మతంతో సంబంధం లేకుండా వివాహం, వారసత్వం, ఆస్తి హక్కుల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఇక.. దేశంలో సొంతంగా యూసీసీ బిల్లుని రూపొందించి, ఆమోదించిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. బహుభార్యత్వంపై నిషేధం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, ఆస్తి హక్కుల్లో మహిళలకు వాటా కల్పించడం లాంటివి ఇందులో ఉన్నాయి. గుజరాత్, అస్సాం కూడా యూసీసీని అమలు చేస్తామని ప్రకటించాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు కమిటీలు కూడా వేశాయి. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ కూడా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని చాలా నెలలుగా కసరత్తు చేస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సానుకూలమైన వ్యాఖ్యలు చేయడంతో.. మరోసారి ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ మొదలైంది.

వ్యక్తిగత చట్టాలకు ముగింపు?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా.. వివాహం, విడాకులు, ఆస్తి హక్కుల్లో.. మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించాలని చూస్తోంది. వ్యక్తిగత చట్టాల్లోని సంక్లిష్టతని తొలగించి, సింపుల్‌గా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చూస్తోంది. అన్ని మతాల్లోనూ.. బహుభార్యత్వంపై నిషేధం తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల.. సామాజిక నిర్మాణంలో పెను మార్పు వస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ.. భారత్ లాంటి వైవిధ్యభరితమైన దేశంలో.. యూసీసీ ఓ సున్నితమైన అంశం. అయినప్పటికీ.. ఇది అమల్లోకి వస్తే.. రాజ్యాంగం ముందు అంతా సమానులేననే భావన బలపడుతుంది. మహిళలకు సామాజిక భద్రత పెరుగుతుంది.

మైనారిటీల ఆందోళనల మధ్య యూసీసీపై చర్చ

కానీ, మైనారిటీ వర్గాలు తమ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భయపడుతున్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో ఆచారాలకు.. ఈ చట్టం ఎలా వర్తిస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. అయితే.. యూసీసీని దేశమంతటా అమల్లోకి తేవాలంటే.. రాజకీయ ఏకాభిప్రాయం, మత పెద్దలతో చర్చలు అవసరం. ఎందుకంటే.. చట్టం ఏ మతానికి వ్యతిరేకంగా ఉండకూడదు, న్యాయం ఏ మతానికీ తక్కువ కాకూడదు. ఈ పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా యూసీసీని అమలు చేయాలని నిర్ణయించుకుంటే.. ప్రజాభిప్రాయాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుంది? మైనారిటీల సందేహాలను ఎలా క్లియర్ చేస్తుంది? అనే దానిపైనే యూసీసీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడు.. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో.. ఈ విషయంలో కేంద్రం అడుగులు మరింత వేగవంతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్.

Also Read:ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×