E-Paper
Advertisement

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?
Advertisement

Urban Heat: ఎస్.. ఎండాకాలంలో ఎండలుండటం సహజమే కదా అని సరిపెట్టుకునే రోజులు దాటిపోయాయ్. ఇప్పుడు నగరాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులనే కాదు, మన నగరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ప్రమాద హెచ్చరికలను మోసుకొస్తున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా అన్ని మహానగరాల్లోనూ కాక రేపుతున్న అర్బన్ హీట్ వెనుక ఉన్న అసలు కథేంటి? ఒకే నగరంలో వేర్వేరు చోట్ల ఉష్ణోగ్రతలు ఎందుకు వేర్వేరుగా ఉంటున్నాయ్?

మెట్రోల్లో హీట్ మ్యాప్ షాక్..

దేశంలోని మెట్రో నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఎండల ప్రభావం ఒకేలా లేదు. ఒకే నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉన్నట్లు లేటెస్ట్ రిపోర్టులు స్పష్టం చేశాయ్. నాసా, అమెరికా జియోలాజికల్ సర్వే ల్యాండ్ శాట్ చేపట్టిన మిషన్‌లో ఇది తేలింది. అధికంగా భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న ప్రాంతాలతో పోలిస్తే.. పార్కులు, చెట్ల ఆవరణ, నీటి వనరులు ఉన్న ప్రాంతంలో టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయ్. ఇదే.. ఇప్పుడు చర్చకు దారితీసిన అంశం. 2020లో 48 కోట్లున్న భారతదేశపు పట్టణ జనాభా, 2050 నాటికి 95 కోట్లకు చేరుకోనుందని వరల్డ్ బ్యాంక్, గృహ, పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేశాయి.

అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్..

Advertisement

దీనికితోడు చాలా మందికి వేసవిలో ఉపశమనం కలిగించే కూలింగ్ సిస్టమ్స్ అందుబాటులో లేవు. నగరాల్లో 13 శాతం మంది దగ్గర మాత్రమే ఏసీలు, 22 శాతం మంది దగ్గర ఎయిర్ కూలర్లు ఉన్నాయి. నగరాల్లో ఎండలు ఇంతలా పెరగడానికి, ఒకే నగరంలో వేర్వేరు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు ఉండటానికి మెయిన్ రీజన్.. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావమే. నగరం నడిబొడ్డున ఉన్న కాంక్రీట్ జంగిల్‌లో 45 డిగ్రీలకు పైన టెంపరేచర్ నమోదైతే, అదే నగర శివార్లలో.. చెట్లు ఎక్కువగా ఉన్న పార్కుల ప్రాంతంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.

జూబ్లీహిల్స్ చల్లగా ఎందుకు?

హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురాలో ఇటీవలే పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌ని తాకాయి. యాకుత్‌పురా ఏరియా జనావాసాలతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ చెట్లు తక్కువగా ఉంటాయ్. మూసీ నది పక్కన ఉన్న మలక్‌పేటలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నమోదైన టెంపరేచర్.. 41 డిగ్రీలు. నగరంలోని రద్దీగా ఉండే ఇతర నివాస ప్రాంతాలతో పోలిస్తే.. జూబ్లీహిల్స్‌లో పచ్చదనం ఎక్కువగా ఉండటం వల్లే.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ్.

ఒకే నగరంలో 15 డిగ్రీల తేడా..

Advertisement

నార్త్ చెన్నైలోని వాషర్‌మన్ పేట్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతమంతా ఇళ్లతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ బహిరంగ ప్రదేశాలు చాలా తక్కువ. అదే. సెంట్రల్ చెన్నైలోని రోయాపేటలో ఉన్న పీటర్స్ రోడ్‌లోనూ 45 డిగ్రీల టెంపరేచ్ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ. పీటర్స్ రోడ్ తో పోలిస్తే అడయార్ నదికి దగ్గరగా ఉన్న బోట్ క్లబ్ ప్రాంతం చల్లగా ఉంది. ఇక్కడ 37 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఈ ఏరియా చుట్టుపక్కల విశాలమైన ప్లాట్లు, రోడ్ల పక్కన చెట్లు ఉన్నాయి. చెన్నైలో రద్దీగా ఉండే నివాస ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయ్. అందుకే.. ఈ ప్రాంతం కాస్త చల్లగా ఉంది. ఢిల్లీలోని నజఫ్‌గఢ్-ధన్సా రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలుగా నమోదైంది. ఇక్కడ.. రాజస్థాన్ నుంచి వచ్చే వేడిగాలుల ప్రభావం ఉంటుంది. ఇక్క.. చెట్లు పెద్దగా లేకపోవడంతో.. సూర్య కిరణాలు నేరుగా నేలని తాకడం వల్ల టెంపరేచర్ పెరుగుతోంది. అదే.. సెంట్రల్ దిల్లీలోని అక్బర్ రోడ్ పరిసరాల్లో చెట్లు ఎక్కువగా ఉండటంతో.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు దగ్గరగా ఉన్నాయి.

భవనాల మధ్య భగ్గుమనే వేడి..

అహ్మదాబాద్‌లోని జనాలు అధికంగా ఉండే ప్రాంతం దరియాపూర్. ఇక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ ఇరుకైన వీధులు, పక్క పక్కనే ఇళ్లతో నిండి ఉంటుంది. ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువ. జనంతో రద్దీగా ఉండే మణినగర్‌లోనూ పగటి ఉష్ణోగ్రత 48 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. అదే.. అహ్మదాబాద్‌ ఐఐఎం క్యాంపస్ చుట్టుపక్కల 43 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే ఉంది. ఇక్కడ.. భారీగా చెట్లు ఉండటం, ఖాళీ ప్రదేశాలు ఉండటంతో.. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయ్. ఇక.. ముంబై ధారావిలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలుగా ఉన్నాయ్. బొరివాలి చుట్టు పక్కల టెంపరేచర్ 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. జనంతో రద్దీగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ. సౌత్ ముంబైలోని మలబార్ హిల్ చుట్టుపక్కల చెట్లు, ఖాళీ ప్రదేశాలున్నాయ్. దీంతో.. అక్కడ టెంపరేచర్ 37 డిగ్రీలకు దగ్గరగా ఉంది.

ఎండల ఎఫెక్ట్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. తీవ్ర చికాకుని తెప్పిస్తున్నాయ్. అధిక ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకునే స్థాయిని ఎప్పుడో దాటిపోయాయ్. దీనివల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎండలో పనిచేసే కార్మికులు, డెలివరీ బాయ్స్, వృద్ధులు, పిల్లలు బలైపోతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం వల్ల శరీరానికి కోలుకునే సమయం దొరకడం లేదు. నగరాల్లో వేడి పెరిగేకొద్దీ ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. ఇది పవర్ గ్రిడ్‌లపై తీవ్ర ఒత్తిడిని పెంచి, కరెంట్ కోతలకు దారితీస్తోంది. పైగా ఏసీల నుంచి వెలువడే వేడి గాలి నగరాన్ని మరింత వేడెక్కిస్తోంది.

నగరాల వేడి వెనుక నగరీకరణ కథ

గత 20 ఏళ్లలో భారతీయ నగరాలు వేగంగా విస్తరించాయ్. నగరాల్లో నిర్మాణాలు పెరిగాయి. అనేక ప్రాంతాల్లో పచ్చదనం మాయమైంది. వ్యవసాయ భూములు తగ్గిపోయాయి. ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలు అస్సలు కనిపించడం లేదు. అడవులు, పొలాలు, నీటి వనరులతో పోలిస్తే.. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతుల నుంచి వేడి ఎక్కువగా వస్తుంది. అందుకే నగరాల చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల కంటే.. నగరాల్లోనే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. దీనినే.. అర్బన్ హీట్ ఐలాండ్ అంటున్నారు. 2003 నుంచి 2020 మధ్య భారతీయ నగరాలు దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కాయి. ఈ కాలంలో 30 శాతం నగరీకరణ జరగడం వల్ల.. ఈ వేడి పెరిగిందని 2024లో నేచర్ సిటీస్ రీసెర్చ్‌లో తేలింది.

పెరుగుతున్న అర్బన్ హీట్ సవాళ్లు

హైదరాబాద్‌లో గడిచిన 2 దశాబ్దాల్లో.. ఇళ్లు, దుకాణాలు, కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్ల నిర్మాణం అధికంగా సాగింది. 2000 సంవత్సరం నాటికి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే నిర్మాణాలు సాగాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు.. హైదరాబాద్ తన పాత సరిహద్దులను దాటి విస్తరించింది. ఈస్ట్‌లో చర్లపల్లి దమ్మాయిగూడ చుట్టుపక్కల ప్రాంతాలతో సహా.. హైదరాబాద్-వరంగల్ హైవే వెంట నిర్మాణాలు ఊపందుకున్నాయ్.

పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు

అదేవిధంగా.. నార్త్ హైదరాబాద్ ప్రాంతంలోనూ కొంపల్లి, నిజాంపేట చుట్టూ విస్తరణ కనిపిస్తోంది. వెస్ట్ సైడ్.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, నార్సింగి, కోకాపేట వరకు నగరం విస్తరించింది. కొద్దిరోజుల క్రితం దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన హీట్ వేవ్స్ ప్రభావంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనూ కొన్ని రోజులు చాలా వేడి వాతావరణం కనిపించింది. గత ఐదు నెలల్లోనే హైదరాబాద్ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి దగ్గరగా నమోదైనట్లు ఐఎండీ గ్రిడ్ డేటాసెట్ తెలిపింది. సాధారణం అంటే.. ఐఎండీ ఉపయోగించే 1991 టు 2020 మధ్య 30 సంవత్సరాల రిఫరెన్స్ కాలం.

అత్యంత వేడిగా నమోదైన రోజు

దీన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్ లెక్కించడానికి వాడతారు. ఈ లెక్కన.. గత మే నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణ స్థాయి 41 డిగ్రీల సెల్సియస్‌కు చాలా దగ్గరగా ఉంది. అయినప్పటికీ.. ఇది 2024, 2025 మే నెలలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈసారి హైదరాబాద్‌లో అత్యంత వేడిగా ఉన్న రోజు మే 21న నమోదైంది. ఐఎండీ గ్రిడ్ డేటా ప్రకారం, ఆ రోజు హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 43 డిగ్రీలుగా నమోదైంది. ఇది.. సాధారణ స్థాయి కంటే రెండు డిగ్రీలు ఎక్కువ.

ఎండల హెచ్చరిక..

పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు అనేక హెచ్చరికల్ని పంపుతున్నాయ్. తీవ్రమైన ఎండల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరాలకు నీరందించే జలాశయాల్లో నీరు వేగంగా ఆవిరైపోతోంది. రాబోయే రోజుల్లో నగరాల్లో తాగునీటి కోసం అష్టకష్టాలు పడాలనే హెచ్చరికని.. ఈ వేసవి తాపం స్పష్టం చేస్తోంది. తీవ్రమైన ఎండలతో.. మధ్యాహ్న వేళ జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. నిర్మాణ రంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. లేబర్ ప్రొడక్టివిటీ పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ప్రకృతి ఇస్తున్న చివరి హెచ్చరిక!

ఉష్ణోగ్రతలు తగ్గడానికి.. నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థలంలో దట్టమైన చిన్న అడవులను పెంచాలి. చెట్లని.. నగర ప్రణాళికలో భాగం చేయాలి. నగరాల్లోని చెరువులు, కుంటలను కాపాడుకోవాలి. వర్షపు నీటి నిల్వ గుంతలను తప్పనిసరి చేయాలి. సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా, వేడిని తక్కువ గ్రహించేలా భవనాల నిర్మాణ శైలిని మార్చుకోవాలి. భారతీయ నగరాల్లో నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. ప్రకృతి మనకు ఇస్తున్న లాస్ట్ వార్నింగ్‌గానే భావించాలి.

గ్రీన్ సిటీనా..? హీట్ సిటీనా..?

కాంక్రీట్ కట్టడాల విస్తరణే అభివృద్ధి అనుకుంటే, భవిష్యత్తులో మన నగరాలు నివసించడానికి వీలులేని హీట్ స్పాట్స్‌గా మారిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులతో పాటు పౌరులుగా మనం మేల్కొని.. నగరాలను గ్రీన్ సిటీస్‌గా మార్చకపోతే.. భవిష్యత్తులో వేసవి కాలం కూడా ఓ విపత్తుగా మారిపోవడం ఖాయం అంటున్నారు పర్యావరణవేత్తలు.

Also Read: బీజేపీ లేకపోతే తెలంగాణే లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఢిల్లీలో ఎన్డీయే కూటమి గర్జన!

Story by: Anup, Big Tv

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×