BigTV English

Trump 2.0: ట్రంప్ 2.0 బిట్ కాయిన్, H1B వీసా పై నిర్ణయం ఇదేనా..!

Trump 2.0: ట్రంప్ 2.0 బిట్ కాయిన్, H1B వీసా పై నిర్ణయం ఇదేనా..!

Trump 2.0: అగ్రరాజ్యంలో ట్రంప్ శకం మొదలైపోయింది. ఈసారి.. అంతకుమించి అనేలా ట్రంప్ పాలన ఉండబోతోందనే అంచనాలు నెలకొన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటున్న ట్రంప్.. అందుకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతారా? మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం.. ట్రంప్ తరమవుతుందా? అసలు.. భారత్, చైనాకి ఎందుకొస్తానంటున్నాడు. రాబోయే నాలుగేళ్లలో డొనాల్డ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?


అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ పాలన

అమెరికాలో కొత్త రాజకీయ శకం మొదలైంది. రెండోసారి ప్రెసిడెంట్‌గా.. ట్రంప్ వచ్చేశాడు. అప్పుడు.. ఇప్పుడూ.. ట్రంప్ స్లోగన్ ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటున్నాడు. ఈసారి మామూలుగా ఉండదనే సంకేతాలిస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చిన ట్రంప్.. తన పాలనా అంశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఈ 2.0 సర్కార్‌లో.. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై.. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయ్. ఇప్పటికే.. తన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై.. విక్టరీ ర్యాలీ స్పీచ్‌లో ట్రంప్ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు.


అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతారా?

చూశారుగా.. అమెరికాను సేఫ్‌గా మార్చేస్తానంటున్నాడు ట్రంప్. వలసలపై దూకుడుగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామని.. ఇకపై మన సంపదను మనమే అనుభవిస్తామని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపేందుకు అమెరికా చరిత్రలోనే.. భారీ కార్యక్రమం మొదలుపెట్టబోతోంది ట్రంప్ సర్కార్. మన దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుబోతున్నామన్న ట్రంప్.. అమెరికన్ల బలం, గర్వం, శ్రేయస్సు, గౌరవంతో.. సరికొత్త శకాన్ని ప్రారంభించబోతున్నామనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీదే.. అంతటా చర్చ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తామని మరోసారి డొనాల్డ్ స్పష్టం చేశారు.

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ

అంతేకాదు.. జాన్‌ ఎఫ్‌ కెనడీ, రాబర్ట్ ఎఫ్‌ కెనడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్ జూనియర్‌ హత్య కేసు ఫైళ్లను సైతం బహిర్గతం చేస్తానంటున్నారు ట్రంప్. ప్రభుత్వంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు పనిచేస్తానన్నారు. ముఖ్యంగా.. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంతో పాటు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతానన్నారు. జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఏవీ అమలుకాకుండా చూస్తానంటున్నారు ట్రంప్. అమెరికా ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేకుండా.. టిక్‌టాక్‌లో 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా రూల్ తెస్తామని.. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్ టాక్ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయొచ్చనే టాక్

తన పాలనలో దూకుడు చూపించేందుకు.. ట్రంప్ వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయొచ్చనే ఊహాగానాలున్నాయి. ఫెడరల్ ఏజెన్సీలకు జారీ చేసే ఆదేశాలతో పాటు వలసలు, సరిహద్దు విధానం, వాతావరణ మార్పులపై చర్యలు, ఇంధనం, క్రిప్టో కరెన్సీ లాంటి అనేక అంశాలను.. ట్రంప్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. వీటికి సంబంధించిన ఆదేశాలకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. అందువల్ల.. వాటిని రద్దు చేయడం, తొలగించడం, ఆపేయడం లాంటి వాటిపై.. ట్రంప్ సోలోగా డెసిషన్ తీసుకునే చాన్స్ ఉంది.

బైడెన్ పాలనలోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లని రద్దు చేసే చాన్స్

ఇక బైడెన్ పాలనలో ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లని కూడా ట్రంప్ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. ఏఐ ప్రోగ్రామ్‌లని పెంచడం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ఏర్పాటు చేయడం, ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్‌ని రూపకల్పనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఇక.. అమెరికా క్యాపిటల్‌పై దాడి చేసి.. దోషులుగా తేలిన వారిని క్షమించి విడుదల చేయిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ట్రంప్.. భారత్, చైనాకి ఎందుకొస్తానంటున్నాడు?

అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇలాగే సుంకాలు విధించారు. అయితే.. ఈసారి అన్ని దిగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తామని.. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటిపై 25 శాతం, చెనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 60 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. పన్నులు పెంచడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ తమ ఉత్పత్తులపై పన్నులు పెంచితే.. తాము కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు పెంచాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి.

భారత్-అమెరికా మధ్య రక్షణ సంబంధాలపై చర్చ

అగ్రరాజ్యంలో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ.. దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఎంతో కొంత ఉంటుంది. అలా.. ఇండియాపైనా కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో.. భారత్-అమెరికా మధ్య రక్షణ సంబంధాలపై చర్చ మొదలైంది. ఫైటర్ జెట్ ఇంజిన్ల ఉత్పత్తితో పాటు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ పైనే అందరి దృష్టి ఉంది. అంతేకాదు.. 3 నెలల్లోపు కీలకమైన ఒప్పందాలను ముగించడం కూడా ఇప్పుడు కీలకంగా మారింది.

114 మీడియం రోల్ ఫైటర్ జెట్‌లు, 80 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్‌లు

114 మీడియం రోల్ ఫైటర్ జెట్‌లు, 80 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల లాంటి పెద్ద కొనుగోళ్లు కూడా లైన్‌లో ఉన్నాయి. ఈ విషయంలో భారత్-అమెరికా ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు.. కొన్ని అధిక విలువైన ఇండో-యూఎస్ ఒప్పందాలు కూడా కీలకమైన స్థితికి చేరుకున్నాయి. వీటిన్నింటిపై.. ట్రంప్ సర్కార్ ఏవిధంగా ముందుకెళ్లబోతోందనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, భారత్‌లో ఫైటర్ ఇంజిన్ ఉత్పత్తులు.. బిగ్ ఛాలెంజ్‌గా కనిపిస్తున్నాయి.

భారత్, చైనాలో పర్యటనకు సిద్ధమవుతున్న ట్రంప్

ఇప్పటికే.. ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే.. భారత్‌తో పాటు చైనాలోనూ పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని.. తన టీమ్‌కి చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు.. భారత్-అమెరికా మధ్య పటిష్టమైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. రక్షణ సంబంధిత అంశాల్లో పరస్పర సహకారంతో పాటు ఆధునిక ఆయుధాల ఉత్పత్తిలోనూ కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపైనా చర్చ జరుగుతోంది. కొద్ది నెలల్లో వైట్‌హౌజ్‌లో జరిగే దేశాధినేతల సమావేశానికి.. భారత ప్రధాని మోదీని.. ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ గానీ, ఆగస్ట్‌లో గానీ భారత్‌లో ట్రంప్ పర్యటన

ఈ సమావేశం తర్వాతే.. ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. వైట్ హౌజ్ సమావేశంలో దేశాధినేతల చర్చలు సఫలమైతే.. ఏప్రిల్‌లో గానీ ఆగస్ట్ తర్వాత గానీ డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు.. క్వాడ్ దేశాలు ఈసారి భారత్‌లోనే సమావేశం కానున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్న ఈ క్వాడ్ మీటింగ్‌ నిర్వహణకి.. భారత్ సిద్ధంగా ఉంది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు హాజరుకానున్నారు. ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ కూడా సమావేశానికి హాజరవుతారా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై ఆలోచన

మరోవైపు.. చైనాలోనూ ట్రంప్ పర్యటించాలనుకుంటున్నారు. ఆ దేశంతోనూ.. ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. అమెరికాలో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రాబోయే రోజుల్లో.. చైనా విషయంలో ట్రంప్ విధానం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు.. భారత్ విషయంలోనూ ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి

ఎందుకంటే.. ట్రంప్ చర్యలు అనూహ్యంగా ఉంటాయ్. అతన్ని ముందే అంచనా వేయలేం. అంతేకాదు.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ.. ప్రపంచం చాలా మారిపోయింది. ఆయన ముందు అనేక కొత్త సవాళ్లున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై అనేక విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయ్. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై.. భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా-చైనా సంబంధాల్లో ఎలాంటి మార్పులు రావొచ్చు? అనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

పశ్చిమాసియాలో ట్రంప్ శాంతిని నెలకొల్పుతారా?

ఇక.. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రంప్ చెబుతున్న డైలాగులు కూడా వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇజ్రెయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. పశ్చిమాసియాలో ఎంతవరకు శాంతిని నెలకొల్పుతుంది? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. తాను అధికార పగ్గాలు చేపట్టగానే.. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పడేలా చేస్తానని ట్రంప్ చెప్పారు. అందుకు ఆరు నెలల టైమ్ పట్టొచ్చన్నారు. వార్ విషయంలో.. ట్రంప్ వ్యూహం ఏంటి? ఏం చేస్తారు? అనే దానిపై స్పష్టత లేదు.

వెనుజులాపై మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం

ఇక.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి తెచ్చిన ఘనతను తన ఖాతాల్లో వేసుకున్నారు ట్రంప్. మరోవైపు.. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల లిస్టులో నుంచి క్యూబాను తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంది. వెనిజులాపై మళ్లీ ఆంక్షలు విధించే చాన్స్ ఉంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ రెండు దేశాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చంటున్నారు.

ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే చర్చ

డెన్మార్క్‌లో భాగమై.. స్వతంత్ర ప్రతిపత్తిలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారా? అనేది.. ఈ టర్మ్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఇప్పటికే.. అక్కడ అమెరికన్ సైనిక స్థావరం ఉంది. మరీ ముఖ్యంగా.. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ.. ట్రంప్ ప్రణాళికలు ఏవీ.. ఆచరణాత్మకంగా కనిపించడం లేదు. కానీ.. ట్రంప్ 2.0 గవర్నమెంట్‌లో.. డొనాల్డ్ పాలన ఎలా ఉండబోతోంది? ఆయన తీసుకోబోయే నిర్ణయాలు.. ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై గ్లోబ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×