Vangaveeti Radha: వైసీపీకి ఇప్పుడు సమర్ధులైన లీడర్లు కరువయ్యారు. ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లు చాలామంది బయట కనిపించడం లేదు. ఉన్న నాయకుల్లో కొంతమంది పార్టీని వీడడంతో పాటు కొత్తగా వచ్చేవారు పెద్దగా కనిపించకపోవడంతో వైసీపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిందంట. సామాజికవర్గాల వారీగా బలపడడానికి పావులు కదుపుతోందంట. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎందరో నాయకులకు టచ్‌లోకి వెళ్ళినట్లు సమాచారం. వంగవీటి రాధాని కూడా మళ్లీ ఆహ్వానించారంట. అయితే ఆయన వైసీపీలో చేరికకు సుముఖత చూపించలేదంట.
ఓటమి తర్వాత వైసీపీకి పలువురు నేతలు గుడ్‌బై చెప్పేశారు. పలువురు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో సామాజికవర్గాలు లెక్కలు వేసుకుంటున్న వైసీపీ పెద్దలు చేరికలపై ఫోకస్ పెడుతున్నారంట. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులకు, పదవులు ఆశించి రాని వారికి భవిష్యత్‌లో పదవులు ఆశచూపడంతో పాటు ఆశించిన సీటు కేటాయించడానికి సిద్దమయ్యారంట. ఆ దిశంగా ఇప్పటికే కొందరు నాయకులకు టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.
పిఠాపురం సీటు పవన్‌కళ్యాణ్‌కు కేటాయించడంతో.. అక్కడ తెలుగుదేశం బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు అన్యాయం జరిగిందని, తర్వాత కూడా పదవుల విషయంలో న్యాయం జరగలేదని ఈ విషయంలో వర్మ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. వైసీపీ సీనియర్ నేతలు వర్మకు టచ్‌లోకి వెళ్ళి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ప్రతిపాదన పెడితే ఆయన ఒప్పుకోలేదని, తెలుగుదేశంలోనే కొనసాగుతానని వైసీపీ నేతలకు ముఖంమీదే చెప్పారంట.
ఇప్పటికే కాపు ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ వెంట ఉండడంతో.. తమకు కనీసం ఓట్లను రాబట్టగల నేత కోసం వైసీపీ అధిష్టానం వేట ప్రారంభించినట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గత ఎన్నికల ముందు వైసీపీలో చేరినా అసలు ప్రభావం చూపించలేకపోయారు. ఆయన కాపు ప్రతినిధిగా పార్టీలో ఉన్నా లేనట్లేనని భావిస్తున్న వైసీపీ పెద్దలు ప్రత్యామ్నాయ కాపు నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట.
గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధాను వైసీపీలో చేర్చుకోవడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు తీవ్రంగా ప్రయత్నం చేసినా ఆయన టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేసిన రాధా అప్పటి నుండి పార్టీలోనే కొనసాగుతూ గత ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాధాకు సముచిత స్థానం లభిస్తుందని అందరూ భావించారు. ఒక దశలో రాధా అనారోగ్యం పాలైతే టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ స్వయంగా రాధా ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు.
లోకేష్ పరామర్శించి వెళ్లినప్పుడు రాధాకు పదవి విషయంలో కూడా హామీ లభించిందని రాధా వర్గీయులు ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం అధిష్టానం రాధా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బలమైన సామాజికవర్గానికి చెందిన రాధాకు సముచిత పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే కొంత ఆలస్యమైనా సరైన న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Also Read: సిగ్గుందా జగన్! రౌడీలను పరామర్శిస్తావా..?
అయితే ఈ మధ్య కాలంలో రాధా టీడీపీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించకపోవడం.. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు వేదికపై కూడా ఆయన కనిపించకపోవడంతో వైసీపీ మళ్లీ ఆయనతో టచ్‌లోకి వెళ్లిందంట. అయితే వంగవీటి 2019 లో టీడీపీ అధికారం కోల్పోయినప్పుడు కూడా ఎవరెన్ని వత్తిళ్ళు తెచ్చినా తెలుగుదేశంలోనే కొనసాగారు. ఇపుడు పార్టీ అధికారంలో ఉంది. పార్టీ నాయకత్వంతో ముఖ్యంగా లోకేష్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారంట.