YS Jagan Tenali Tour: వైఎస్ జగన్ తెనాలి పర్యటనపై పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. జగన్ పర్యటనను టీడీపీ తప్పుబడుతోంది. క్రిమినల్స్‌ను పరామర్శించడమేంటని ప్రశ్నిస్తోంది. ముగ్గురు యువకుల అరాచకాలకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే.. బాధితులను క్రిమినల్స్‌గా చిత్రీకరిస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ తెనాలిలో ఏం జరగబోతోంది..? ఈ పొలిటికల్ ఫైట్ మరింత కాక రేపుతుందా..?
గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్. నడిరోడ్డుపై ముగ్గురు దళిత యువకులను.. పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారాయన. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని జగన్ ఫైర్ అయ్యారు. బాధితులను పరామర్శించేందుకు తెనాలిలోని ఐతానగర్‌కు వెళ్లారు. అయితే ఈ పర్యటనపై ఇప్పుడు వివాదం మొదలైంది. జగన్ తెనాలి పర్యటనను తీవ్రంగా తప్పుబడుతోంది తెలుగుదేశం పార్టీ. ఆ ముగ్గురు రౌడీషీటర్లు అని.. కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని.. వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆ ముగ్గురు యువకులు.. గతంలో టీడీపీ నేత కుమారుడిని నడిరోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారో చూడండి అంటూ.. ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌ను కూడా టీడీపీ రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ముగ్గురూ క్రిమినల్స్ అని.. బాధితులు కారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి క్రిమినల్స్‌కు వైఎస్ జగన్ మద్దతు ఇస్తున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు.
గుంటూరు జిల్లా.. తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు కూడా నిరసన చేస్తున్నాయి. మార్కెట్ సెంటర్లో నిరసనకు దిగాయి దళిత సంఘాలు. వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించని జగన్.. ఇప్పుడు రౌడీ షీటర్లకు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రతిదానినీ రాజకీయం చేస్తోందని.. పార్టీ ఉనికి కోసం కులాలు, మతాలు అంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని.. టీడీపీ మండిపడుతోంది. వైఎస్ జగన్ పరామర్శించేందుకు వెళ్తున్న ముగ్గురిపై.. ఎన్నో కేసులు ఉన్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. నేరాలు చేసే వారిని పరామర్శించడం ఏంటని.. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలని జగన్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.
టీడీపీ వాదనను వైసీపీ ఖండిస్తోంది. వైఎస్ జగన్ ఐతానగర్‌కు వెళ్లి బాధిత యువకులను పరామర్శిస్తే.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఆరాచకం మరోసారి బయటపడుతుందన్నదే.. టీడీపీ భయమని ఆరోపిస్తోంది. ఆ యువకులు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేసి ఉంటే.. సాక్ష్యాలు ఏవి? అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఇప్పటి వరకు సాక్ష్యాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తోంది.
Also Read: అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్.. రైతుల నిర్ణయం ఏంటి..?
దళిత యువకులపై పోలీసుల దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆ ముగ్గురిపై రౌడీషీట్లు లేవని.. పోలీసులు కొట్టిన వీడియో బయటపడటంతో.. వారిపై అప్పటికప్పుడు రౌడీషీట్ పెట్టారన్నారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని.. ఇకపై ఆ వ్యాపారం చేయబోమని చెప్పడం వల్లే ఇంత దారుణంగా రోడ్డుపైనే కొట్టారన్నారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే.. ఛలో తెనాలికి పిలుపునిస్తామని హెచ్చరించారు.