Ration cards: తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు షాక్ తగలనుందా? నకిలీ కార్డుల ఏరివేత మొదలైందా? ఆరునెలలుగా రేషన్ తీసుకోకుంటే కార్డు పోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ సర్కార్ కార్డు దారులపై ఫోకస్ చేసింది.
రేషన్ కార్డులున్నా నిత్యావసరాలు తీసుకోనివారిపై కొరడా ఝులిపించనుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు లక్షన్నరకు పగానే రేషన్ కార్డులు యాక్టివ్‌గా లేవన్నది కేంద్రం మాట. గడిచిన ఆరునెలలుగా వారంతా రేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయా కార్డుదారులపై విచారణ చేపట్టాలని కేంద్రప్రభుత్వం తెలంగాణ పౌర సరఫరాల శాఖను ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగింది యంత్రాంగం. ఇప్పటివరకు 80 శాతం కార్డులను పరిశీలించారు అధికారులు. మిగతావాటిలో 20 శాతం అనర్హులుగా గుర్తించారు. ఆయా కార్డుదారులపై విచారణ దాదాపుగా పూర్తికానుంది. వాటిని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు అధికారులు పరిశీలించిన రేషన్‌కార్డు వినియోగదారులు కొందరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. మరికొందరు లబ్ధిదారులు మరణించినా ఆయా వివరాలు అప్డేట్ కాలేదు. ఇంకొందరికి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయి. ఆ తరహా లోపాలుండే కార్డులను తొలగించే అవకాశముంది.
ALSO READ: బీఆర్ఎస్ పక్కా ప్లాన్, ప్రభాకర్‌రావు నోరు విప్పితే వాళ్లు జైలుకే
కొందరైతే ఈ-కేవైసీ ఇప్పటికీ పూర్తి చేయలేదని అంటున్నారు. కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు ఏడాది క్రితమే ఈ-కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది కేంద్రం. రాష్ట్రంలో 90 శాతానికిపైగా పూర్తి చేశారు. వినియోగదారులు రేషన్ ఫాపుకి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే వారి పేర్లు EPOS మెషీన్లలో కనిపిస్తాయి.
ఈ-కైవేసీ పూర్తి చేయని వారి పేర్లు ఎరుపు రంగులో దర్శనమిస్తున్నాయి. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటితో కలిసి రేషన్ కార్డుదారులు దాదాపు 92 లక్షలకు చేరింది. లబ్ధిదారులు సైతం పెరిగారు.
ప్రజాపాలన దరఖాస్తులతోపాటు మీ-సేవలో అప్లై చేసిన అప్లికేషన్లు పరిశీలించి అర్హత కలిగినవారికి కొత్త కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం. రుతుపవనాలు ముందుగా రావడంతో కేంద్ర సూచనతో తెలంగాణలో మూడు నెలల రేషన్ కలిపి ఒకేసారి ఇస్తున్నారు. కొత్తగా కార్డులు వచ్చినవారు బియ్యం తీసుకోవచ్చు.