Vijayashanti: కేసీఆర్‌తో కలిసి లోక్‌సభలో మెరిసిన విజయశాంతి మళ్లీ ఇంత కాలం తర్వాత చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అసలంత అనూహ్యంగా రాములమ్మని లక్కీ ఛాన్స్ ఎలా వరించింది? ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆమెను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా కరుణించింది? ఢిల్లీ స్థాయిలో విజయశాంతి లాబీయింగ్ ఎలా వర్కౌట్ అయింది? పార్టీలో అంతమంది ఆశావహుల్ని కాదని ఆమెను ఎంపిక చేయడంపై కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చేంటి?
రాములమ్మకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్
తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో తమకు ఈ పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొంత కాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను శాసనమండలికి పంపించడం వెనక ఉన్న ఆంతర్యమేంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా? లేక విజయశాంతి సొంతంగా లాబీయింగ్ చేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.
2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలుపు
2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ ఇంత కాలానికి చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. 16 ఏళ్ల తర్వాత పొలిటికల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌లో విజయశాంతి ఎమ్మెల్సీ ఎంపిక చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. విజయశాంతికి టికెట్ ఎలా దక్కింది అనే దానిపై నాయకులు చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి.. ఢిల్లీ స్థాయిలో విజయశాంతి ఎలా లాబీయింగ్ చేశారన్నదానిపై నేతల మధ్య పెద్ద డిబేటే నడుస్తోంది.
బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్న విజయశాంతి
కాంగ్రెస్‌లో ఏ నేతను కదిపినావిజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వంపైనే మాట్లాడుతున్నారు. 2023లో కాంగ్రెస్‌లోకి రాకముందు బీజేపీలో ఉన్న విజయశాంతి బీజేపీలోను పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్‌గా పాల్గొనకపోయినా.. అధిష్టానం పెద్దల వద్ద మాత్రం తన చర్మిషా తగ్గకుండా చూసుకున్నారు. బీజేపీలోను తనకు తగిన గుర్తింపు దక్కేలా పావులు కదిపారు. కాంగ్రెస్‌లోకి రాకముందు రాములమ్మకి బీజేపీలో మంచి ప్రాధాన్యతే దక్కింది.
కాంగ్రెస్ లో చేరే ముందే మాట తీసుకున్నారా?
బీజేపీలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన విజయశాంతి.. కాంగ్రెస్‌లోకి వచ్చే ముందుకూడా ఆ పార్టీ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. పార్టీ తీర్ధం తీసుకోకముందే తన మనస్సులో మాట అధిష్టానం పెద్దల ముందు బయటపెట్టి.. వారి నుంచి మాట తీసుకున్నారంట. రాములమ్మ కాంగ్రెస్‌లోకి వచ్చే సమయంలోనే అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మణిక్ రావ్ ఠాక్రేకు ముందు తన డిమాండ్‌లను పెట్టారంట. తనకు చట్టసభలో పదవి కావాలని షరతు పెట్టిన రాములమ్మ. ఆ షరతుకు అంగీకరిస్తేనే పార్టీలోకి వస్తానని చేప్పారట. రాములమ్మ కండిషన్‌కు అధిష్టానం పెద్దలు అప్పట్లోనే అంగీకారం తెలిపారనే టాక్ నడుస్తోంది.
ఢిల్లీలో కేసీ వేణుగాపాల్‌తో చర్చలు జరిపిన రాములమ్మ
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక జరిగే సమయంలో విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీపీ నేత కేసీ వేణుగోపాలతో చర్చలు జరిపిన రాములమ్మ. ఈ సారి ఎమ్మెల్సీ టికెట్ కావాలని తన మనస్సులోని మాట చెప్పారంట. కాంగ్రెస్‌లోకి జాయిన్ అయ్యే సమయంలో హైకమాండ్ పెద్దలు ఇచ్చిన హామీని ఆయన దృష్టికి తీసుకెళ్లారంట. ఇదే సమయంలో ఠాక్రే సైతం విజయశాంతికి ఇచ్చిన హామీని అధిష్ఠానానికి గుర్తు చేశారంటున్నారు.
విజయశాంతికి కలిసి వచ్చిన బీసీ ఈక్వేషన్
ఇదే సమయంలో బీసీ నినాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెడుతుండటం ఆమెకు ప్లస్ అయిందంటున్నారు. రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్.. బీసీ ఈక్వేషన్ కలిస్తోందనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతి వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. ఓవైపు మహిళా కోటా.. మరోవైపు బీసీ కోటా రెండు కలిసోస్తాయనే రాములమ్మకు అవకాశం ఇచ్చారంట.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీభవన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువేనని ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైనా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్‌కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఆమె సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపించారు. కానీ, నాలుగైదు రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్. ఆమెను ఢిల్లీలో చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని టాక్. కానీ, ఉన్నట్టుండి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
బీఆర్ఎస్, బీజేపీలతో పనిచేసిన రాములమ్మ
ఏదేమైనా విజయశాంతి విషయంలో ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఇప్పుడు రాములమ్మపై పార్టీ పెద్దలు పెద్ద బాధ్యతలనే ఉంచారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి పనిచేసిన అనుభవం రాములమ్మకు ఉంది. దీంతో కేసీఆర్‌ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం ఎటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది. మండలిలో బీఆర్ఎస్ వాయిస్ బలంగా ఉంది. అక్కడ అధికార పక్షం తరుపున బలమైన వాయిస్ వినిపించే బాధ్యత విజయశాంతిపై పడిందంటున్నారు.
కేసీఆర్‌ను ఎండగట్టి, బీజేపీని ఎటాక్ చేసే బాధ్యతలు
తెలంగాణ ఉద్యమకారిణిగా.. పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పే యాక్టర్‌గా, రాజకీయంగా అనుభవం ఉన్న విజయశాంతి మండలిలో తన వాయిస్‌ను ఎలా వినిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది… మొత్తమ్మీద రాములమ్మకు ఒక్క ఎమ్మెల్సీ పదవితో సరిపుచ్చుతారా? భవిష్యత్‌లో మరేదైనా పదవి ఇస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.