Telangana Sarpanch Elections: తెలంగాణ ఊళ్లకు.. సర్పంచ్ ఎన్నికల జ్వరం పట్టుకుంది. దాంతో.. ఊళ్లు మొత్తం ఊగిపోతున్నాయ్. ఇప్పుడు.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఏకగ్రీవం హాట్ టాపిక్‌గా మారింది. సర్పంచ్ పోస్టులు.. 20 లక్షల నుంచి కోటి దాకా పలుకుతున్నాయ్. అసలు.. ఏకగ్రీవాల కోసం ఇంతింత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? జనం కూడా అలా.. ఎలా కన్విన్స్ అవుతున్నారు? సర్పంచ్ పదవి అంటే.. లీడర్లకు అంత సోకెందుకు?
సర్పంచ్ ఎన్నికలతో తెలంగాణ గ్రామాల్లో పొలిటికల్ హీట్
ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజైందో.. అప్పటి నుంచి తెలంగాణ ఊళ్లని ఊగిపోతున్నాయ్. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు కొందరు పోటీ పడుతుంటే.. ఇంకొందరు ఏకగ్రీవం చేస్తే ఇన్ని లక్షలిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈసారి అన్ని చోట్లా.. సర్పంచ్ పదవులు ఎంతో ఖరీదైనవిగా మారాయ్. అధికారం కోసం కొన్ని ఊళ్లలో ఎన్ని లక్షలు ఇచ్చేందుకైనా సిద్ధమంటున్నారు. వేలంలో సర్పంచ్ పదవులు 20 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పలుకుతున్నాయ్. రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఏకగ్రీవం అనే మాట గట్టిగా వినిపిస్తోంది.
స్కూల్ బిల్డింగ్‌లు, ఆలయాల అభివృద్ధికి హామీలు
ఈ క్రమంలో.. తెలంగాణలో ఏకగ్రీవం అనే మాట అర్థమే మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయ్. సర్పంచ్ పదవులను బహిరంగంగానే వేలం వేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, స్కూల్ బిల్డింగ్‌లు, పాత ఆలయాల అభివృద్ధి, కొత్త ఆలయాల నిర్మాణం లాంటి హామీలతో.. ఊళ్లలో సర్పంచ్ పదవులకు వేలం నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల సంఘం.. సర్పంచ్ పదవులను వేలం వేయడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నా.. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
తక్కువలో తక్కువ రూ.20 లక్షలకు వేలం..
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయ్. దాంతో.. అక్కడక్కడా డబ్బులిచ్చి ఏకగ్రీవం చేయించుకంటున్న సీన్లు కనిపిస్తున్నాయ్. భూముల విలువ పెరగడం, రోడ్డు బిట్లకు డబుల్ రేట్లు ఉండటం లాంటివన్నీ.. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులని ఖరీదైనవిగా మార్చేశాయ్. తక్కువలో తక్కువ 20 లక్షలకు వేలం వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలంలోని జోగ్గుడెంలో, ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ సీటుకు.. ప్రజల సమక్షంలో వేలం నిర్వహించారు. 5 లక్షలతో మొదలైన వేలం.. 20 లక్షల దాకా వెళ్లింది. గెలిచిన వాళ్లు.. అక్కడికక్కడే 5 లక్షలు చెల్లించేశారు. ఈ డబ్బులతో.. ఊర్లో ఆంజనేయస్వామి గుడి నిర్మిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి వార్తలు.. మిగతా జిల్లాల్లోనూ వినిపిస్తున్నాయ్.
గద్వాల జిల్లాలో ఒక్కరోజే 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 13 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. గట్టు మండలం మిరుదొడ్డిలో.. ఓ నాయకుడు సర్పంచ్ పదవి కోసం 90 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అనంతారం గ్రామంలో సర్పంచ్ పదవి.. వేలంలో 60 లక్షలు పలికింది. చింతలకుంటలో 38 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. మరో గ్రామంలో.. ఓ అభ్యర్థిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసినందుకు గానూ.. ఎకరం భూమి పాఠశాల కోసం ఇస్తానని హామీ ఇచ్చి.. బాండ్ సమర్పించాడు. మల్దకల్ మండలం లోనిపల్లిలో శ్మశానవాటికకు రెండు ఎకరాల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో ఊళ్లో.. ఓ అభ్యర్థి సర్పంచ్ పదవి కోసం కోటి రూపాయల దాకా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలోనూ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది.
ఓ ఊళ్లో 57 లక్షలు, మరో గ్రామంలో 34 లక్షలకు వేలం..
ఇంకొన్ని జిల్లాల్లో.. సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు రెండూ.. ఒక్క ఓటు కూడా లేకుండానే ఖరారు చేసేస్తున్నారు. ఓ ఊళ్లో 57 లక్షలు, మరో గ్రామంలో 34 లక్షలకు సర్పంచ్ పదవులు వేలం వేశారు. గద్వాల్ మండలంలో.. ఓ విత్తన వ్యాపారి కొండపల్లి సర్పంచ్ పదవిని 60 లక్షలకు దక్కించుకున్నారు. కుర్వపల్లి మండలం నల్లదేవునిపల్లిలో.. సర్పంచ్ పదవిని ఓ అభ్యర్థికి 45 లక్షలకు ఏకగ్రీవం చేశారు. అప్పటికప్పుడు 15 లక్షలు చెల్లించారు. మిగతా మొత్తాన్ని.. ఎన్నికల తర్వాత చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయితే.. అన్నిచోట్లా డబ్బుల కోసమే ఏకగ్రీవం చేయడం లేదు. ఇందులో కొన్ని ఊళ్లు.. వేలానికి దూరంగా ఉన్నాయ్. జనగాం జిల్లాలోని మాన్సింగ్ తాండాలో.. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండానే.. సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేవలం.. ఇద్దరు అభ్యర్థులే పోటీకి ఉండటంతో.. కేవలం టాస్ వేసి సర్పంచ్‌ని నిర్ణయించారు. ఏదేమైనా.. మెజారిటీ ఊళ్లలో మాత్రం.. లక్షలు పోసి సర్పంచ్‌లుగా ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఊళ్లలో.. జనమంతా ఓ మాట అనుకొని.. సర్పంచ్ పోస్టుని వేలం వేస్తున్నారు.
ఎంతయినా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్న ఆశావహులు
మరోవైపు.. అభివృద్ధి పనుల కోసమంటూ జనం కూడా ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆశావహులు కూడా ఎంతయినా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామ ఉమ్మడి అవసరాలను తీర్చేందుకు ముందుకు వస్తుండగా.. మరికొన్ని చోట్ల గ్రామస్తులే అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తారని బేరాసారాలు చేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో 50 లక్షల నుంచి 60 లక్షలు ఇచ్చేందుకు కూడా ఆశావహులు వెనుకాడడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాలయ్యపల్లిలో పంచాయతీ భవనం నిర్మాణానికి.. 5 గుంటల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా.. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇంకొన్ని గ్రామాల్లో.. ఆలయాల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చినవారిని ఏకగ్రీవం చేశారు. అయితే.. పంచాయతీ ఎన్నికల్లో వేలం పాటలు, బేరసారాలు, బెదిరింపుల లాంటి ప్రలోభాలతో జరిగే ఏకగ్రీవాలు చెల్లవని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు.. ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ని గుర్తు చేస్తున్నారు.
అక్రమాలు జరిగినట్లు తేలితే ఏకగ్రీవ ఎన్నిక రద్దు..
ఈసారి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వెంటనే.. రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితాన్ని ప్రకటించకుండా హోల్డ్‌లో పెట్టనున్నారు. తర్వాత.. ఆఫీసర్లు గ్రామానికి వెళ్లి ఏకగ్రీవ ఎన్నిక మోసపూరితంగా జరిగిందా? ప్రలోభాలకు లోను చేశారా? బలవంతంగా ఒప్పుకున్నారా? అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఒకవేళ.. వేలం పాటలు జరిగినట్లు, ప్రలోభాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు దొరికితే.. ఆ గ్రామ ఫలితాన్ని ఆపేస్తారు. దానిపై.. 24 గంటల్లో ఎంక్వైరీ చేసి.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఆ గ్రామ ఎన్నికను రద్దు చేయాలని కలెక్టర్.. ఎన్నికల సంఘానికి సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడితే.. పదవి దక్కకపోగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.
20 అంటే 20 ఇస్తున్నారు.. 50 అంటే 50 ఇస్తున్నారు.. కొన్ని చోట్ల కోటి ఇచ్చేందుకు కూడా పోటీ నెలకొంది. ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు.. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జనం ఊరు అభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు చేస్తున్నారా? లేక.. ఒకేసారి డబ్బులు ఎక్కువొస్తున్నాయని చూస్తున్నారా? అభ్యర్థులు ఇప్పుడు ఎన్ని లక్షలైనా ఇస్తారు సరే.. తర్వాత ఐదేళ్ల పాటు మిమ్మల్ని పట్టించుకుంటారా? ఊరుని అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు ఏకగ్రీవం కోసం పెట్టిన ఖర్చుని.. మళ్లీ రికవరీ చేసే ఆలోచనతో ఉంటే.. పరిస్థితేంటి?
ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రశ్నిస్తున్న సర్పంచ్ పదవుల వేలం..
తెలంగాణలో సర్పంచ్ అనే పదంతో పాటు ఎక్కువగా వినిపిస్తున్న మరో పదం ఏకగ్రీవం. పంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్న వేళ.. కొన్ని చోట్ల సర్పంచ్ పదవులకు వేలం వేస్తున్న పరిణామాలు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయ్. గ్రామాల అభివృద్ధి లక్ష్యాలపై సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయ్. సాధారణంగా.. ఎక్కడ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసినా.. ఒకే ఒక్క వాదన గట్టిగా వినిపిస్తుంది. అదే.. అభివృద్ది మంత్రం. ఊరికోసమే ఇలా చేశామని చెబుతుంటారు. దాంతోపాటు.. ఎన్నికలంటే గ్రామంలో పోటీ, వ్యక్తిగత కక్షలు, విభేదాలు పెరుగుతాయ్. ఏకగ్రీవమైతే.. గ్రామంలో శాంతి, సామరస్యం నెలకొని.. అంతా కలిసి అభివృద్ధికి కృషి చేస్తారంటారు. ఎన్నికల్లో పోటీ పడితే అభ్యర్థులు లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తారు. ఏకగ్రీవం చేయడం వల్ల.. ఆ ఖర్చుని ఆదా చేసి.. ఆ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిదని.. ఏకగ్రీవం అనే చర్చ తెరమీదికొస్తుంటుంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రాపంచాయతీలకు కొంత ఆర్థిక ప్రోత్సాహాలు ఇస్తుంటాయ్. వీటి కోసం కూడా గ్రామస్తులు ఏకగ్రీవానికి మొగ్గు చూపుతారు. ఇప్పుడు కూడా కొందరు అభ్యర్థులు ఇచ్చే లక్షల రూపాయలను.. నేరుగా గ్రామాభివృద్ధి పనులకు, ఆలయాలు, పాఠశాల భవనాలకు ఉపయోగిస్తామని చెబుతున్నారు. అయితే.. ఇదంతా అభివృద్ధి కోసం విరాళమని వాదిస్తున్నారు. కానీ.. సర్పంచ్ పదవికి వేలం వేయడమనేది.. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయ్.
ఐదేళ్ల పాటు ప్రజల్ని పట్టించుకుంటారా? ఊరు అభివృద్ధి చేస్తారా?
అభ్యర్థులు ఇప్పుడు ఎన్ని లక్షలైనా ఇస్తారు. కానీ.. తర్వాత ఐదేళ్ల పాటు గ్రామ ప్రజల్ని పట్టించుకుంటారా? ఊరుని అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు ఏకగ్రీవం కోసం పెట్టిన ఖర్చుని.. మళ్లీ రికవరీ చేసే ఆలోచనతో ఉంటే.. పరిస్థితేంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. సర్పంచ్ పదవికి లక్షలు ఖర్చు పెట్టేవారిలో.. చాలా మంది దానినొక పెట్టుబడిగానే చూస్తారు. ఒక్కసారి సర్పంచ్ అయితే.. రాబోయే ఐదేళ్లలో ఆ డబ్బుని తిరిగి రాబట్టుకునేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఐదేళ్లూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే ఉపాధి హామీ నిధులు, పారిశుద్ధ నిధులు, ఇతర అభివృద్ధి పనులకు మంజూరయ్యే నిధులను.. కాంట్రాక్టుల రూపంలోనూ, బిల్లుల రూపంలోనూ స్వాహా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడే పరిస్థితులుంటాయ్.
ఖర్చుని తిరిగి రాబట్టుకోవటం మీదే దృష్టి పెడితే?
అందువల్ల.. ఏకగ్రీవం కోసం డబ్బులిచ్చే అభ్యర్థులు.. సర్పంచ్ పదవి పొందాక.. అధికారం చేతిలోకి వచ్చాక.. తమ ఖర్చుని తిరిగి రాబట్టుకోవడం మీదే దృష్టి పెడితే.. ఊరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంటుదనే చర్చ అక్కడక్కడా వినిపిస్తోంది. సర్కారు నుంచి గ్రామానికి వచ్చే నిధులు.. సర్పంచ్ ఖాతాలోకి మళ్లితే.. గ్రామంలో జరగాల్సిన ఎలాంటి అభివృద్ధి పనులు జరగవు. వేలం పాటలో పదవి దక్కించుకొని.. ఊరుకు డబ్బులు సమర్పించుకున్న వాళ్లంతా.. జవాబుదారీతనంతో ఉండకపోవచ్చు. ఎందుకంటే.. వాళ్లు ఎన్నికైంది.. ఓట్లతో కాదు. డబ్బులతో!
ప్రజల తీర్పు, నాయకత్వ లక్షణాలు, సేవా భావమే ప్రధానం కావాలి!
సర్పంచ్ ఎన్నిక అంటే.. గ్రామ నాయకుడిని ఎంచుకోవడం. ఇక్కడ.. ప్రజల తీర్పు, నాయకత్వ లక్షణాలు, సేవా భావమే.. ప్రధానం కావాలి. అలాకాకుండా.. డబ్బు ప్రామాణికం అయినప్పుడు.. నిజమైన సేవాభావం కలిగి ఉన్న పేద, మధ్యతరగతి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కోల్పోతారు. లక్షలు ఖర్చు పెట్టగలిగిన వారే నాయకుడు అవుతారు. సమర్థవంతంగా పరపాలించే సామర్థ్యం ఉన్నవాళ్లు కూడా ఊరుకొని ఊళ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు.. గెలిచేది ప్రజాస్వామ్యం కాదు. డబ్బు మాత్రమే. ఇది.. గ్రామీణ స్థాయిలో పాలనా వ్యవస్థను దెబ్బతీస్తుంది. సర్పంచ్ పదవికి లక్షలు ఇస్తామనడం వెనుక.. గ్రామాభివృద్ధి, ఆలయాలు, స్కూళ్ల, ఇతర భవనాల నిర్మాణం లాంటివన్నీ కాస్త సానుకూలంగానే కనిపించినా.. దాని వెనక రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ నిధులు, పరోక్షంగా ఇచ్చిన డబ్బుని తిరిగి రాబట్టుకోవడం లాంటి ఆలోచనలుంటాయనే చర్చ కూడా జరుగుతోంది. ఒక్కసారి వేలం పాటలో పదవి దక్కించుకొని.. ఆ నాయకుడు సర్పంచ్‌గా ఎన్నికైతే.. వచ్చే ఐదేళ్లలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారా? లేదా? అనేది అనుమానమే.
Also Read: రాజధాని రైతులకు అండగా చంద్రబాబు
ఎప్పుడైతే.. డబ్బులిచ్చి అధికారం కొనుగోలు చేస్తారో.. అది క్రమంగా గ్రామీణ పాలనలో అవినీతిని పెంచి, ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరుస్తుంది. గ్రామస్తులు తాత్కాలికంగా డబ్బుతో గానీ, అభివృద్ధి పేరుతో గానీ ప్రలోభాలకు గురై ఏకగ్రీవం చేస్తే.. తర్వాత ఐదేళ్ల పాటు ఊళ్లో అభివృద్ధి జరగకపోతే పరోక్షంగా నష్టపోయేది తామేనన్న విషయం గుర్తుంచుకోవాలి. అందువల్ల.. మీరు ఏకగ్రీవం చేయాలనుకున్న అభ్యర్థి ఇచ్చే డబ్బులనే కాదు.. అతని గుణగణాలు, నిబద్ధత, నాయకత్వ లక్షణాలను కూడా చూడండి. కేవలం.. ఊరుకు ఎక్కువ డబ్బులిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో.. గుడ్డిగా ఏకగ్రీవం చేయడం ఊరు భవిష్యత్‌కు అంత మంచిది కాదంటున్నారు. అంతేకాదు.. గ్రామ పంచాయతీల ఏకగ్రీవం కోసం వేలం పాటలు వేయడమనేది.. నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల కమిషన్ ఇలాంటి ఏకగ్రీవాలపై విచారణ జరిపి.. ఆధారాలు దొరికితే ఏకగ్రీవాలను రద్దు చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Story By Anup, Bigtv