volcano Blast Effect: ఇథియోపియాలో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైంది. అది.. ప్రపంచవ్యాప్తంగా ఒకరకమైన ఆందోళనని సృష్టించింది. దాని గురించి టెన్షన్ పడుతున్న దేశాల్లో.. ఇండియా కూడా ఉంది. ఎందుకంటే.. అక్కడ అగ్నిపర్వతం పేలితే.. దాని తాలూకు బూడిద ఇక్కడిదాకా వచ్చేసింది. ఇండియా మీదుగా ట్రావెల్ చేస్తోంది. అసలు.. అక్కడి బూడిద ఇక్కడికి ఎలా వచ్చింది? విమానాలు కూడా ఆగిపోయేలా.. ఇంత పెద్ద బూడిద మేఘం ఎలా ఏర్పడింది?
12 వేల సంవత్సరాల తర్వాత పేలిన అగ్నిపర్వతం..
ఇథియోపియా అపార్ రీజియన్‌లో అకస్మాత్తుగా పేలిన అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. 500 మీటర్ల ఎత్తులో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం.. 12 వేల సంవత్సరాల తర్వాత పేలింది. ఈ విస్ఫోటనం అసాధారణ పరిణామాలను సృష్టించింది. అగ్నిపర్వతం బద్దలయ్యాక.. 45 వేల అడుగుల ఎత్తులో భారీ బూడిద మేఘం ఏర్పడింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత భారీ శబ్దం వినిపించిందని సమీపంలో ఉన్న ప్రజలు తెలిపారు. సమీప గ్రామాల్లో దుమ్ముధూళి ఓ పొర మాదిరిగా కమ్మేసింది. ఈ భారీ యాష్ క్లౌడ్స్.. ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వాతావరణంలో బాగా వ్యాపించాయి. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు కదిలింది. అగ్నిపర్వతం తాలూకూ బూడిద మేఘం.. ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్థాన్, భారత్‌లోని కొన్ని రాష్ట్రాల మీదుగా కదులుతూ వెళ్లింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మీదుగా బూడిద మేఘం తరలిపోయింది. ఈ యాష్ క్లౌడ్స్ చివరికి హిమాలయాలని దాటుకుంటూ.. చైనా వైపు పయనించాయ్. బూడిద మేఘం ప్రభావంతో.. ఆకాశం మామూలు కంటే మసకగా మారిపోయింది. ఇది.. ఉత్తర భారతంలో గాలి నాణ్యతని ఎంతో ప్రభావితం చేసింది.
ఆకాశమార్గంలో పొగ వ్యాప్తితో విమానాల రాకపోకలకు అంతరాయం..
అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు.. అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. దాంతో.. ఈ బూడిద మేఘం ఏర్పడుతుంది. ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, చిన్న రాతి, గాజు ముక్కలు, రాక్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఆకాశాన్ని సాధారణం కంటే ఎక్కువ చీకటిగా చేసి, ఎయిర్ ట్రాఫిక్‌ని ప్రభావితం అగ్నిపర్వతం బూడిద, దుమ్ము కణాలు భారత్‌ని చేరాక.. ఆకాశమార్గంలో పెద్దఎత్తున పొగ వ్యాపించి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో.. కేంద్ర విమానయాన శాఖ వెంటనే అప్రమత్తమై.. ఆ మార్గంలో ప్రయాణించే విమానాలను రద్దు చేసింది. అయితే.. ఈ అగ్నిపర్వతం బూడిద.. భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసే అవకాశాలు లేవని ఐఏండీ తెలిపింది. భూమికి.. 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తున వెళ్తున్నందున గాలి నాణ్యతకు అధిక హాని ఏర్పడే అవకాశాలు లేవంటున్నారు. అయితే.. ఉష్ణోగ్రతలు క్షీణించి.. ఆకాశం మబ్బుగా మారింది.
1980లో బూడిద మేఘంతో విమానాలకు సమస్య
ఈ యాష్ క్లౌడ్స్‌లో నుంచి విమానాలు వెళ్లాల్సి వస్తే.. వాటి ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణ ధూళి కణాల మాదిరిగా కాకుండా, అగ్నిపర్వతం బూడిద ఎంతో కఠినమైన, రాపిడి కలిగించే కణాలను కలిగి ఉంటుంది. ఇది విమానాలకు తీవ్రమైన ముప్పు. 1980ల్లో రెండుసార్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయ్. ఇండోనేషియాలోని అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద మేఘంతో.. కమర్షియల్ విమానాలకు సమస్య ఎదురైంది. ముందస్తు సమాచారం లేక.. విమానాలు ఆ ప్రమాదకర మేఘాల మధ్యలో నుంచి ప్రయాణించడంతో ఇంజిన్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఆ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అగ్నిపర్వతం బూడిదలో ఉండే గాజు, రాతి కణాలు.. విమాన ఇంజిన్‌లోకి ప్రవేశించినప్పుడు.. అధిక ఉష్ణోగ్రత దగ్గర అవి కరిగిపోయి.. ఇంజిన్ లోపలి భాగంలో గట్టిపడతాయ్. ఇది.. ఇంజిన్ పనితీరుని అస్తవ్యస్తం చేసి.. చివరికి ఇంజన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. అంతేకాదు.. బూడిద కణాలు విమానం బయటి భాగాన్ని, విండ్ షీల్డ్‌పై గీతలు పడేలా చేస్తాయ్.
బూడిద మేఘంతో అలర్ట్ అయిన ఎయిర్‌లైన్స్
కొన్నిసార్లు సెన్సార్లు కూడా పనిచేయకుండా పోయే చాన్స్ ఉంది. విమానం వేగం, ఎత్తు లాంటి కీలకమైన డేటాని సేకరించే సైన్సార్లని బూడిద మూసివేసి.. అవి ఫెయిలయ్యేందుకు కారణమవుతుంది. అందువల్ల.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. భారతీయ విమానయాన సంస్థలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. బూడిద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో.. విమాన ప్రయాణ లెవల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇంజిన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్‌లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఎయిర్‌లైన్లు కూడా అలర్ట్ అయ్యాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి.
ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైతే.. దాని తాలూకూ బూడిద ఇక్కడిదాకా ఎలా వచ్చిందనేదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. ఎందుకంటే.. ఇథియోపియా ఎక్కడో తూర్పు ఆఫ్రికాలో ఉంది. అక్కడ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే.. దాని బూడిద ఇక్కడిదాకా చేరుకోవడానికి ప్రధాన కారణం.. అధిక ఎత్తులో వీచే బలమైన గాలులే. దానివల్లే.. బూడిద మేఘం తూర్పు దిశగా వేగంగా ప్రయాణించింది. అలా.. ముందుగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించింది. ఆ తర్వాత.. యెమెన్, ఒమన్ మీదుగా అరేబియా సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. చివరికి.. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ వైపు కదిలింది. అగ్నిపర్వతం బద్దలైన కొద్ది గంటల్లోనే బూడిద మేఘం.. ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి.. భారత గగనతలాన్ని తాకింది. అగ్నిపర్వతం బూడిద మేఘం.. విమానాలు ప్రయాణించే ఎత్తులో కదులుతుండటంతో.. విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.
ఇథియోఫియాలో బద్దలైన అగ్నిపర్వతానికి సంబంధించిన బూడిద, దుమ్ము కణాలు.. ఇండియా మీదే ఉన్నాయ్. ఆకాశంలో పెద్దఎత్తున పొగ వ్యాపించి.. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ అగ్నిపర్వత బూడిద మేఘం.. భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా? దానివల్ల.. నార్త్ ఇండియన్స్‌కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? మన వెదర్‌పై.. యాష్ క్లౌడ్ ఎఫెక్ట్ ఎంత?
వాతావరణం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!
ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద, దుమ్ము కణాలు భారతదేశ ఆకాశంపైకి విస్తరించడం వల్ల.. ఇక్కడి వాతావరణం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బూడిద మేఘం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం అనేది తాత్కాలికమే. కానీ.. దీర్ఘకాలికంగా ఈ బూడిద మేఘం భారతదేశ వాతావరణంపై, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అగ్నిపర్వత బూడిద మేఘం భూమికి చాలా ఎత్తులో.. స్ట్రాటోస్పియర్ వరకు చేరితే, అది భారతీయ వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
సూర్యరశ్మి భూమికి చేరకుండా అడ్డుకునే బూడిద కణాలు
బూడిద కణాలు వాతావరణంలో దట్టంగా వ్యాపించినప్పుడు, అవి సూర్యరశ్మిని భూమికి చేరకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా, భూమి ఉపరితలంపై చేరే సూర్యరశ్మి తీవ్రత తగ్గుతుంది. దీనినే గ్లోబల్ డిమ్మింగ్ అంటారు. సూర్యరశ్మి తగ్గడం వల్ల భూమి ఉపరితలం చల్లబడుతుంది, అప్పుడు.. ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, బూడిద కణాలు కొన్నిసార్లు వేడిని కూడా పట్టి ఉంచుతాయి, కాబట్టి దీని ప్రభావం కాస్త ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. బూడిదలోని సల్ఫర్ డయాక్సైడ్ వాయువు.. గాలిలోని నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏరోసోల్స్‌గా మారుతుంది. ఈ ఏరోసోల్స్ మేఘాల నిర్మాణ ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీనివల్ల వర్షపాతంలో మార్పులు సంభవించొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం గానీ, పెరగడం గానీ జరిగే చాన్స్ ఉంది.
బూడిద గాలిలో కలిస్తే ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు
అగ్నిపర్వతం నుంచి బయటకొచ్చిన ఈ బూడిద మనుషుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ బూడిద గాలిలో కలిసినప్పుడు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. కళ్లలో దురద, చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా ఉన్నవారికి దీనివల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ బూడిద మేఘం ఏర్పడినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెప్పారు. శరీరానికి ప్రమాదకర గాలి తగలకుండా చూసుకోవాలన్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధ పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిపర్వత బూడిదలోని కణాలు, ప్రత్యేకించి అవి భూమికి దగ్గరగా ఉన్నప్పుడు.. ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి.
బూడిదలో సిలికాతో పాటు ఇతర విషపూరిత లోహాలు ఉంటాయి. ఈ బూడిదలోని.. పీఎం 2.5, పీఎం10 లాంటి అతి సన్నని కణాలు ఊపిరితిత్తులలోకి లోతుగా ప్రవేశించే చాన్స్ ఉంది. ఇది.. అస్తమా, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ వ్యాధులను పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి, పిల్లలకు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. బూడిద కణాలు కళ్లలో పడితే.. కళ్లు ఎరుపెక్కడం, మంటగా ఉండటం, కళ్ల కలక లాంటి సమస్యలకు దారితీయొచ్చు. ఇవి చర్మంపై పడినప్పుడు దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. గాలిలోని కాలుష్య కణాలు రక్తంలోకి ప్రవేశించి, రక్త నాళాలు, గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తీవ్రత తక్కువగా ఉంటే.. ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి సాధారణ అసౌకర్యాలు కూడా కలగొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
ఈ బూడిద మేఘం భూమికి దగ్గరగా ఉంటే.. ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతల తాత్కాలిక తగ్గుదలకు దారితీసే అవకాశం ఉంది. యాష్ క్లౌడ్స్.. స్ట్రాటోస్పియర్‌లో ఎక్కువ కాలం ఉంటే, అది రుతుపవనాల నమూనాపై స్వల్ప ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. బూడిద కణాలు వాతావరణం పై పొరల నుంచి కిందికి దిగివస్తే, అది భారతదేశంలో గాలి నాణ్యతను మరింత దిగజార్చి ఆరోగ్య సమస్యలను పెంచే ప్రమాదం ఉందంటున్నారు. అందువల్ల.. భారత ఆరోగ్య శాఖ ఈ పరిస్థితిని నిశితంగా గమనించడం ముఖ్యం. ఎయిర్ క్వాలిటీ పడిపోయినప్పుడు.. ఇంట్లోనే ఉండటం బెటర్. ఈ అగ్నిపర్వతం తాలూకూ బూడిద ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ.. పర్యావరణం, ప్రజారోగ్యంపై పరిశీలన అవసరమంటున్నారు.
Story By Anup, Bigtv