BigTV English

Gangula vs Mayor: ఛాలెంజ్‌లో గెలిచేది ఎవరు? గంగులని ఓడించడం సాధ్యమేనా..?

Gangula vs Mayor: ఛాలెంజ్‌లో గెలిచేది ఎవరు? గంగులని  ఓడించడం సాధ్యమేనా..?

Gangula vs Mayor: మొన్నటివరకి ఒకే పార్టీ లో కలిసిమెలసి ఉన్నారు. పరిపాలన, ఇతరాత్ర వ్యవహారాల్లో అన్నీ తామై నడిపిస్తూ అంటకాగారు. ఏళ్ల తరబడి కొనసాగిన వారి స్నేహబంధం తెగిపోయింది. వారిలో ఒకరు పార్టీ మారగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరస్పరం అవినీతి బురదజల్లుకుంటున్నారు. మొన్నటి దాక చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నాయకులు ఇప్పుడు తమతో పాటు పార్టీకి కూడా అవినీతి మరకలు అంటిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ శత్రువులుగా మారిన ఆ మిత్రులు ఎవరు?


కరీంనగర్ మున్సిపల్ కార్పరేషన్ మేయర్ సునీల్ రావు బీఅర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. దాంత ఇన్ని రోజులు గులాబీ పార్టీలో ఆప్త మిత్రుల్లా వ్యవహరించిన మేయర్ సునీల్ రావు, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. మేయర్ పదవీకాలం ముగుస్తున్న సమయంలో సునీల్ రావు పార్టీ మారాడాన్ని గంగుల కమలాకర్ వర్గం జీర్ణించుకోలేక పోతుందంట. బీఅర్ఎస్ లోకి వచ్చాడు మేయర్ పదవి దక్కించుకున్నాడు.. పదవీ కాలం ముగుస్తుండంతో పార్టీ ఫిరాయించేశాడని దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా గంగుల కమలాకర్ వర్గం కార్పొరేటర్లు మేయర్ సునీల్‌రావుపై అవిశ్వాసం కూడా పెట్టారు. నిన్న మొన్నటివరకి తామంతా ఒకటేనంటూ ఢంకా బజాయించిన నేతలు.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేపధ్యంలో కార్పోరేషన్ లో అవివీతి జరిగిందని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అయితే మేయర్, ఎమ్మెల్యేల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయంట. ఇప్పుడు మేయర్ పార్టీ మారడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమంటున్నాయంట. అవినీతి ఆరోపణలు, ఆక్రమణలపై విచారణ జరపాలని సవాళ్లు చేసుకుంటున్నారు.


సునీల్ రావు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ నుంచి బీఅర్ఎస్‌లో చేరారు.. కరీంనగర్‌లో రావు సాబ్‌గా పిలుచుకునే సునీల్ రావుకు ఆ పార్టీలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అండదండాలతో పాటు బీఅర్ఎస్ పెద్దలు అంతే వాల్యూ ఇచ్చారు. కరీంనగర్ కార్పోరేషన్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక డివిజన్లు గెలవడంలో గంగుల కమలాకర్ కీలక పాత్ర పోషించారు. బీఅర్ఎస్ మేయర్ అభ్యర్ధిని ఎంపిక చేసే టైమ్‌లో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తన చిన్ననాటి మిత్రుడు రాజేందర్‌రావుని మేయర్‌ చేయాలని భావించి అధిష్టానానికి సిఫార్సు చేశారు.

అయితే బీఅర్ఎస్ మాత్రం స్థానిక మంత్రి సిఫార్సులు పట్టించుకోకుండా సునీల్ రావుకే మేయర్‌గా అవకాశం కల్పించింది .. అప్పట్లో ఇద్దరూ కలిసిమెలిసి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ బలంగా ఆదేశించారు. అయినా కొద్ది రోజులు మేయర్, ఎమ్మెల్యేలు అంటీముట్టనట్టుగానే మెసిలారు.. ఆ క్రమంలో గంగుల కమలాకర్ మంత్రి కావడంతో తప్పని పరిస్థితులలో సునీల్ రావు కలిసిపొయాడు.. మేయర్‌గా తాను సూచించిన వ్యక్తికి అవకాశం దక్కకపోవడంతో.. డిప్యూటీ మేయర్ పదవిని గంగుల తన అనుంగ అనుచరుడు చల్లా హరిశంకర్ సతీమణి చల్ల స్వరూపరాణికి ఇప్పించుకోగలిగారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత గంగుల, సునీల్‌ల మధ్య విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఆ ఎన్నికలలో మేయర్ సునీల్ రావు బీఅర్ఎస్ కి సపోర్ట్ చేయకుండా బీజేపీకి చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు గుప్పించింది. బీఅర్ఎస్ అధికారం కోల్పోవడంతో మేయర్ ఎమ్మెల్యే గంగుల తో సంబంధాలు తగ్గించేశారు. తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో‌ బండి సంజయ్‌కి పుల్ సపోర్ట్ చేసారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందూ బండిసంజయ్ పై ఒంటికాలిపై లేగుస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టిన సునీల్ రావు ..ఆయన రెండో సారి భారీ మెజార్టీతో గెలిచి.. కేంద్రమంత్రి వర్గంలో చేరడంతో ప్లేట్ మార్చేశారు.

Also Read: గద్దర్ అవార్డులకు అర్హుడు కాదా? అసలు కథ ఇదే..

బండిసంజయ్ కేంద్రమంత్రి‌ అయ్యాక అయనని కలిసి బోకే ఇవ్వడంతో ఆరునెలల ముందే సునీల్ రావు బీజేపీలో చేరతారన్న పుకార్లు షికారు చేశాయి. ఇదే సమయంలో ‌సునీల్ రావు నిబంధనలకు విరుద్దంగా విదేశాల్లో అధికారిక పర్యటనకు ఎలా వెళతారంటూ గంగుల వర్గం కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది.. మేయర్‌ని తప్పించి డిప్యూటీ మేయర్‌కి చార్జ్ ఇవ్వాలని పెద్ష రచ్చే చేసింది. దీంతో మేయర్ సాబ్ పర్యటన పూర్తికాకుండా అర్ధాంతరంగా తిరిగి వచ్చేశారు. అప్పటినుండే వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గంగుల కమలాకర్ బీఅర్ఎస్ నుంచి తన వర్గం కార్పొరేటర్లో కాంగ్రెస్ లోకి వెళ్ళినా చూస్తూ ఉండిపోయారు. గంగుల ప్రోత్సాహంతోనే వారు పార్టీ మారారన్న ప్రచారం జరిగింది. తర్వాత కొద్దిరోజుల నుండి సైలెంట్ గా ఉన్నా గంగుల కమలాకర్ ఇప్పుడు మేయర్ పార్టీ మారడంతో ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు.

సునీల్ రావు, గంగుల కమలాకర్‌ల ఆరోపణలు, ప్రత్యారోపణలు హాట్‌టాపిక్‌గా మారాయి. సునీల్ పార్టీ మారుతూ బీఅర్ఎస్‌ని, పార్టీ పెద్దలని ఏమి అనకుండా డైరెక్ట్‌గా గంగులని టార్గెట్ చేసారు. టెండర్ల సమయంలో కమీషన్లు దండుకున్నారని.. కేబుల్ బ్రిడ్జ్ మానేరు రివర్ ఫ్రంట్ టెండర్లలో అంతా అవినీతే జరిగిందని గంగుల కమలాకర్‌పై ధ్వజమెత్తారు. తాను కరీంనగర్ కార్పోరేషన్ ని స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పరుస్తుంటే అడుగడుగునా అడ్డుకున్నారని.. కమిషన్ల గంగుల అంటూ మాజీ మంత్రికి ట్యాగ్ లైన్ తగిలించేశారు. ఇకపై గంగుల ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఓడిస్తానని ఛాలెంజ్ విసిరారు.

ఇన్ని రోజులు ఒకే పార్టీలో కలిసిమెలిసి ఉండి ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విసురుకుంటున్న సవాళ్లు కరీంనగర్ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి.. మరిప్పుడు మేయర్ సునీల్‌బాబు కేంద్రమంత్రి బండి సంజయ్ పక్కన చేరడంతో మున్ముందు అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×