Warangal BRS: ఓరుగల్లు బీఆర్ఎస్ నాయకులపై అధిష్టానానికి నమ్మకం పోతోందా? ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో అక్కడి నేతలు విఫలమవుతున్నారని గులాబీ పెద్దలు భావిస్తున్నారా? మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యానికి ఆ నేతల తీరే కారణమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకే వరంగల్ జిల్లాలో మూలనపడుతున్న కారును తిరిగి ట్రాక్‌లో పెట్టడానికి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందట. ఇంతకీ జిల్లా బీఆర్ఎస్ ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలేంటి?
ఓరుగల్లు జిల్లా… గులాబీ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. అక్కడి నాయకులు సైతం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సమర్ధులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి రెండేళ్ల క్రితం వరకు ఆ పార్టీకి ప్రత్యేకంగా బలమైన క్యాడర్ ఉండేది. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా అక్కడి నాయకుల్లో దూకుడు కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయట. క్యాడర్ మాత్రమే కాదు, లీడర్లు సైతం డీలా పడిపోయి ప్రజా క్షేత్రంలోకి రావడానికి వెనుకాడుతున్నారట.
అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఓరుగల్లు గులాబీ నేతలు, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారట. కానీ పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు, అరకొర స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటి పట్టణాల్లో తమ పార్టీ బలంగా ఉందని చెప్పుకుందామని ప్రయత్నిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ కావడంతో ఖంగుతిన్నారట. రోజురోజుకు ప్రజల్లో పార్టీ బలహీన పడుతుండడం, ప్రజాక్షేత్రంలోకి నేతలు వెళ్లేందుకు వెనుకాడుతుండడంతో అధిష్టానం సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై గుర్రుగా ఉందని తెలుస్తోంది.
ఓ వైపు ఎన్నికల్లోనూ ఢీలా పడటం, మరోవైపు గ్రూపు రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీని వరంగల్ నేతలు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని అధిష్టానానికి సంకేతాలు వెళ్లాయట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్దేందుకు, వరంగల్ లో గులాబీ పార్టీ పతనాన్ని అరికట్టేందుకు, ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించిందట అధిష్టానం. అందుకే గత వారం రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దేవాదుల ప్రాజెక్టు, సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలన కోసం హరీష్ రావు రెండుసార్లు జిల్లాలో పర్యటించారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులపై, వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ, గులాబీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట.
హరీష్ రావు ఎంట్రీతో, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగడంతో పాటు… గులాబీ నేతల మధ్య వర్గ పోరుకు సైతం చెక్ పడుతుందని ఆపార్టీ సీనియర్లు భావిస్తున్నారట. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, మునిసిపాలిటీలలో గులాబీ జెండా ఎగురుతుందని అతి విశ్వాసంతో బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరుతోనే కనీసం బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, ములుగు, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలలో ఏకపక్షంగా హస్తం హవా కొనసాగింది.
మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు సాధించిన జనగామ, వర్ధన్నపేట, తొర్రూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాల్సింది పోయి, మాకెందుకులే అంటూ… ఫామ్ హౌస్ లకు పరిమితమయ్యారట. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఒంటరి పోరు చివరికి బూడిదలో పోసిన పన్నీరు అయిందని గులాబీ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు.
కేటీఆర్ కోటరీ, యువ నాయకత్వం అంటూ కొంతమంది మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న అతివల్లే పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతోందని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ఒక్క పదాన్ని పట్టుకొని వేలాడుతూ, తమపై ప్రజలు చూపించిన తీవ్ర వ్యతిరేకతను మర్చిపోతున్నారని మరికొందరు భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దకపోతే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పల్టీలు కొట్టాల్సివస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
అందుకే ట్రబుల్ షూటర్ హరీష్ రావు వరంగల్ జిల్లా పై ఫోకస్ చేశారని, తరచూ పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి హరీష్ రావు ఎంట్రీతో ఓరుగల్లు గులాబీ నేతల మధ్య వర్గ పోరుకు పుల్ స్టాప్ పడుతుందా?… కార్పొరేషన్ ఎన్నికల నాటికి కారు పార్టీ కొంతైనా ప్రభావం చూపగలుగుతుందా.? అనేది చూడాలి.
Also Read: నాగర్‌కర్నూల్ మున్సిపల్ ఎన్నికల్లో.. ఇద్దరు జనార్దనులు కలిసి వేసిన స్కెచ్ బెడిసి కొట్టిందా?
Story by: Apparao, Big Tv