AP Politics: ఏపీలో కూటమి స్నేహం కలకాలం ఉండాలని నేతలు అనుకుంటుంటే కూటమిలో వివిధ స్థాయిల్లోని నేతలు మాత్రం పై చేయి అంటూ పోటీలు పడుతున్నారు.. ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ బలంగా ఉండాలని కార్యకర్తలు అనుకోవడం సహజం.. దానికి అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడానికి నేతలతో పాటు కష్టపడుతుంటారు కార్యకర్తలు.. ఒక రాజకీయ పార్టీలోనే మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది మూడు పార్టీలు కలిసిన కూటమి కుంపట్లతో అధినేతలకు తలనొప్పి తప్పడం లేదంటున్నారు. ఇలాంటి సమయంలో టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతో కూటమి భాగస్వామ్య ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందంట .. అసలు కూటమిలో ఏం జరుగుతుంది? సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
ఏపీలో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. అప్పటివరకు రాజకీయ శత్రువులుగా ఉండి ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్న నాయకులు అంతా, తామంతా ఒకటే అంటూ కూటమిగా ఏర్పడి ప్రజాక్షేత్రంలో దిగి కనీ వినీ ఎరగని రీతిలో విజయాన్ని సాధించారు.. కూటమి విజయం సాధించి ఏడాది దాటి పోయింది. అక్కడక్కడ చిన్నచిన్న మనస్పర్ధలు తప్ప ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధినేతలు సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు.. ఎవరైనా లైన్ దాటి మాట్లాడితే వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
టీడీపీ సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంతో చిక్కులు
ఇక్కడ వరకు అంతా బానే ఉందని, అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతోనే చిక్కంతా వచ్చి పడిందంటున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అర్థం కాక కూటమిలోని భాగస్వామ్యం పార్టీలు తికమక పడుతున్నాయంట.. ఒకవేళ సూపరిపాలన తొలి అడుగు ప్రభుత్వ కార్యక్రమం అయితే స్థానికంగా ఉండే జనసేన, బిజెపి నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మిగిలిన రెండు పార్టీలను విస్మరిస్తూ టిడిపి నేతలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ఏడాది పాలనపై తాము చేసిన మంచి చెప్తున్నారు.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లలో ముందుకు పడని తొలిఅడుగు
అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యేలుఉన్న నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. జనసేన బిజెపి ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి మంత్రులు స్వయంగా ఏడాది పాలనపై ప్రచారం చేస్తూ ప్రజల నుండి సమస్యలు అడిగి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నారు.. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు.. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన, బిజెపి నేతలు దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో కూటమి ఏడాది పాలన విజయవంతం అవ్వడంలో జనసేన, బిజెపి ప్రమేయం లేదా అని కూటమి శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.
సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే జిల్లా
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో సైతం రాజకీయ చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో పార్టీలకు చెందిన నేతలను సామాజిక వర్గాలను బట్టి ఓన్ చేసుకుంటారు ఇక్కడ ప్రజలు.. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలుపొందింది.. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నరసాపురం, భీమవరం, పోలవరం, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు అక్కడి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు.
Also Read: కేసీఆర్ సన్నిహితులకు కేటీఆర్ చెక్!
సరిగ్గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు లోకల్ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఆ నియోజకవర్గ అధికారులతో రివ్యూ సమావేశాలు పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులతో మంత్రి రివ్యూ సమావేశం పెట్టినప్పుడు తప్పకుండా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మంత్రులు ఆ నియోజకవర్గంలో ఉన్న టిడిపి ఇన్చార్జి తో కలిసి రివ్యూ సమావేశాలు పెట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది..
పోలవరం నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణి సమీక్ష
పోలవరం నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణి, తాడేపల్లి గూడెంలో మాంత్రి నారాయణ, నిడదవోలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సాపురంలో అనగాని సత్య ప్రసాద్, ఉంగుటూరు నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు.. మంత్రులు పర్యటించిన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించకపోవడం పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాది పాలన తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసిందా అందులో జనసేన, బిజెపి పాత్ర లేదా అని కూటమి ఐక్యతని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు
టీడీపీ ఇన్చార్జ్‌ని ప్రమోట్ చేసిన అమాత్యులు
దీనికి తోడు మంత్రులు ఆయా నియోజక వర్గాల్లో పర్యటించినప్పుడు స్థానిక ఉండే టీడీపీ ఇన్చార్జ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని వారు ఏం చెప్పినా కూడా చేయాలని చెప్పడం అక్కడ ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదంట. తమ పార్టీకి ఇచ్చినవే 21 నియోజకవర్గాలు అందులో మళ్ళీ వేరు కుంపట్లు పెట్టేలా, టీడీపీ నేతలను ప్రోత్సహించేలా మంత్రులు మాట్లాడటం పై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు అటు టిడిపి ఇటు జనసేన నేతల మధ్య నలిగిపోతుంటే, ఇప్పుడు బహిరంగంగానే మంత్రులు జనసేన పార్టీ ఎమ్మెల్యే లు ఉన్నచోట టిడిపి నేతలకు సహకరించాలని అధికారులకు చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు..
ఇంటింటికి జనసేన పేరుతో కార్యక్రమాలకి రంగం సిద్దం
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తాము పడుతున్న ఇబ్బందులని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మొరపెట్టుకుంటున్నారంట. జనసేన పార్టీ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంటింటికి జనసేన వంటి టాగ్ లైన్‌తో కార్యక్రమాలు నిర్వహించడానికి రంగం సిద్దం చేస్తున్నారంట. కూటమి ఐక్యత 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని, సుదీర్ఘకాలం తామే అధికారంలో ఉంటామని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు పదేపదే చెప్తుంటే.. గోదావరి జిల్లాలో పరిస్థితి చూస్తూ.. ఇదేం స్నేహం.. ఎవరికి వారు విడివిడిగా తమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఏం సదేశమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారంట.
Story By Rami Reddy, Bigtv