AP New Ration Cards: వైసీపీ మాదిరిగా కాకుండా పక్కాగా పథకాలను అమలు చేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. రెండు దశాబ్దాలపాటు తాము అధికారంలో ఉంటామని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. అందుకు అనుగుణంగా బలమైన వ్యవస్థను రెడీ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆగష్టు నెల ఏపీ ప్రజలకు శుభవార్త అని చెప్పాలి. ఆలస్యమైనా ఎక్కువ పథకాలు ప్రవేశపెడుతోంది. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేయనుంది. ఆగస్టు 15న ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. ఇక కొత్త రేషన్ కార్డులు ఆగస్టు 25 నుంచి పంపిణీ చేస్తామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు.
ఏపీలో కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అదే నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈసారి క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా మొదలుకానుంది.
జిల్లా స్థాయిలో మంత్రులు, ఎంపీలు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా కార్డులను పంపిణీ చేస్తారని తెలియజేశారు. మంగళవారం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన సదరు మంత్రి, కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై ఇవ్వబోయే రేషన్ కార్డులపై సీఎం సహా ఎవరి ఫొటోలు ఉండవని తేల్చి చెప్పారు.
ALSO READ: తిరుమలలో రద్దీ.. రికార్డు స్థాయిలో ఆదాయం
కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలు మాత్రమే కనిపించనున్నాయి. అలాగే కొత్త రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులపై 16 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 15 లక్షలకు పైగానే అధికారులు పరిష్కరించారు. 9 లక్షల పైచిలుకు కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం.
ఆయా కార్డులతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య దాదాపు కోటి 46 లక్షలకు చేరింది. కొత్త కార్డులతో లబ్దిదారుల సంఖ్య దాదాపు 4 కోట్ల 29 లక్షల మందికి చేరనుంది. అయితే కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ ఎప్పటి నుంచి ఇస్తామన్న దానిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. వారికి ఆగష్టు నుంచి రేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
స్మార్ట్ కార్డుల వల్ల మోసాలకు అడ్డుకట్ట పడుతోందని ప్రభుత్వం మాట. రేషన్ బియ్యం ఉండి లేవని చెప్పడానికి వీల్లేదు. ఈ కార్డు ద్వారా అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయి. ఏమి జరిగినా చివరకు పేదలకు లబ్ది చేకూరడమే ప్రభుత్వ ఆలోచన. అందులో ఏ మాత్రం లోపాలున్నా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్త రేషన్ కార్డులను ఎలాంటి సమయం లేదని అంటున్నారు.