Maoist Encounter: ఈ ఒక్క ఏడాదిలోనే.. ఎంతో మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో పోయారు. వారిలో.. సెంట్రల్ కమిటీ మెంబర్ల నుంచి మావోయిస్ట్ పార్టీలో ఏళ్లుగా పాతుకుపోయిన అగ్రనేతలు ఉన్నారు. కానీ.. ఒక్క హిడ్మా ఎన్‌కౌంటరే.. ఇండియా మొత్తం రీసౌండ్‌లో వినిపిస్తోంది. వందలమంది పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు పోయేందుకు కారణమైన హిడ్మా.. ఇంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికాడు? హిడ్మాని ఎలా ట్రాప్‌లో పడ్డాడు? ఇంతకాలం దొరకనోడిని.. ఇప్పుడెలా రౌండప్ చేశారు? హిడ్మా ఎన్‌కౌంటర్ వెనుక అసలేం జరిగింది?
హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత.. రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే. ఇన్నాళ్లూ దొరకని వ్యక్తి.. ఇప్పుడెలా దొరికాడు? దాదాపు 26 సార్లు భద్రతా దళాలపై దాడులు చేసినోడు.. ఒక్కసారి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నోడు.. ఇప్పుడెలా దొరికాడు? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా ఉన్న హిడ్మా.. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే.. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత.. మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైంది. అడవిలో సీన్ మారింది.
ఈ ఒక్క ఏడాదిలోనే ఎంతోమంది మావోయిస్టులు.. ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. కానీ.. వాటన్నింటిలో హిడ్మా ఎన్‌కౌంటరే అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. అంతకుమించి.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్‌కి.. కమాండర్. సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
దేశంలో మావోయిజాన్ని రూపుమాపేందుకు.. భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలో.. వందల మంది పోలీసులు, కేంద్ర బలగాల ప్రాణాలు తీసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడన్న వార్త.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో.. పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించినప్పటికీ.. ఒక్క హిడ్మా మరణమే ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. మావోయిస్ట్ పార్టీలో అతనికి ఉన్న ట్రాక్ రికార్డే.
పార్టీలో అతని హోదా, హిడ్మా చేపట్టిన గెరిల్లా దాడులు, ఇన్నాళ్లూ భద్రతా బలగాలకు దొరకకుండా తప్పించుకున్న చరిత్రే.. హిడ్మాపై ఇంత చర్చ జరిగేలా చేస్తోంది. అయితే.. హిడ్మాని రౌండప్ చేయడానికి దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయ్. అతను భద్రతా దళాలకు చిక్కకుండా ఇన్నేళ్లూ తప్పించుకోగలిగాడంటే అందుకు ప్రధాన కారణం.. అతని చుట్టూ ఉన్న మూడంచెల భద్రతా వ్యవస్థే! స్థానిక గిరిజనుల సహకారం, అడవులపై అతనికి ఉన్న తిరుగులేని పట్టు, చుట్టూ ఉండే సెక్యూరిటీ రింగ్ వల్లే.. హిడ్మా ఇన్నాళ్లూ సేఫ్‌గా ఉన్నాడు. అయితే.. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన వ్యూహాత్మక ఆపరేషన్ల కారణంగా.. హిడ్మా ట్రాప్‌లో పడ్డాడనే వాదన వినిపిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌తో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయ్. దశాబ్దాలుగా మావోయిస్టులను పట్టుకోవడంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు.. భద్రతా బలగాలు లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాయి. డ్రోన్‌లు, శాటిలైట్ మ్యాపింగ్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కదలికలను నిరంతరం ట్రాక్ చేయగలిగారు. దాంతో.. హిడ్మా ఆపరేషనల్ పాయింట్ అయిన దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలు కష్టమయ్యాయ్. అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో.. హిడ్మా తన భార్య మడకం రాజే సహా కీలక రక్షణ దళ సభ్యులతో కలిసి.. షెల్టర్ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే.. హిడ్మా బృందం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లోకి ప్రవేశించింది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో మావోయిస్టులకు ఓ షెల్టర్‌జోన్‌గా ఉండేది. అలా.. ఈసారి కూడా ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు, కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండేందుకు.. మారేడుమిల్లికి వచ్చినట్లు సమాచారం. అయితే.. హిడ్మా కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ బ్రాంచ్‌కి, తెలంగాణ ఇంటలిజెన్స్‌కి కచ్చితమైన నిఘా సమాచారం అందింది. అలా హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయ్. మావోయిస్టుల అంతర్గత సమాచారాన్ని ఛేదించడమే.. ఈ ఆపరేషన్‌కు కీలకంగా మారింది.
హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే నిఘా సమాచారం అందిన వెంటనే.. ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, జిల్లా పోలీసు బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ప్రారంభించాయ్. కూంబింగ్ మొదలుపెట్టి.. పక్కాగా ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి 7 గంటల మధ్య.. హిడ్మా బృందం అటవీప్రాంతంలో హిడ్మా బృందం భద్రతా బలగాలకు ఎదురుపడింది. దాదాపు అరగంట నుంచి గంట పాటు పోలీసులు, హిడ్మా దళం మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయ్. హిడ్మా తన రక్షణ దళంతో పోరాడినా.. చివరికి పోలీసు బలగాల వ్యూహానికి చిక్కక తప్పలేదు. ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య రాజే సహా మొత్తం ఆరుగురు కీలక మావోయిస్టులు మరణించారు. వారంతా.. హిడ్మా రక్షణదళంలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీకి.. హిడ్మా ఎన్‌కౌంటర్ కోలుకోలేని దెబ్బగా మారింది. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మావోయిస్టుల నివాసాల వివరాలు, సంప్రదింపుల కోడ్‌లు, ఆయుధాల డంప్‌ల గురించి తెలుసుకున్నారు. దాంతో.. నాలుగు రాష్ట్రాల్లో ఆయుధాల డంప్‌లని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.
హిడ్మా మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగానే కాదు.. పీఎల్‌జీఏ బెటాలియన్ నెంబర్ వన్‌కి కమాండర్ కూడా. ఇది.. మావోయిస్ట్ పార్టీలో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన దళం. హిడ్మా జరిపిన అనేక దాడుల్లో.. ఎంతోమంది పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది మరణించారు. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాగా.. హిడ్మా బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన.. ఏకైక గిరిజన నాయకుడు. ఇది.. అతని ప్రభావాన్ని, స్థానికంగా ఉన్న పట్టుని సూచిస్తుంది. హిడ్మా మరణం.. మావోయిస్ట్ పార్టీ సామర్థ్యం, అంతర్గత వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. యువతని రిక్రూట్ చేయడంలోనూ, దండకారణ్యంలో దాడులను సమన్వయం చేయడంలో హిడ్మాకు తిరుగులేదు. అలాంటి వ్యక్తి ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా, భద్రతా బలగాలకు చరిత్రాత్మకమైన విజయంగా విశ్లేషిస్తున్నారు.
నూరు గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు చనిపోయినట్లు.. ఎన్నో గెరిల్లా దాడులకు స్కెచ్‌లు వేసినోడు, వందల మంది పోలీసులు, జవాన్ల ప్రాణాలు పోయేందుకు కారణమైనోడు, దండకారణ్యంలో అడుగుపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచించుకునేలా చేసినోడు.. చివరికిలా ఏపీలోని మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడని ఒక్కరు కూడా గెస్ చేయలేదు. ఇందుకు.. హిడ్మా దండకారణ్యం దాటడమే కారణమా? అక్కడే ఉంటే.. ఇంకొన్నాళ్లు సేఫ్‌గా ఉండేవాడా? హిడ్మా చేసిన పొరపాటే.. అతని ప్రాణాలు పోయేందుకు కారణమైందా?
హిడ్మా పోలీసుల హిట్ లిస్టులో ఉన్నాడు. అతను.. పోలీసుల ఎదురుకాల్పుల్లో గనక చనిపోవాల్సి వస్తే.. కచ్చితంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలోనే ప్రాణాలు కోల్పోతాడనే అంచనా ఉంది. కానీ.. ఇలా ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చి.. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోతారని ఎవరూ అనుకోలేదు. దీనంతటికీ.. హిడ్మా దండకారణ్యం దాటడమే కారణమా? ఇంతకాలం.. బస్తర్ బయట అడుగు పెట్టని హిడ్మా.. ఇప్పుడెందుకు ఛత్తీస్‌గఢ్ బోర్డర్ దాటి.. ఏపీలోకి ఎంటరయ్యాడు? దండకారణ్యం దాటడం వల్లే.. హిడ్మా ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాడా?
గెరిల్లా దాడుల్లో తిరుగులేని వ్యూహకర్త. దశాబ్దాలుగా భద్రతా బలగాలకు సింహస్వప్నం. అలాంటి హిడ్మా మరణం.. మొత్తం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని తనకు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని దాటి.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు గురికావడం వెనుక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. దండకారణ్యం నుంచి రావడమే.. హిడ్మా చేసిన పొరపాటనే చర్చ కూడా మొదలైంది. అక్కడే ఉన్నన్ని రోజులు హిడ్మా బాగానే ఉన్నాడు. దండకారణ్యం మొత్తం అతనికి కొట్టిన పిండి. అందుకే.. 20 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. దండకారణ్యం దాటాడు. ఆ మధ్య తెలంగాణలోని కర్రెగుట్టల్లోకి మకాం వేశాడనే వార్తలు వినిపించాయ్. అప్పుడే.. హిడ్మాని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ.. హిడ్మా తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడిలా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు.
హిడ్మా తన కంచుకోటని దాటి.. ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ఇటీవలి కాలంలో తలెత్తిన పరిస్థితులే కారణం. కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేతకు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లని చేపట్టాయ్. డ్రోన్లతో నిఘా, కట్టుదిట్టమైన ట్రాకింగ్, స్థానికుల నుంచి తగ్గుతున్న మద్దతు కారణంగా.. దండకారణ్యంలో హిడ్మా అండ్ టీమ్‌కు సేఫ్ జోన్స్ కరువయ్యాయి. ముఖ్యంగా.. మావోయిస్టులకు ఎంతో కీలకమైన లాజిస్టిక్ లైన్‌లు దెబ్బతిన్నాయ్. ఆహారం, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడింది. ఈ ప్రెజర్‌ని తట్టుకోలేక.. కొన్నాళ్లు బ్రేక్ తీసుకుందామనే ఆలోచనతోనే.. హిడ్మా తన కార్యకలాపాలను ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలకు మార్చినట్లు తెలుస్తోంది.
ఎన్‌కౌంటర్‌కు కొద్ది రోజుల ముందు హిడ్మా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయ్. కానీ.. పోలీసులు మాత్రం హిడ్మాకు అలాంటి ఆలోచన లేదని.. ఉద్యమాన్ని కొనసాగించాలనే అనుకున్నారని చెబుతున్నారు. మొదట.. తెలంగాణ అడవుల్లో మకాం వేయాలనుకున్నా.. ఏపీ అడవులే సేఫ్ అని భావించి ఇక్కడికి వచ్చారన్నారు ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా.
నిజానికి.. మావోయిస్టులు తరచుగా ఇతర రాష్ట్రాల్లోని అడవులను షెల్టర్ జోన్లుగా వాడుతుంటారు. ఈ ప్రాంతాలు.. ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల.. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒత్తిడి పెరిగితే.. మరో రాష్ట్రానికి వెళ్లడం సాధారణంగా జరిగేదే. అయితే.. మారేడుమిల్లి అడవులు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో.. హిడ్మా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. హిడ్మా దండకారణ్యం దాటి రావడాన్ని.. అతని వ్యూహాత్మక పొరపాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. హిడ్మా పుట్టి పెరిగిన ప్రాంతం దండకారణ్యం. ఆ ప్రాంతం గురించి, అక్కడి దారుల గురించి.. అతనికి బాగా తెలుసు. పైగా.. అడవుల్లో ఉండే ఆదివాసీల మద్దతు కూడా హిడ్మాకే ఎక్కువ. కానీ.. ఏపీ అడవులపై అతనికి అంతగా పట్టులేదు.
దండకారణ్యం వదిలి కొత్త ప్రాంతానికి రావడం వల్ల.. లోకల్ నెట్‌వర్క్ బలహీనపడింది. ఇదే.. నిఘా వర్గాలు సమాచారం సేకరించేందుకు సులువైంది. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ ముమ్మరం కావడంతో.. ఎలాగైనా సరే ఉద్యమాన్ని కొనసాగించాలనే ఆలోచనతో దండకారణ్యం దాటడమే హిడ్మాని బలహీనపరిచిందనే వాదన చర్చకొస్తోంది. ఈ క్రమంలో అతను మొదలుపెట్టిన జర్నీయే.. హిడ్మాని స్ట్రాంగ్ సెక్యూరిటీ రింగ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని దండకారణ్యం నుంచి ఏపీలోని మారేడుమిల్లి దాకా.. హిడ్మా కదలికలను పోలీసులు పసిగట్టినట్లు తెలుస్తోంది. అంటే.. మావోయిస్టుల అంతర్గత సమాచార వ్యవస్థలో గానీ, హిడ్మా లోకల్ నెట్‌వర్క్‌లో గానీ.. తీవ్ర వైఫల్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే.. అతను ప్రాణాలు కోల్పోయేలా చేసిందంటున్నారు.
Also Read: ఉలిక్కిపడ్డ విశాఖ.. బాలికను నరికి.. డ్రైనేజిలో కాళ్లు,, చేతులు, మొండెం..
ఏదేమైనా.. హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. అనేక గెరిల్లా దాడులకు, భారీ ఎటాక్స్‌కు.. మాస్టర్ మైండ్‌గా ఉన్న వ్యక్తి.. కేవలం తన కంచుకోటని దాటి రావడం వల్ల బలయ్యాడు. హిడ్మాని దండకారణ్యం దాటేలా చేయడంలోనే భద్రతా దళాలు సక్సెస్ అయ్యాయి. అదే.. హిడ్మాని చేరుకునేందుకు మంచి అవకాశాన్నిచ్చింది. హిడ్మా బస్తర్ దాటడం, మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్ పరిణామాలు.. మావోయిస్ట్ పార్టీకి స్ట్రాంక్ మెసేజ్ పంపాయ్. ఇకపై.. దండకారణ్యం కూడా వారికి సేఫ్ జోన్ కాదు. భద్రతా బలగాల యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లు.. సరిహద్దులు దాటి విస్తరించాయనడానికి.. తాజా పరిణామాలే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగని.. హిడ్మా దండకారణ్యంలోనే ఉన్నా అతను ఎంతోకాలం సేఫ్‌గా ఉంటాడనే గ్యారంటీ కూడా లేదు. బలగాలు ఇప్పటికే.. దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లిపోయాయ్. క్యాంప్ కూడా పెట్టేశాయ్. అయితే.. హిడ్మా అక్కడే ఉండి ఉంటే.. ఇంకొంతకాలం ప్రాణాలతో ఉండేవాడు. దండకారణ్యం దాటాడు కాబట్టే.. త్వరగా ప్రాణాలు కోల్పోయాడనే వాదన వినిపిస్తోంది.
Story By Anup, Bigtv