ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీలోని వాట్సప్ గ్రూపులలో ఆడియోలు రిలీజ్ చేస్తూ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు తమ బాధలు వెళ్ళగక్కుతున్నారు. పోలింగ్ సందర్భంగా బూత్ ల వారీ డబ్బుల పంపిణీ వ్యవహారం ఇప్పుడు హస్తం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఆ నిర్వాకంపై పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపులలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కరీంనగర్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ లు 44 ఏర్పాటు చేసారు. వాటిల్లో 11 బూత్ లకి ఒకరు చొప్పున నలుగురు పార్టీ సీనియర్ లీడర్లకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు.
అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి బూత్ బాధ్యతలు అప్పజెప్పి.. డబ్బులు అప్పజెప్పారని ఆయా బూత్ నాయకులు తమ బాధలని వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు డబ్బులు పంపిణీ చేసిన వారిని ఉద్దేశించి తిట్ల దండకం అందుకోగా.. ఓ మహిళ నాయకురాలు ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు , నియోజకవర్గం ఇంచార్జ్ ల పేర్లు ప్రస్తావిస్తూ అవేదనని వెళ్లగక్కారు.
కొంతమంది నాయకులకి 50,000 వేలు ఇచ్చారని, కాని తమలాంటి నిఖార్సైనా కార్యకర్తలకి ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ కార్యకర్త పార్టీ నాయకత్వాన్ని నిలదీసింది.పైసలు తిన్న నాయకులు వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపొతే పెద్ద ఎత్తున లొల్లి పెడుతామంటూ వాట్సప్ గ్రూపులో ఆడియోలని పోస్ట్ చేసింది. ఈ వ్యవహారాలతో కనీసం అధికారం లోకి వచ్చిన తరువాత అయినా కలిసి జట్టు కట్టాల్సిన కరీంనగర్ కాంగ్రెస్ నేతలు.. ఎవరివారే యమునతీరే అన్నట్లు వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠ బజారుకు ఈడుస్తున్నారని స్పష్టమవుతుంది.
Also Read: లైన్ దాటితే ఔట్.. లేడీ బాస్ యాక్షన్ షురూ
నాయకుల మధ్య సమన్వయం , కలుపుగోలుతనం లేకపోవడం వల్లే కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇద్దరూ మంత్రులు ఉన్నా కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం శీతకన్ను వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కరీంనగర్ సెగ్మెంట్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి ముఖ్య నాయకులు కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదని కేడర్ వాపోతుంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. జిల్లాలోని సీనియర్ నాయకులు మంత్రులుగా ఉన్నా కూడా కరీంనగర్ కాంగ్రెస్ మాత్రం అనాధగానే మిగిలిపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ని అంటి పెట్టుకుని ఉన్నవారికి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేవారు లేక.. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్లు తయారైందటున్నారు. ఆ ప్రభావంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా నగదు పంపిణీ వివాదం రచ్చకెక్కి.. పార్టీ పరువు బజారున పడిందని కేడర్ వాపోతుంది.